Breaking News

14/12/2019

వలస పక్షులకు కేరాఫ్ అడ్రస్ గా పాకాల

వరంగల్, డిసెంబర్ 14, (way2newstv.in)
వలస పక్షులకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నిలయంగా నిలుస్తుంది. ఆతిథ్య కేంద్రంగా, విహార స్థలంగా విరసిల్లుతున్న ఈ ప్రాంతంలో పక్షుల ఆవాసాలకు, జీవ మనుగడకు అనువైన ప్రదేశాలు ఉండడంతో ఆయా కాలాలను అనుసరించి పక్షులు వలస వస్తున్నాయి. శీతాకాలం వచ్చిందంటే ప్రతి ఏటా వరంగల్‌లోని పలు చెరువులు, కుంటలు, మడుగుల వద్ద పక్షుల సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా సైబీరియా, ఆస్ట్రేలియా, రష్యా, హిమాలయాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి పక్షులు దక్షిణ భారతదేశంలోని తెలంగాణకు నవంబర్‌లో చేరుకుంటాయి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌లోని పాకాల, కేశవాపూర్, మేచరాజుపల్లి, పరకాల, ఉర్సుముచ్చర్లనాగారం, గణపురం, శాయంపేట చెరువు ప్రాంతాల్లో వలస పక్షులు ఆకట్టుకుంటున్నాయి. 
వలస పక్షులకు కేరాఫ్ అడ్రస్ గా పాకాల

ఒక్క పాకాల సరస్సులోనే ఇప్పటికి 15 రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. ఇక్కడ డిసెంబర్, జనవరిలో దాదాపు 40 నుంచి 50 రకాల పక్షులు కనిపిస్తాయి.  కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో వలస పక్షుల రాక గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. చెరువులు, కుంటలను కృత్రిమ పద్ధతిలో రిజర్వాయర్లుగా మార్చడం లేదా మరమ్మతులు చేయడం వల్ల జలచర జీవుల కొరత ఏర్పడి ఆహారం దొరక్క పక్షుల వలసలు తగ్గిపోతున్నట్లు సమాచారం. దీనికి తోడు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, బయో వ్యర్థాలను చెరువుల్లో వేయడం, ఫ్యాక్టరీల వ్యర్థాలను సమీప చెరువుల్లోకి, చిత్తడి నేలల్లోకి వదలడం ద్వారా నీరంతా కలుషితమవడం వల్ల పక్షులు రకరకాల వ్యాధుల బారిన పడి చనిపోతున్నాయని వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లు పేర్కొంటున్నారు. పంట పొలాల్లో చల్లే విష గుళికల ప్రభావానికి మృత్యువాత పడటం, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, పక్షుల వేట పెరగడం వలసలు తగ్గడానికి కారణమని అంటున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పాకాల వలస పక్షుల విడిది ప్రాంతంగా నిలుస్తుంది. ఇక్కడ 160 రకాల స్థానిక పక్షులు, 50 రకాల వసల పక్షుల మనుగడ సాగిస్తున్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లు మున్నా, చెల్పూరి శ్యాంసుందర్, నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. పాకాలలో పక్షులకు అనువైన జీవవైవిధ్యం, పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఉండడం వల్ల ఏటా 50 నుంచి 60 రకాల పక్షులు వలస వస్తాయని తెలిపారు. వలస పక్షుల సంరక్షణకు ఓరుగల్లు వైల్డ్‌లైఫ్‌ సొసైటీ పనిచేస్తోందని వివరించారు. సాధారణంగా వలస పక్షులు నీటి ఆధారిత ప్రాంతాలు, ఆహారం సమృద్ధిగా ఉండే చెరువులు, కుంటలు, మడుగులను  ఎంచుకుంటాయి. ఆయా ప్రాంతాల సమీపంలోనే అవి నివసిస్తాయి. కొన్ని రకాల పక్షులు మాత్రం వ్యవసాయ మైదానాలను ఆధానం చేసుకుని సమీపంలోని చెట్లపై గూళ్లను నిర్మించుకుంటాయి.వలస పక్షులు అన్ని దాదాపు మాంసాహారులే. కొంగ జాతికి చెందిన పక్షులు చేపలు, నత్తలు, కప్పలను ఎక్కువగా తింటాయి. బాతు జాతికి చెందిన రెడ్‌క్రెస్టెడ్‌ పోచర్డ్, నార్తర్న్‌ పిన్‌ టేయిల్స్, గ్రిబు, విజిలింగ్‌ డక్స్‌ లాంటివి చేపలు, ఎండ్రికాయలను, ఇతర పురుగులను ఆహారం తీసుకుంటాయి. కూట్సు లాంటి పక్షులు నాచును తీసుకుంటాయి. వలస పక్షులు సంతానోత్పత్తి కాలం డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది

No comments:

Post a Comment