Breaking News

14/12/2019

పడిపోతున్న ఉష్ణొగ్రతలు

హైద్రాబాద్, డిసెంబర్ 14, (way2newstv.in)
హైద్రాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు తగ్గింది. సాయంత్రం నుంచే మొదలవుతున్న చలిగాలులతో ప్రజలు బయట తిరగలేకపోతున్నారు. ఇక ఎలాంటి ఆశ్రయమూ లేని వారు చలి రాత్రుల్లోనే జాగారం చేయాల్సి వస్తోంది. చలిని తట్టుకోలేని వారు కడుపులోకి కాళ్లు ముడుచుకొని పడరాని పాట్లు పడుతున్నారు. దుకాణాలు మూసివేశాక షట్టర్ల కింద కొందరు తలదాచుకుంటుండగా..ఫుట్‌పాత్‌లతో సహా ఎక్కడ ఏ మాత్రం దాపు కనిపించినా అక్కడ ముడుచుకుంటున్న వారు ఎందరో. ప్రతి చలికాలం సీజన్‌లో నిరాశ్రయులకు తగినన్ని నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటిస్తున్న జీహెచ్‌ఎంసీ మాటలు నీటి మూటలవుతున్నాయి. మూడేళ్లుగా నైట్‌షెల్టర్లను పెంచుతామంటున్నప్పటికీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చేవారు..ఆస్పత్రుల్లో రోగులకు సహాయకులుగా ఉంటున్నవారు.. 
పడిపోతున్న ఉష్ణొగ్రతలు

నా అన్నవారు లేని అనాథలు.. యాచకులు తదితరులు చలి తీవ్రతతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రుల వద్ద ఇలాంటి వారు ఎక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి ఐదు లక్షల మందికో నైట్‌ షెల్టర్‌ ఉండాలి.  ఆ లెక్కన కోటి జనాభా దాటిన నగరంలో 200 నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీసం పది శాతం కూడా ఏర్పాటు కాలేదు. గ్రేటర్‌లో వివిధ ప్రాంతాల్లో 14 నైట్‌షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ కనీస సదుపాయాల్లేక చాలామంది వాటిని కూడా వినియోగించుకోవడం లేరు.ఏ గూడు లేక ఆకాశం కప్పుకిందే తలదాచుకుంటున్న వారిని గుర్తించేందుకు  జీహెచ్‌ఎంసీ అధికారులు గత మార్చిలో సర్వే నిర్వహించారు. అలాంటి వారు  కేవలం  1491 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు మూడేళ్లక్రితం నిర్వహించిన సర్వేలో 3500 మంది ఉండగా, ఈ సంఖ్య సగంకంటే తగ్గింది. ఇంతపెద్ద మహానగరంలో ఇంత తక్కువమంది ఉండటాన్ని నమ్మలేక మరోమారు సర్వే నిర్వహించాల్సిందిగా కేంద్రం నుంచి వచ్చిన అధికార బృందం సూచించింది. అయినప్పటికీ ఇంతవరకు మళ్లీ సర్వే నిర్వహించలేదు. నైట్‌షెల్టర్లను పెంచలేదు. చలిరాత్రుల్లో వణకుతున్నవారిలో ఎక్కువ మంది ఆస్పత్రుల వద్ద ఉంటున్నట్లు మూడేళ్ల క్రితమే గుర్తించి, ఆయా ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కోఠి ప్రసూతి, ఈఎన్‌టీ, ఉస్మానియా, నిలోఫర్, గాంధీలతో సహా మొత్తం ఏడు ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలనుకున్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద నైట్‌షెల్టర్‌కు అవసరమైన స్థలం ఇచ్చేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. మిగతా ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనప్పటికీ, ఇంతవరకు ఒక్కచోట కూడా అందుబాటులోకి రాలేదు. నైట్‌షెల్టర్లను ఆశ్రయించేవారికి కేవలం ఆశ్రయం మాత్రమేకాక, తగిన పడక, తాగునీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేసేందుకు తగిన ఏర్పాట్లతోపాటు, లాకర్లు,  రాత్రిపూట రూ.5 భోజనం వంటి సదుపాయాలుండాలి. కానీ కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఈ సదుపాయాలున్నాయి. 12 నైట్‌షెల్టర్లలో 380 మంది ఉండేందుకు సదుపాయాలున్నాయని జీహెచ్‌ఎంసీ చెబుతుండగా, వాటిల్లో ఉంటున్న వారు 200 మందికి మించడం లేదు. వీటి గురించి తెలియక చాలామంది షెల్టర్లను వినియోగించుకోవడం లేదు. ఉన్న నైట్‌షెల్టర్లు ప్రధాన రహదారులు, ఆస్పత్రులు, బస్టాండ్లకు దూరంగా ఉండటంతో వీటి గురించి సమాచారం తెలియడం లేదు.  ఉస్మానియా, నిలోఫర్, ఆస్పత్రుల్లో వెయ్యిమందికి పైగా ఉండే ఇన్‌పేషెంట్లకు సహాయకులుగా వచ్చేవారు అంతకు ఎక్కువే ఉంటారు. ఎంఎన్‌జే క్యాన్సర్, కోఠి, పేట్లబుర్జు ప్రసూతి ఆస్పత్రులకు వచ్చే అటెండెంట్లు కూడా వెయ్యి మంది వరకు ఉంటారు. వీరంతా పేద కుటుంబాలకు చెందినవారే కావడంతో హోటళ్లు, లాడ్జిల్లో ఉండలేక ఆస్పత్రుల పరిసరాల్లోనే ఎముకలు కొరికే చలి రాత్రుల్లో అల్లాడుతున్నారు.

No comments:

Post a Comment