మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల సాయం
81,783 చేనేత కుటుంబాలకు ఇప్పుడు రూ.196.27 కోట్ల సాయం
ధర్మవరం డిసెంబర్ 21 (way2newstv.in):
ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే అమలు చేశామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు, పేద వర్గాలకు మేలు చేసే విధంగా నవరత్నాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులకు భరోసా ఇస్తూ వారికి పెట్టుబడి సహాయం చేయడంతో పాటు, ఆటో, టాక్సీలు, క్యాబ్ల డ్రైవర్లకు ఆర్థిక చేయూతనిచ్చామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతకారులు ఆత్మహత్య చేసుకున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం గుర్తు చేశారు. అందుకే 2014–19 మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 57 మంది చేనేతకారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇన్ని చేస్తున్నా రాజకీయ స్వార్థంలో శత్రువుల చర్యలు, విమర్శలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి
అయితే ఎవరేం చేసినా ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ తనకు కొండంత బలం అని ముఖ్యమంత్రి అన్నారు.సొంత మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిస్తూ చేపట్టిన ‘వైయస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఈ పథకంలో ప్రభుత్వం ఏటా రూ.24 వేల ఆర్థిక సహాయం చేయనుంది. విజయవాడ నుంచి నేరుగా అనంతపురం చేరుకున్న సీఎం, అక్కణ్నుంచి ధర్మవరం వచ్చారు. స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పథకం ప్రారంభించారు. అంతకు ముందు ఆయన చేనేత జౌళి శాఖ, పట్టు పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించారు. వైయస్సార్ నేతన్న నేస్తం పథకంలో ఇప్పటి వరకు 81,783 మంది అర్హులను గుర్తించగా, వారిలో ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 27 వేల మంది ఉన్నారు. ఈ పథకం కోసం రూ.196.27 కోట్లు కేటాయించారు. దీంతో ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన మరో హామీని సీఎం శ్రీ వైయస్ జగన్ అమలు చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా రెండు గంటల్లోనే మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆ సహాయం జమ అయింది.
నాకన్నా బాగా ఇంకెవరికి తెలుసు?
«ధర్మవరంలో నేతన్నల అగచాట్లు గురించి తన కన్నా ఎక్కువ ఇంకా ఎవరికీ తెలియకపోవచ్చని, ధర్మవరం పక్కనే పులివెందుల నియోజకవర్గం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ధర్మవరంలో ఎప్పుడు నేతన్నలకు ఏ కష్టం వచ్చినా, వచ్చి అండగా నిలబడింది, ధర్నాలు చేసింది తాను మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసింది ధర్మవరం నేతన్నలు అన్న సీఎం, ఇక్కడి చేనేత వృత్తి దేశంలోనే ఒక గర్వకారణంగా నిలుస్తోందని చెప్పారు.
ఇక్కడి వస్త్రాలు, ఇక్కడి నేతన్నల నైపుణ్యం గురించి ప్రపంచమంతా కూడా చెప్పుకుంటారని, కానీ వారి బాధలు మాత్రం ఎవరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సబ్సిడీ రాక నేతన్నలు ఇబ్బంది పడుతుంటే ధర్నా చేశానని, ఆత్మహత్య చేసుకుంటున్న చేనేతకారుల కుటుంబాలను ఎవరూ పట్టించుకోకపోతే గళం విప్పి అడిగానని, అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు.
3648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో చేనేతకారుల కష్టాలు స్వయంగా చూశానని, చాలా చోట్ల వారి అగచాట్లు, బాధలు విన్నానని, చేనేతకారులు పేదరికంలో ఉండడం, అప్పుల్లో కూరుకుపోవడం వారి నిత్య జీవితమైందని సీఎం పేర్కొన్నారు.
No comments:
Post a Comment