కడప, డిసెంబర్ 26, (way2newstv.in)
కడప. వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు అత్యంత అనుబంధం ఉన్న జిల్లా. ఈ జిల్లాలోని మొత్తం 10 ఎమ్మెల్యే సీట్లను, రెండు ఎంపీ సీట్లను కూడా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. గత 2014లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఒకచోట టీడీపీ విజయం సాధించింది. అయితే, ఈ ఏడాది ఎన్నికల్లో మొత్తంగా టీడీపీ సత్తా చాటాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలు కీలక ప్రాజక్టులను ఆయన భుజాన వేసుకున్నారు. విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం నిర్మించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. చంద్రబాబు స్వయంగా శంకు స్థాపన చేశారు.అయినా కూడా కడప ప్రజలు టీడీపీని పెద్దగా నమ్మినట్టు కనిపించలేదు. దీంతో ఈ ఏడాది జరిగిన ఎన్నిక ల్లో పూర్తిగా పార్టీ విఫలమైంది.
కడపలో కోలుకోవడం అంత ఈజీ కాదు
అయితే, ఇది నిన్నటి మాట. పార్టీల గెలుపు ఓటములు సహజమే. అలా అనుకుంటే గత 2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరిలో వైసీపీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా సీటు దక్కలేదు. కానీ, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మరి ఇలాంటి పరిస్థితి టీడీపీకి ఎందుకు ఉండదని అనుకోవాలి? గెలుపు ఓటములు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. అయితే, కడప రాజకీయాలను గమనిస్తే టీడీపీ పరిస్థితి ఆశించిన విధంగా లేక పోవడం వల్లే ఇప్పుడు ఆ పార్టీపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి.కడపలో టీడీపీకి దన్నుగా ఉంటారని భావించిన సీఎం రమేష్ కానీ, ఆదినారాయణ రెడ్డి కానీ పార్టీ మారిపోయారు. ఇక, ఇప్పుడు పులివెందులలో పార్టీ గెలుపుకోసం అహర్నిశలూ శ్రమించిన సతీష్ రెడ్డి సైతం పార్టీ నుంచి దూరమయ్యేందుకు రెడీ అయ్యారు. ఆయన త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. పులివెందులలో జగన్ ఫ్యామిలీని కొన్ని దశాబ్దాలుగా ఢీకొట్టిన సతీష్‌రెడ్డి లాంటి వాళ్లే పార్టీ వీడుతున్నారంటే అసలు కడప జిల్లాలో టీడీపీని ముందుండి నడిపించే నాథుడే కనపడడం లేదు.జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి స్లో అయిపోయారు. చాలా నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయిలో బాధ్యతలు స్వీకరించేందుకు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. జమ్మలమడుగులో మరో కీలక నేత రామసుబ్బారెడ్డి కూడా వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. రైల్వేకోడూరు, కమలాపురం, కడప, బద్వేల్, పులివెందుల లాంటి చోట్ల పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే… ఇక్కడ జెండా పట్టే వాళ్లు.. కట్టేవాళ్లు కూడా లేరు. రాజకీయంగా ఎన్ని వ్యూహాలు ఉన్నప్పటికీ.. టీడీపీ ఈ జిల్లాలో ఆశించిన విధంగా పురోగతి సాధించలేదనేది వాస్తవం. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించి టీడీపీ దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు, విశ్లేషకులు సైతం సూచిస్తున్నారు.
No comments:
Post a Comment