Breaking News

09/12/2019

గోవాలో కాషాయానికి కషాయమేనా

న్యూఢిల్లీ, డిసెంబర్ 9 (way2newstv.in )
మహారాష్ట్రలో ఇటీవల చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన మరింత దూకుడు పెంచింది. ఎన్సీపీ, కాంగ్రెస్ లతో పొత్తుపెట్టుకుని శివసేన మహారాష్ట్రలో బీజేపీని దెబ్బతీసింది. ఒకప్పటి చిరకాల మిత్రపక్షమైన కమలం పార్టీకి కషాయం తాగించింది. ఈ ఊపుతో పొరుగున ఉన్న చిన్న రాష్ట్రమైన గోవాలో కూడా తన తడాఖా చూపించచాలని భావిస్తోంది. అక్కడి అతుకుల బొంత బీజేపీ సంకీర్ణ సర్కార్ ను కూల్చేందుకు వ్యూహరచన చేస్తోంది. అలా వీలుకాని పక్షంలో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయాలని తలపోస్తోంది. మహారాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు తదితర వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత గోవాపై దృష్టి సారించాలని శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకుడు సంజయ్ రౌత్ వెల్లడించారు. 
గోవాలో కాషాయానికి కషాయమేనా

మొన్నటి మహారాష్ట్ర వ్యవహారంలో చక్రం తిప్పింది సంజయ్ రౌత్ కావడం గమనార్హం.గోవాలో 2012 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోలేక పోయింది. 40 స్థానాలు గలల అసెంబ్లీలో 17 స్థానాలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ కేవలం 13 స్థానాలతో రెండో అతి పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ మిత్రపక్షమైన మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వార్డ్ పార్టీ మూడు, స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురు గెలిచారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ ఒక స్థానంలో గెలిచింది. ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఏదో ఒక రకంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్క స్థానం గల ఎన్సీపీ మిత్రపక్షమే. మరో ముగ్గురు స్వతంత్ర సభ్యుల మద్దతు ఉంటే సర్కారును ఏర్పాటు చేయవచ్చు. ఈ గణాంకాలను పక్కన పెడితే ఏకైక అతిపెద్ద పార్టీగా ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మృదులా సిన్హా ఆహ్వానించాల్సింది. ఇది రాజ్యాంగ సూత్రం.గవర్నర్ సిన్హా కరడు గట్టిన కాషాయవాది. కేంద్ర పెద్దల సూచనల మేరకు ఆమె వ్యవహరించారు. బీజేపీ నేత మనోహర్ పారికర్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. పారికర్ నిజాయితీగల నాయకుడు. ఎమ్మెల్యేల కొనుగోలు వంటి దుస్సంప్రదాయాలకు పూర్తి వ్యతిరేకి. పైగా అసెంబ్లీలో మెజారిటీ లేదు. కానీ ముగ్గురు సభ్యులు గల గోవా ఫార్వర్డ్ పార్టీ, ఇతరుల మద్దతుతో మనోహర్ పారికర్ర నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయింది. మనోహర్ పారికర్ మరణానంతరం ప్రమోద్ సావంత్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో బీజేపీ చీలిక తీసుకురాగలిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మందిలో పదిమంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. దీంతో బీజేపీ బలం ఒక్కసారిగా 27కు పెరిగింది. 2017 వరకూ కాంగ్రెస్ సీఎంగా పనిచేసిన దిగంబర్ కామత్ కు డిప్యూటీ సీఎం పదవి అప్పగించింది. దీంతో బీజేపీలోకి ఫిరాయించిన తమ సభ్యులు పది మందిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. బీజేపీకి చెందిన స్పీకర్ సహజంగానే ఆ పిటీషన్ ను తొక్కిపెట్టారు. తనకున్న విచక్షణాధికారాల నేపథ్యంలో స్పీకర్ ఇప్పట్లో ఆ ఫిర్యాదును పరిశీలించే అవకాశం లేదు. న్యాయస్థానాలు సయితం జోక్యం చేసుకునే పరిస్థితి ఎంత మాత్రం లేదు పూర్వ రంగంలో మహారాష్ట్రలో మాదిరిగా గోవాలో కూడా తన ఒకప్పటి పెద్దన్న అయిన బీజేపీిని దెబ్బతీయాలని శివసేన తలపోస్తోంది. పక్కనున్న గోవాపై దృష్టిపెట్టింది. ఈ విషయంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చురుగ్గా పావులు కదుపుతున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో కూటమి ఏర్పాటకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గోవా ఫార్వర్డ్ పరా్టీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ ఇటీవల ముంబయిలో సంజయ్ రౌత్ ను కలిశారు. మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ కి చెందిన సుదిన్ ధావలికార్ కూడా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యమేనన్నారు. “గోవాలో ఖచ్చితంగా భూకంపం పుడుతుంది. విజయ్ సర్దేశాయ్ తన ముగ్గురు ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. బీజేపీకి మద్దతిచ్చిన ఇతర ఎమ్మెల్యేలు సయితం ఇప్పుడు మాతో టచ్ లో ఉన్నారు” అన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలు గోవాలో బీజేపీ సర్కార్ కు కష్టకాలం తప్పదన్న విషయం స్పష్టమవుతోంది. గతంలో సీఎంగా పనిచేసిన గోవా ఫార్వార్డ్ పార్టీ నేత విజయ్ సర్దేశాయ్ కు బీజేపీ డిప్యూటీ సీఎం పదవి అప్పగించింది. ఈ ఏడాది జులైలో ఆయనను, ఆయన పార్టీకి చెందిన మంత్రులను బీజేపీ తొలగించింది. కాంగ్రెస్ సభ్యులు పదిమంది అండ చూసుకుని బీజేపీి రెచ్చిపోయింది. దీంతో విజయ్ సర్దేశాయ్ రగిలిపోతున్నారు. కమలం పార్టీని గద్దె దింపాలన్న పట్టుదలతో ఉన్నారు. తన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఎంజీపీ, ముగ్గురు స్వతంత్రులు, ఒక ఎన్సీపీ, కాంగ్రెస్ అయిదుగురు సభ్యులతో పాటు కూటమి కట్టాలని ఆయన యోచిస్తున్నారు. బీజేపీలోకి వెళ్లిన పదిమంది కాంగ్రెస్ సభ్యుల్లో కొంతమంది తిరిగి వస్తే ఆయన ప్రయత్నం విజయవంతం అవుతుంది. మొత్తానికి కాషాయ పార్టీ ప్రభుత్వానికి వచ్చేది కష్టకాలమే. బీజేపీ వ్యూహాలు ఇటీవల కాలంలో బెడిసికొడుతున్న నేపథ్యంలో మోదీ, షా ద్వయం గోవాలో ఏమి చేస్తుందో చూడాలి.

No comments:

Post a Comment