Breaking News

02/12/2019

అయోధ్య..ఇంకెంత దూరం

లక్నో, డిసెంబర్ 2 (way2newstv.in)
అయోధ్య స్థల వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు వచ్చాక అనేక సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయోధ్యలో రామాలయం ఎప్పుడు నిర్మిస్తారు? ఎప్పటిలోగా నిర్మిస్తారు? ప్రభుత్వం నిర్మిస్తుందా? ప్రయివేటు వ్యక్తులు నిర్మిస్తారా? ఎవరు డిజైన్లు రూపొందించారు? తదితర ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. చాలా అంశాల్లో స్పష్టత లేదు. ఇప్పటి వరకూ ప్రభుత్వం వైపు నుంచి గాని, ప్రయివేటు వ్యక్తుల నుంచి గానీ స్పష్టమైన ప్రకటనలు రాలేదు. తీర్పుతో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలతో ఆలయంపై ఉన్న వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు సైతం ఈ కారణంతోనే ఇప్పటి వరకూ ఎలాంటి ముందస్తు ప్రకటనలు చేయలేదుఇతర అంశాలు ఎలా ఉన్నప్పటికీ భవ్యమైన రామాలయ నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన “డిజైన్” రూపొందించారు. 
అయోధ్య..ఇంకెంత దూరం

ఈ డిజైన్ ను గతంలోనే తయారు చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఇది వెలుగులోకి రావడం గమనార్హం. మూడు దశాబ్దాల క్రితమే చంద్రకాంత్ సోంపుర అనే శిల్పి అయోధ్య రామాలయ డిజైన్ ను రూపొందించారు. గుజరాత్ కు చెందిన సోంపుర 1989లో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ సూచనల మేరకు డిజైన్ ను తయారు చేశారు. 1990లో కుంభమేళా సందర్భంగా అలహాబాద్ లో సమావేశమైన సాధువులు దీనికి ఆమోదముద్ర వేశారు. ఆలయ నిర్మాణానికి అవసరమయ్యే రాతి స్థంభాలు, శిల్పాలను చెక్కేందుకు ప్రత్యేక కార్యశాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో అనుకున్న ప్రకారం దాదాపు 40 శఆతం పనులు పూర్తయినట్లు అంచనా. నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే కనీసం రెండున్నరేళ్లు పడుతుందని నిపుణుల అభిప్రాయంగా ఉంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ట్రస్టు ఏర్పాటు, అవసరమైన నిధుల సేకరణకు కనీసం మూడు నుంచి ఆరు నెలల పడుతుంది. ఇతర కార్యక్రమాలకు మరికొంత సమయం పడుతుంది.ఆలయ నమూనాలు రూపొందించడంలో సోంపుర కుటుంబానికి దేశవ్యాప్తంగా మంచి పేరుంది. దేశ విదేశాల్లోని అనేక హిందూ దేవాలయాలకు ఈ కుటుంబమే నమూనాలను రూపొందించడం గమనార్హం. నమూనాలు తయారీ సోంపుర కుటుంబానికి వంశ పారపర్యంగా వస్తుంది. చంద్రకాంత్ సోంపుర తండ్రి ప్రభాకర్ సోంపుర గుజరాత్ లోని సోమనాధ్, మధురలోని శ్రీకృష్ణ ఆలయాలకు నమూనాలను రూపొందించారు. సోమనాధ్ లోని శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రధమమైనది. దానికి ప్రభాస్ అన్న పేరు కూడా ఉంది. చంద్రకాంత్ సోంపుర దాదాపు వంద ఆలయాలకు నమూనాలను రూపొందించడం విశేషం. గుజరాత్ లోని స్వామి నారయణ ముదిత్ వంటి ప్రముఖ ఆలయాలు ఇందులో ఉన్నాయి. వచ్చే శ్రీరామ నవమి నాటికి అయోధ్యలో పనులు ప్రారంభమయ్యే అవకాశముంది.ప్రాధమిక అంచనాల ప్రకారం ఆలయ నిర్మాణానికి కనీసం ఆరున్నర ఎకరాలు అవసరమని అంచనా. గర్భాలయం, ఆంత్రల్, మహామండపం, రంగ మండపం, ప్రవేశ మండపం వంటివి ఉంటాయి. వీటి ద్వారానే శ్రీరాముడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. గర్భగృహానికి ఒక ద్వారం, మహా మండపానికి ఏడు ద్వారాలు ఉంటాయి. పైన పేర్కొన్న మేరకు అయోధ్యలో ఆలయ నిర్మాణానికి దాదాపు 2.75 లక్షల ఘనపుటడుగుల రాయి కావాలి. ఇప్పటికే 1.25 లక్షల ఘనపుటడుగుల రాయిని ఎంతోమంది శిల్పులు చెక్కారు. ఈ నమూనాల మేరకు 270 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 132 అడుగుల ఎత్తుతో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తారు. ఇందులో 81 అడుగుల మేరకు గోపుర శిఖరం ఉంటుంది. 212 స్థంభాలతో నిర్మాణం చేస్తారు. ప్రధాన ఆలయం రెండు అంతస్థుల్లో ఉంటుంది. కింద బాలరాముడి విగ్రహం, పై అంతస్థులో రామ దర్బారు ఉంటుంది. ఆపైన ఆలయ శిఖరం ఉంటుంది. రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లా నుంచి తెచ్చిన గులాబీ రంగు రాయితో ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి చేశారు. ఆలయ పనులు ఒక కొలిక్కి వచ్చేందుకు కనీసం నాలుగేళ్లు పడుతుందని అంచనా. నిర్మాణ పనుల్లో స్టీలు వాడరు. చంద్రకాంత్ సోంపుర రూపొందించిన నమూనా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మరో అయిదేళ్లలో దివ్యమైన, భవ్యమైన రామాలయం రూపుదిద్దుకుంటుంది. భక్తులు కోరికలు తీర్చుకునేందుకు శ్రీరాముడు ఆలయంలో కొలువై తీరతారు. అప్పటిదాకా వేచి చూడక తప్పదు.

No comments:

Post a Comment