Breaking News

12/12/2019

జగన్ ను కలవని..70 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు

విజయవాడ, డిసెంబర్ 12 (way2newstv.in)
వైసీపీలో కర్త కర్మ, క్రియ అన్నీ జగనే. అపుడెపుడో ఇదే విషయం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు. జగన్ పార్టీకి బంపర్ మెజారిటీ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు అని ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడో అన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున గెలిచిన వారిలోనూ గంపెడు కోరికలు ఉంటాయి. వాటిని పసిగట్టి పరిష్కరించే నాయకత్వం ఉండాలి. ఓ విధంగా కేంద్రీకృత నాయకత్వం వల్లనే అసమ్మతి తెలియకుండా దావానలంగా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని మొగ్గలోనే తుంచి ముందుకు నడిపించాలంటే కనీసం రెండు మూడు కిటికీలు అవసరమే. అలా జరగని నాడు నేతాశ్రీలు ఉక్కబోతతో సతమతమవుతారు. 
జగన్ ను కలవని..70 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు

అది ఏదో ఒక రోజు బడబాగ్నిలా బయటపడితే పార్టీ పరువు కూడా పోతుంది. ఇపుడు వైసీపీలో అలాంటి సన్నివేశాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కూడా.జగన్ తన పార్టీ నాయకులను కలవడానికి సమయం కేటాయించడంలేదన్నది తరచూ వచ్చే ఫిర్యాదు. జగన్ నిజంగా పార్టీ నాయకులతో భేటీలు వేసి చాలా కాలమే అయింది. విపక్ష నేతగా ఉన్నపుడు ఆయన దాదాపుగా ఏణ్ణర్ధం పాటు పాదయాత్ర చేస్తూనే గడిపేశారు. అక్కడ నాయకులను కలిసినా అది మనసు విప్పి మాట్లాడే సందర్భం కాదు. పాదయాత్ర మీదనే ఎపుడూ చూపు ఉండేది. అలా పాదయాత్ర ముగిసింది. ఇలా ఎన్నికలు వచ్చేశాయి. దాంతో జగన్ మరింత బిజీ అయిపోయారు. ఆ తరువాత ఘన విజయం సాధించడంతో ఏకంగా ముఖ్యమంత్రిగా అధికార హోదాలోకి వచ్చేశారు.దాంతో పార్టీ నాయకులను కలవడం అన్నది అతి పెద్ద సమస్యగా మారిపోయింది. దీని మీద వారు సైతం అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. అది సరే కానీ పార్టీ బీ ఫారాలు ఇచ్చి ఎండల్లో వారి వెంట తిరిగి మరీ గెలిపించిన జగన్ ఇపుడు తన ఎమ్మెల్యేలు, ఎంపీలలో సగం మందిని కూడా కలిసే భాగ్యం కూడా ఇవ్వడంలేదుట. ఆరు నెలల కాలం అపుడే గడచిపోయింది, కానీ తన పార్టీ గుర్తు మీద గెలిచిన వారికి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి.నిజానికి ఎంత చరిష్మా ఉన్నా కూడా క్షేత్ర స్థాయిలో పార్టీని నడిపించాల్సింది ఎమ్మెల్యేలు, ఎంపీలే. వారి బలం కూడా తోడు అయింతేనే పార్టీకి విజయం దక్కుతుంది. మరి అటువంటి కీలకమైన ప్రజా ప్రతినిధులను కూడా కలవనంత బిజీగా జగన్ ఉంటున్నారా అన్న ప్రశ్నలు వైసీపీ నుంచే వస్తున్నాయి. వైసీఎల్పీ నేతగా జగన్ ఎన్నుకోవడానికి మాత్రం ఒకసారి 150 మంది ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. అది లగాయితూ ఇప్పటివరకూ కనీసం అలాంటిదేదీ పార్టీలో జరగనే లేదు. మరో వైపు ఎంపీల విషయం కాస్త భిన్నం. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వారితో ముఖ్యమంత్రి హోదాలో జగన్ మీటింగు పెడుతున్నారు. చెప్పాల్సిందేదో చెబుతున్నారు. అక్కడ కూడా ప్రత్యేకంగా ఎవరినీ జగన్ కలవడంలేదు. దాంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు చకోర పక్షుల్లా ముఖ్యమంత్రి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.మరి జగన్ వారానికో నెలకో కొంత టైం కేటాయించి వన్ టు వన్ మాట్లాడితే ఆ ఫలితాలు వేరేగా ఉంటాయని అంటున్నారు. జిల్లాల వారీగా ఎంపిక చేసుకుని తన ఎమ్మెల్యేలతో ముచ్చట్లు పెడితే వారిలో అసంతృప్తి తగ్గడమే కాదు, పార్టీకి కూడా కొత్త బూస్ట్ ఇచ్చినట్లుగా ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలకైనా ఎమ్మెల్యేలు, ఎంపీల గురించిన బాగోగులు చూసే బాధ్యతను అప్పగిస్తే బాగుంటుందని అంటున్నారు. మరి వైసీపీలో ఆ తరహా మెకానిజం అవసరమని కూడా అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్ ని కనీసం కలవని ఎమ్మెల్యేలు 70 మంది వరకూ ఉంటే ఎంపీలు 10 మంది దాకా ఉన్నారట. ఇది వినడానికి కూడా విడ్డూరంగానే ఉంది. ఈ గ్యాప్ ని సాధ్యమైనత తొందరగా తగ్గించుకోవడం వైసీపీకే క్షేమమని అంటున్నారు

No comments:

Post a Comment