Breaking News

22/11/2019

తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు బడా చోర్లు

దేశ వ్యాప్తంగా లిస్ట్ రెడీ
న్యూఢిల్లీ, నవంబర్ 22 (way2newstv.in)
ఎట్టకేలకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మే నెలలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ది వైర్ దాఖలు చేసిన దరఖాస్తుకు ఆర్బీఐ స్పందించింది. 30 భారీ ఉద్దేశపూర్వక రుణ ఎగవేత సంస్థల పేర్లను తెలిపింది. ఈ మేరకు గత నెల 25న ఓ సర్క్యులర్‌ను సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది. భారీ బకాయిల సమాచారాన్ని భద్రపరిచే కేంద్రీకృత బ్యాంకింగ్ వ్యవస్థ డేటాబేస్ సీఆర్‌ఐఎల్‌సీ సాయంతో వెల్లడించింది. నిజానికి ఈ సమాచారం కోసం దశాబ్ద కాలానికిపైగా ఎడతెగని ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సంస్థలూ ఆర్బీఐ ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల తాజా జాబితాలో ఉన్నాయి. 
తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు బడా చోర్లు

ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన మొత్తం మూడు సంస్థలు ఇందులో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్, కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ పేర్లున్నాయి. దక్కన్ క్రానికల్ బకాయిల ఎగవేత రూ.1,951 కోట్లుగా ఉండ గా, వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.1,314 కోట్లు ఎగ్గొట్టినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాటా రూ.984 కోట్లుగా ఉన్నది. వీటిలో ఆంగ్ల, తెలుగు దినపత్రికలను ప్రచురిస్తున్న దక్కన్ క్రానికల్.. దివాలా ప్రక్రియకు వెళ్లింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సైతం వివరాలు చెప్పాలంటూ ఆర్బీఐని ఆదేశించింది. అయినప్పటికీ దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఇది విఘాతమని, బ్యాంకింగ్ రంగ విశ్వసనీయత, సంబంధాలు దెబ్బ తింటాయంటూ ఆర్బీఐ తోసిపుచ్చుతూ వచ్చింది. అయితే ఆర్బీఐ అయిష్టత ప్రదర్శిస్తున్నా.. బకాయిల వసూలు కోసం ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు బ్యాంకులు బయటపెడుతూనే ఉన్నాయి. ఈ వివరాలు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వద్ద కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు మరోసారి సుప్రీం గడప తొక్కగా, ఆర్బీఐ తీరు కోర్టు ధిక్కరణ కిందకు వస్తున్నదంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ది వైర్ దరఖాస్తు మరికొన్నింటిని పరిశీలనలోకి తీసుకుని ఆర్బీఐ తాజా వివరాలను బయటపెట్టింది. కాగా, సిబిల్ వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి 11 వేలకుపైగా సంస్థలు రూ.1.61 లక్షల కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టాయని తెలుస్తున్నది.ఆర్బీఐ ప్రకటించిన 30 భారీ ఉద్దేశపూర్వక రుణ ఎగవేత సంస్థల బకాయిలు రూ.50 వేల కోట్లపైనే ఉన్నాయి. ఇప్పటిదా కా ఈ సంస్థలకు సంబంధించి బ్యాంకులు రద్దు చేసిన మొత్తాలనూ కలిపి తాజా జాబితాను సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది. ఇందులో ప్రముఖ సంస్థల పేర్లుండగా, వాటిలో విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, హైదరాబాద్ ఆధారిత మీడియా గ్రూ ప్ దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లతోపాటు పీఎన్‌బీ మోసగాడు మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, పరారీ ఆర్థిక నేరగాడు జతిన్ మెహెతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యుయెల్లరీ లిమిటెడ్, విక్రమ్ కొఠారీకి చెందిన పెన్నుల తయారీ సంస్థ రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్‌ఈఐ అగ్రో లిమిటెడ్, ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ తదితర సంస్థలున్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం సూత్రధారుల్లో ఒకరైన మెహుల్ చోక్సికి చెందిన సంస్థలే మూడుండటం గమనార్హం. బ్యాంకులకు ఈ కంపెనీలు రూ.7,639 కోట్లు ఎగవేశా యి. చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ (రూ.5,044 కోట్లు), గిలి ఇండియా లిమిటెడ్ (రూ.1,447 కోట్లు), నక్షత్ర బ్రాండ్స్ లిమిటెడ్ (రూ.1,148 కోట్లు) పేర్లు 30 భారీ ఉద్దేశపూర్వక రుణ ఎగవేత సంస్థల్లో కనిపిస్తున్నాయి. జాబితాలో గీతాంజలి జెమ్స్ ఎగవేతే పెద్దది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను పీఎన్‌బీ కుంభకోణం కుదిపేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ.14 వేల కోట్ల ఈ మోసంలో చోక్సీ మేనల్లుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. నీరవ్ ప్రస్తుతం బ్రిటన్ జైళ్లో ఉండగా, చోక్సీ కరేబియన్ దీవుల్లో తల దాచుకున్నారు.

No comments:

Post a Comment