Breaking News

14/11/2019

ఎవరేమన్నా... ఎదురేమైనా

విజయవాడ, నవంబర్ 14  (way2newstv.in)
తెలుగు భాషకు పెద్ద ప్రమాదం ముంచుకొచ్చేసినట్టు మీడియా గుండెలు బాదుకుంటోంది. వాళ్ళ కన్నీళ్ళు చెరువులై.. కృష్ణా, గోదారి నదుల్ని మించి ప్రవహిస్తోంది. వాళ్ళ ఆవేదన సహేతుకమే. అంతా ఇంగ్లీష్ లో చదివిస్తే వాళ్ళ తెలుగు పేపర్ లకు, టీవీ చానెల్స్ కు భరోసా ఉండదనే ఆందోళన కూడా అందులో ఉందేమో….? సంపాదనలో మూడో వంతు స్కూల్ ఫీజుల రూపంలో దోచుకునే కార్పొరేట్ బళ్లకి గిరాకీ తగ్గుతుందనే ఆవేదన కావొచ్చు. తొలి తరంలో కాన్వెంట్ బళ్లలో ఇంగ్లీష్ చదువులు నేర్చేసి., మంచి కొలువులు, విదేశాల్లో అవకాశాలు, అప్రకటిత రిజర్వేషన్లు అన్నీ అంది పుచ్చుకోడానికి ఈ ఇంగ్లీష్ చదువులే కదా మూల కారణం. 
ఎవరేమన్నా... ఎదురేమైనా

ఇన్నేళ్లకు మనతో సమానంగా వాళ్ళకి కూడా బాల్యం నుంచే ఇంగ్లీష్ విద్య అనేస్తే మనమేం కావాలి అన్నది అసలు ఆక్రోశం. అందుకే పత్రికల్లో ఎడాపెడా ప్రభుత్వాన్ని తూర్పార బడుతున్నాయి.ఇంకో నాలుగు రోజులు పోతే ఇప్పుడు పాఠశాలల్ల ఇంగ్లీష్ మీడియం పెట్టడం ద్వారా భవిష్యత్తులో తెలుగు పత్రికలు చదివే వారు లేకుండా చేయాలన్నది జగన్ ఉద్దేశం అని కూడా వాళ్ళు రాస్తారేమో? ” నిజానికి ఓ సెక్షన్ మీడియాలో భాషాభిమానులు చెలరేగి పోతున్నారు కాబట్టి దానికి పరిష్కారం కూడా సులభం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆంగ్ల విద్యా బోధన తప్పనిసరి, మిగిలిన వాళ్ళకి ఐచ్ఛికం అనండి. అంతే కానీ ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడి ఆంగ్లంలో విద్యా బోధన విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం సరికాదు. అయినా జనానికి మంచి చేసే విషయాల్లో పీకులాట ఎందుకు..?. వేల కోట్లు జీతాలు కుమ్మరించే సర్కారు బళ్లలో పిల్లలకు మంచి చేసే విషయంలో మొహమాటం ఎందుకు?నాణ్యమైన ఆంగ్ల విద్యా బోధన నిర్బంధం చేస్తే తరతరాలు సీఎం ని గుర్తుంచుకుంటాయి. విద్యా రంగంలో సంస్కరణలు చాదస్తాలుగా ఉండకూడదు. మాతృభాష మీద మామకారం ఉన్న వాళ్ళకి, వాళ్ళ పిల్లలకు నిక్షేపంగా అందులోనే చదువుకునే అవకాశం కల్పించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలతో సంబంధం లేకుండా అంతా ఇంగ్లీష్ చదువుల వైపు పరుగులు తీస్తుంటే ఉపాధ్యాయ సంఘాల వైఖరి మరీ విచిత్రం. నెలకు సగటున 50 వేలకు పైచిలుకు జీతం, 60 ఏళ్ల వరకు ఉద్యోగ భద్రత పొందే వారు తమ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో గుండెల మీద చేతులేసుకుని చెప్పాలి. రోజు తెలుగు వెలుగుల మీద పుంకానుపుంఖాలు కథనాలు రాసే రామోజీ లాంటి వారు తమ రమాదేవి స్కూల్ విషయంలో ఇలాంటి నీతులు పాటించరు. అప్పుడు భాషాభిమానం గుర్తుకు రాదు. ఎదుటి వారి మీద తమ ఆలోచనలు రుద్దడానికే ఇవి అక్కరకొస్తాయి. పేద, వెనుకబడిన వర్గాలకు ఎక్కడ మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాలు లభిస్తాయో అనే సంకుచిత ఆలోచనలే ఈ అవస్థలకు అసలు కారణం.

No comments:

Post a Comment