Breaking News

30/11/2019

క్రిసమస్ నాటికి తీరనున్న ఉల్లి కొరత

హైద్రాబాద్, నవంబర్ 30, (way2newstv.in)
ఉల్లి కొరత మరో మూడు వారాల వరకు ఉండనుంది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈజిఫ్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం 6,090 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటుంది. అందులో 500 టన్నులు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. ఈ మేరకు వారం రోజుల్లోగా రాష్ట్రానికి ఉల్లి వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉల్లిపాయ ఫస్ట్ క్వాలిటీ ధర క్వింటాలుకు రూ. 4 వేల నుంచి రూ. 8 వేలకు పెరిగింది. కర్ణాటక, కర్నూలు నుంచి వచ్చే రెండో క్వాలిటీ ధర రూ. 3700 నుండి రూ. 6000కు గరిష్టంగా పెరిగింది. రాష్ట్రంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు చేపట్టింది.హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్, మొహిదీపట్నం రైతు బజార్లలో కిలో రూ. 40కే ఉల్లి విక్రయించేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. 
క్రిసమస్ నాటికి తీరనున్న ఉల్లి కొరత

ఆధార్ కార్డు చూపించిన వారికి ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు విక్రయిస్తారు. కొరతను వ్యాపారులు అవకాశంగా తీసుకొని ఇష్టారాజ్యంగా ధరలు పెంచకుండా చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. తాము చేపట్టిన చర్యల వల్ల ఉల్లి ధరల నియంత్రణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.సెప్టెంబర్-అక్టోబర్ కాలంలో కురిసిన వర్షాల వల్ల ఉల్లి రవాణాపైనా ప్రభావం చూపింది. దీంతో ఉల్లి కొరత ఏర్పడింది. అక్టోబర్ 1 నుండి నవంబర్ 6వ తేదీల మధ్య మహారాష్ట్రలో సాధారణం కంటే దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ వర్షం కురిసింది. దీంతో మహారాష్ట్రలో ఉల్లి సాగు విస్తీర్ణంలో మూడింట ఒక వంతు దెబ్బతినిపోయింది. దీంతో నాసిక్ జిల్లాలోని లాసల్‌గావ్ మార్కెట్‌లో పక్షం రోజుల్లో సగటు హోల్‌సేల్ ధరలను 120 శాతం పెంచారు. అక్టోబర్ 19న కిలో రూ. 25 నుంచి నవంబర్ 4న రూ. 55 కిలోకు పెరిగింది. ఈ మంగళవారం నాటికి హోల్‌సేల్ ధర రూ. 80కి పెరిగింది. ఈ ఖరీఫ్‌లో ఉల్లి ఉత్పత్తి 26 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. దీంతో ధరలు మరింత పెరిగాయి.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల ఉల్లి విత్తనాలు వేయడంలో మూడు నాలుగు వారాలు ఆలస్యమైంది. దీంతో ఖరీఫ్ ఉల్లిపాయ సాగు విస్తీర్ణం తగ్గింది. మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో కేవలం 10 వేల ఎకరాలలోపు వరకే ఉల్లి సాగు అవుతుంది. కానీ ఆలస్యపు వర్షాల వల్ల తక్కువ సాగైందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వర్షాలు అక్టోబర్ వరకు కూడా ఉండటంతో రబీ సీజన్‌లోనూ ఉల్లి సాగు పెద్దగా కాలేదు. ఉల్లి విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడుతుంది. ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఆయా రాష్ట్రాల్లోనూ ఆలస్యపు రుతుపవనాల వల్ల విస్తీర్ణం తగ్గింది. మరోవైపు కీలకమైన కోత సీజన్‌లో అకాల వర్షాలు అక్కడి ఉల్లిని దెబ్బతీశాయి.

No comments:

Post a Comment