Breaking News

30/11/2019

వరి తూకంలో తకరారు

ఖమ్మం, నవంబర్ 30, (way2newstv.in)
ధాన్యం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి.. పంట పండించి.. ధాన్యం అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే.. తూకం సమయంలో బస్తా బరువు కింద తరుగును నిబంధనల ప్రకారం 500 గ్రాములు తీయాల్సి ఉండగా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బస్తాకు కేజీ తరుగు కింద తీస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో బస్తాకు కేజీ చొప్పున తీస్తే పెద్ద మొత్తంలో ధాన్యం అమ్ముకునే రైతులకు భారీ నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. జిల్లాలో డీఆర్‌డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో 28, ఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 94.. మొత్తం 122 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 
 వరి తూకంలో తకరారు

అయితే ఇప్పటివరకు డీఆర్‌డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో 15, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 80.. మొత్తం 95 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 7 డీఆర్‌డీఏ ఐకేపీ కేంద్రాల ద్వారా, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 34 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,005 మంది రైతుల నుంచి గ్రేడ్‌–‘ఏ’ రకం ధాన్యం 2,323.360 మెట్రిక్‌ టన్నులు, కామన్‌ రకం 5,090.640 మెట్రిక్‌ టన్నులు.. మొత్తం 7,414 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకునే రైతులకు కొర్రీలు తప్పడం లేదు. ధాన్యం తూకం వేసే సమయంలో కొనుగోలుదారులు కోతలు విధిస్తుండడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పాత బస్తాతో తూకం వేస్తే 500 గ్రాముల ధాన్యం, కొత్త బస్తాతో తూకం వేస్తే 600 గ్రాముల ధాన్యం తీయాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా.. బస్తాకు కేజీ చొప్పున ధాన్యం తరుగు తీస్తుండడంతో రైతులకు నష్టాలను మిగులుస్తున్నాయి. ధాన్యం పండించేందుకు శ్రమించి.. కష్టపడి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన రైతుకు ధాన్యం అమ్మే దగ్గర కన్నీళ్లే మిగులుతున్నాయి. తన కళ్లముందే తరుగు తీస్తుండడంతో చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది నిబంధనలకతీతంగా కొనుగోలు కేంద్రాల్లో కేజీ ధాన్యం తరుగు కింద తీస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఇది చిన్న విషయంగానే కనిపిస్తున్నా.. రైతులకు కనిపించని నష్టాన్ని మిగులుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే మద్దతు ధరకు అమ్ముకోవచ్చనే ఆశతో ఇక్కడకు వస్తున్న రైతులకు నిబంధనల పేరుతో తీస్తున్న తరుగుతో నష్టం తప్పడం లేదు. ఒక్క తరుగు విషయంలోనే కాకుండా.. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో లభించే మద్దతు ధర ఏమోగానీ.. ఇలాంటి ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలని రైతులు వాపోతున్నారు. హమాలీ ధరల విషయంలో.. ఇతర విషయాల్లో కూడా రైతులు ఇబ్బందులపాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

No comments:

Post a Comment