Breaking News

04/11/2019

అడవుల ఆక్రందన.. (నిజామాబాద్)

నిజామాబాద్, నవంబర్ 04 (way2newstv.in): 
జిల్లాలో అటవీ భూముల ఆక్రమణ, అధికారుల తీరుపై ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సమావేశంలో ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. అక్రమార్కులకు వంతపాడుతున్నారని వాపోయారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే ఇలా మాట్లాడరంటే జిల్లాలో అటవీ భముల ఆక్రమణలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్ఛు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణ అంతకంతకూ పెరుగుతోంది. అడవుల విస్తీర్ణం పెంచాలని.. పచ్చదనం పరిఢవిల్లాలని రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు విరుద్ధంగా జిల్లాలో పచ్చదనం గొడ్డలి వేటుకు గురవుతోంది. చెట్లను నరికి సాగు భూములుగా మార్చుతున్నారు. అటవీ స్థలాల కబ్జాను అడ్డుకోవల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.
అడవుల ఆక్రందన.. (నిజామాబాద్)

బాన్సువాడ మండలం కోనాపూర్‌లో సుమారు రెండు వందల ఎకరాల్లో భారీ వృక్షాలు నేలమట్టం చేసి పొలాలుగా మార్చారు. సమాచారం అందుకొన్న అధికారులు అక్కడికెళ్లి పరిశీలించి వదిలేశారు. పదిహేను రోజుల కిందట ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్‌, కొట్టాల్‌ గ్రామాల్లో ఎనిమిది ఎకరాల్లో చెట్లను నరికివేసి సాగుచేసేందుకు కొందరు సమాయత్తం అయ్యారు. అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. గాంధారి మండలం గౌరారం అడవుల్లో చెట్లను నరికివేశారు.. చర్యలు తీసుకోవాలని వారం రోజుల కిందట గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు.2005 ఏడాదికి ముందు జిల్లాలో అటవీ ఆక్రమణలు అంతగా లేవు. తర్వాత అటవీ భూముల్లో పోడు వ్యవసాయంపై గిరిజనులు, గిరిజనేతరులు దృష్టి సారించడంతో ఆక్రమణలు పెరిగాయి. ఇదే సమయంలో అప్పటి ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు అందిస్తామని ప్రకటించడంతో ఆక్రమణలు వేగం పుంజుకొన్నాయి. 2001లో జిల్లాలో 80910.48 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం వ్యాపించి ఉంది. 2019 వచ్చేనాటికి సుమారు 25వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం ఆక్రమణలకు గురైందని అధికారులు అంచనా వేశారు. బాన్సువాడ డివిజన్‌ పరిధిలో 39,665 హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో సగానికి పైగా ఆక్రమణకు గురైంది. ఇదే పరిస్థితి కామారెడ్డి డివిజన్‌ పరిధిలోని మాచారెడ్డి, లింగంపేట, ఎల్లారెడ్డిలో ఉంది. భూ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూ దస్త్రాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అటవీ, రెవెన్యూ శాఖల వివాదంలో ఉన్నటువంటి భూముల సర్వే చేపట్టింది. గత కొంత కాలంగా అటవీ భూములు సాగుచేసుకొంటున్న రైతులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొందరు గిరిజనుల ముసుగులో అటవీభూములు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

No comments:

Post a Comment