Breaking News

04/11/2019

ఫలించిన ప్రణాళిక (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, నవంబర్ 04 (way2newstv.in): 
30 రోజుల ప్రణాళిక ఫలితాన్నిస్తోంది. ఇప్పటికే వచ్చిన ఫలితాలతో సరికొత్త కార్యక్రమాలు గ్రామపంచాయతీలకు చేరువవుతున్నాయి.  గ్రామాల్లో చెత్త ఎత్తేందుకు ఎక్కడా వాహనాల వినియోగం లేదు. రిక్షాలు ఉపయోగంలో ఉన్నా మరమ్మతులతో కొన్నిరోజులకే అవి మూలనపడుతున్నాయి. ఫలితంగా కథ మళ్లీ మొదటికే వస్తోంది. వర్షాకాలంలో చెత్తాచెదారంతో ఇది మరింత ఇబ్బంది అవుతోంది. పరిసరాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం పంచాయతీకో ట్రాక్టర్‌ కొనుగోలుకు నిర్ణయించింది. గ్రామ జనాభా ఆధారంగా చిన్న ట్రాక్టర్‌, పెద్ద ట్రాక్టర్‌ అనేది ఎంపిక చేస్తారు. ఇప్పటికే జిల్లా అధికారులు గ్రామాల వారీగా వివరాలను సేకరించారు. జనాభాను బట్టి ఏ పంచాయతీలో ఏ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్‌ వినియోగించాలనేది లెక్క కట్టారు. 
ఫలించిన ప్రణాళిక (ఆదిలాబాద్)

ట్రాక్టర్‌ వెనకాల చెత్త నింపేందుకు ట్రాలీ ఉంటుంది. ఇటీవల ఎంపిక చేసిన చెత్త డంపింగ్‌ యార్డుల్లో ఈ చెత్తను నింపుతారు. దీనికితోడు 2 వేల జనాభా దాటినా కాస్త పెద్ద పంచాయతీల్లో పిచ్చి మొక్కలు తొలగించేందుకు ట్రాక్టర్‌ ముందు బిగించేలా బ్లేడు కొనుగోలు చేయనున్నారు. ఇంతకుముందు ట్రాక్టర్‌ బ్లేడు అవసరముంటే పట్టణం నుంచి తీసుకురావడం వల్ల పంచాయతీలపై తీవ్ర భారం పడేది. ఇక ఆ సమస్య దూరం కానుంది. ఇది రోడ్డు చదును చేసేందుకు సైతం ఉపకరిస్తుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం గ్రామాల్లో సక్రమంగా అమలు కావడంలేదు. మొక్కలను రక్షించడం ఒక ఎత్తయితే నీళ్లు పోయడం మరో ఎత్తుగా మారింది. ఎలాగో పంచాయతీలో ట్రాక్టర్‌ కొనుగోలు చేస్తుండడంతో అందులోనే ట్యాంకర్‌ పెట్టి నీళ్లు పోసేలా ప్రణాళిక తయారు చేశారు. దీనికోసం గ్రామాల్లో ట్యాంకర్లు సైతం కొనుగోలు చేయనున్నారు. ప్రతి మొక్కను పెంచి గ్రామాల్లో పచ్చదనం కనిపించేలా చేయడం దీని ఉద్దేశం. కేవలం పెద్ద పంచాయతీల్లోనే ఈ ట్యాంకర్లను వాడతారు. అవసరమైతే చిన్న పంచాయతీలకు పంపిస్తారు. గ్రామాల్లో వేసవిలో తలెత్తే నీటి ఎద్దడి నివారించేందుకు సమీప వ్యవసాయ బావుల నుంచి నీళ్లు తీసుకొచ్చి పరిష్కరించేందుకు ట్యాంకర్లను వినియోగించవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రతి పంచాయతీలో పరికరాల కొనుగోలు కోసం జనాభాను దృష్టిలో ఉంచుకుని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వ్యయం కానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో 25 శాతం పంచాయతీ భరిస్తే మిగతా 75 శాతం బ్యాంకు రుణం కింద అందించనున్నారు. ఏ బ్యాంకు అనేది రాష్ట్రస్థాయిలోనే నిర్ణయం కానుంది. ఒక కంపెనీ అని కాకుండా అన్నిరకాల కంపెనీల ట్రాక్టర్లు, యంత్రాలు ప్రజలకు చూపించేందుకు త్వరలో జిల్లాస్థాయిలో మేళా నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment