Breaking News

08/11/2019

మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా ఉద్యమం

విజయవాడ, నవంబర్ 8 (way2newstv.in)
జగన్ రాజకీయం పద్మవ్యూహంలో అభిమన్యుడిని తలపిస్తోంది. ఆయనకు అన్ని విద్యలూ వచ్చు. కానీ ఒకేసారి పదిమంది రాజకీయ శత్రువులను ఎదుర్కోవడం అంటే కష్టమే మరి. ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టగానే హుషారుగా హామీల అమల్లో దూకుడు పెంచుకుంటూ పోయారు. వెల్ఫేర్ క్యాలండర్ ఒకటి పెట్టి మరీ ప్రతి పది రోజులకు ఒక ప్రొగ్రాం ని జగన్ ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే రాజకీయల్లో ఎపుడేం జరుగుతుందో అంచనా వేయలేరు ఎవరూ. జగన్ విషయంలోనూ అదే జరిగింది. ఇసుక చిన్న సమస్య అనుకుంటే అదే పెను భూతమైపోయింది. ఇపుడు ఏపీలో రాజకీయ గోల మామూలుగా లేదు. జగన్ కి చేతులు కట్టేసినట్లుగా ఉంది. వరద నీరు ఇంకా పారుతోంది. అది ఎపుడు తగ్గుతుందో ఇసుక ఎపుడు బయటకు వస్తుందో ఆ దేవుడే చెప్పాలి. 
మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా ఉద్యమం

ఇక నవంబర్, డిసెంబర్ నెలలు తుపాను నెలలు కూడా. మళ్ళీ వానలు గట్టిగా పడితే ఇంతే సంగతులు. ఇదే ఇపుడు వైసీపీ నేతలను బెంగపెడుతోంది.ఇదిలా ఉండగా ఇపుడు ఏపీలో మరో ఉద్యమానికి ఊపిరి ఊదడానికి రంగం సిధ్ధమవుతోంది. ఏపీలో ప్రత్యేక హోదా కోసం తొందరలోనే మంచి ముహూర్తం చూసుకుని ఉద్యమం చేపడతామని హోదా సమితి నేత చలసాని శ్రీనివాస్ తాజాగా ప్రకటించారు. అంటే హోదా గుదిబండ ఇపుడు జగన్ కి చుట్టుకుంటుందన్నమాట. అంటే ఇక ఎస్ అంటే ఓ తంటా, నో అంటే మరో తంటా. నిజానికి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని గట్టిగా జనంలోకి పంపించి వైసీపీ ఇన్ని సీట్లు సాధించింది. అందువల్ల కచ్చితంగా హోదాకు జగన్ ఎస్ అనాల్సిందే. అదే కనుక జరిగితే ఆయన వెంటనే కేంద్రానికి చెడ్డ అవుతారు. ఇప్పటికే కేంద్రంతో సంబంధాలు ఏమీ బాగాలేవు. ఏపీలోని బీజేపీ నేతలు జగన్ ని నానా రకాలుగా నిందిస్తున్నారు. ఇపుడు హోదా అంటూ డిమాండ్ పెడితే కన్నెర్ర చేయడం ఖాయం. అనకపోతే జనంలో జగన్ బదనాం అవుతారు.అప్పట్లో జగన్ హోదా కావాలంటూ ఊరూరా తిరిగారు, ఇపుడు ఆ పాత్రలోకి బాబు సులువుగా మారిపోతారని కూడా అంటున్నారు. బాబు డైరెక్ట్ గా ఉద్యమాలు చేయకపోయినా హోదా సమితికి మద్దతు ఇస్తారు. జగన్ ని డిమాండ్ చేస్తారు, దబాయిస్తారు. ఇక పవన్ జనసేన కూడా తోడు అయితే, ఒక్క బీజేపీ తప్ప అంతా పోలిటికల్ సీన్లోకి వస్తారు. అది జగన్ కి ఇబ్బందికరమే అవుతుంది. మరో వైపు లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీకి కేంద్ర సహకారం కచ్చితంగా కావాలి. అందువల్ల జగన్ ఇదివరకటిలా ఫోర్స్ గా హోదా అన్న మాట అనలేరు. అది రాజకీయంగా జగన్ కు చెడ్డ పేరు తెచ్చే ప్రమాదమూ ఉంది. తొందరలొనే హోదా సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని శ్రీనివాస్ చెప్పడం అంటే జగన్ ని ఇబ్బంది పెట్టేందుకు ముహూర్తం వెతకడమే. మరి జగన్ ఈ గండాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

No comments:

Post a Comment