హైద్రాబాద్, నవంబర్ 8 (way2newstv.in)
అధికార పార్టీలో అసంతృప్తులకు బుజ్జగింపులు మొదలయ్యాయా..? నామినేటెడ్ పదవులతో ఎమ్మెల్యేలు సంతృప్తి పరిచేందుకు అధిష్ఠానం సన్నాహాలు చేస్తోందా....? అంటే అవుననే అంటున్నారు గులాబీ నేతలు. కొందరికి పదవులిస్తే మిగతా వారి పరిస్ధితేంటి..? ప్రస్తుతం అధికార పార్టీలో ఇదే చర్చ జరుగుతోంది. అసంతృప్తితో ఉన్న ఇందూరు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరిగా ఏదోలా బుజ్జగిస్తున్న అధినేత తాజాగా మరో ఎమ్మెల్యేను హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని చెప్పారట. అధిష్ఠానం ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్న మిగతా ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్ధితి మింగలేక కక్కలేక చందంగా మారిందట. ఇంతకీ ఆ ఎమ్మెల్యేకు అందిన తీపి కబురేంటి ఎదురుచూసే మిగతా ఇద్దరి భవిష్యత్తేంటి?నిజామాబాద్ జిల్లా అధికార పార్టీకి కంచుకోటలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్దానాలకు 8 స్ధానాల్లో జయకేతనం ఎగురవేసింది.
ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు
ఎన్నికల అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సైతం టీఆర్ఎస్ గూటికి చేరడంతో మరోసారి గులాబీ పార్టీ జిల్లాను క్లీన్ స్వీప్ చేసినట్లైంది. గెలిచిన 9 మందిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మినహా మిగతా ఎమ్మెల్యేల్లో, కొందరు ఐదుసార్లు ఇంకొందరు నాలుగుసార్లు, మరికొందరు రెండు సార్లు గెలిచిన వాళ్లున్నారు. వారిలో అత్యధికసార్లు గెలిచిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి స్పీకర్ బాధ్యతలు కేటాయించగా రెండో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న గంపగోవర్ధన్ కు విప్ గా నియమించారు. మరో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ మంత్రి పదవి ఆశించగా ఆయన్ను కాదని, రెండు సార్లు గెలిచిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు సీఎం కేసీఆర్. క్యాబినెట్ బెర్త్ కోసం ఆశ పడ్డ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే షిండే, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డిలు పదవి దక్కక తమ దగ్గరి అనుచరుల వద్ద కుమిలిపోతున్నారట. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఓ అడుగు ముందుకేసి పార్టీలో గుర్తింపు లేదంటూ నిరసన గళం ఎత్తారు. బీజేపీ ఎంపీని కలవడం అప్పట్లో పార్టీలో తీవ్ర దుమారమే రేగింది. ఆ తరవాత వివాదం సద్దుమణిగినా అసంతృప్తి సెగలు మాత్రం రగులుతూనే వున్నాయి ఇందూరు ఎమ్మెల్యేల్లో సీనియర్‌గా ఉన్న ఎమ్మెల్యేకు అధిష్ఠానం క్యాబినెట్ హోదా పోస్టుతో కూల్ చేయాలని చూస్తోందట. ఆయనను ఈ పాటికే రైతు సమన్వయ సమతి అధ్యక్షునిగా ఎంపిక చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని సదరు ఎమ్మెల్యేకు అధిష్ఠానం పెద్దలు సూచించడంతో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి అధినేత పిలుపు కోసం హైదరాబాద్‌లో మకాం వేశారనే ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ సమ్మె ముగిసిన వెంటనే రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా నియామకం చేస్తారని తెలిసింది. ఈపాటికే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. మినిస్టర్ పదవి పక్కన పెడితే కనీసం నామినేటెడ్ పోస్టు వస్తుందని ఎదురుచూస్తున్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌లకు తీపి కబురు అందని ద్రాక్షలా మిగిలిందట. హుజూర్ నగర్ ఎన్నికల్లో బాగా పనిచేసిన బిగాలను అధినేత ప్రశంసించారట. కానీ నామినేటెడ్ పోస్టుపై ఎలాంటి హామి ఇవ్వలేదట. దీంతో ఆయన తన అనుచరుల వద్ద అసంతృప్తితో రగిలిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో ఎమ్మెల్యే షకీల్ విషయంలో అధిష్ఠానం గుర్రుగా ఉంది. ఆయనకు పదవి దక్కడం అనుమానమనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలను ఎలాగొలా సంతృప్తి పరుస్తున్న అధినేత మరో ఇద్దరి భవిష్యత్తుపై ఎలాంటి భరోసా ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ఇద్దరిలో ఒకరు మాత్రం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మరొకరు మాత్రం ఛాన్స్ రాకపోదా అంటూ వెయిట్ చేస్తున్నారట. మరీ ఆ ఇద్దరిలో లక్కీ ఛాన్స్ కొట్టేదెవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అధిష్ఠానం పెద్దలు.
No comments:
Post a Comment