Breaking News

07/11/2019

బలపడుతున్న బుల్ బుల్

న్యూఢిల్లీ, నవంబర్ 7, (way2newstv.in)
అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుఫాను గురువారం సాయంత్రానికి తీరం దాటనుంది. తీరం దాటే సమయానికి క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అటు బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్‌బుల్ రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది. గురువారం ఉదయం 6 గంటలకు విడుదల చేసిన బులిటెన్‌లో తెలియజేసింది. మహా తుఫాను తూర్పు దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఇది ప్రస్తుతం గుజరాత్‌లో పోరుబందరకు దక్షిణాన 180 కిలోమీటర్ల దూరంలోనూ, వేరావల్‌‌కు పశ్చిమాన 160 కిలోమీటర్లు, డయ్యూకి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ వివరించింది. 
బలపడుతున్న బుల్ బుల్

బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్‌బుల్ తుఫాను ఉత్తరంవైపు గంటలకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు-మధ్య దిశలో కేంద్రీకృతమైన బుల్‌బుల్ వచ్చే 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని, 36 గంటల తర్వాత అత్యంత తీవ్రమైన తుఫానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ వెల్లడించింది.ఇది ఉత్తర దిశగా పశ్చిమ్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంవైపు కదులుతోంది. తుఫాను ప్రభావంతో అండమాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఒడిశాతోపాటు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో నవంబరు 9, 10న ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పశ్చిమ్ బెంగాల్ తీర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది.మరోవైపు, తుఫాను నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. తుఫాను ప్రభావం ఒడిశాపై అంతగా ఉండదని ఐఎండీ పేర్కొన్నా, కొన్నిసార్లు అనూహ్యంగా దిశ మార్చుకునే అవకాశం ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక, మహా తుఫాను ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్రలో అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్, థానే జిల్లాల్లోపై కూడా తుఫాను ప్రభావం ఉంటుందని తెలిపారు.

No comments:

Post a Comment