Breaking News

08/11/2019

తెలంగాణకు పెరుగుతున్న పర్యాటకులు

అత్యధికం గోల్కండ... అత్యల్పం వరంగల్ కోట
వరంగల్, నవంబర్ 8, (way2newstv.in)
హైదరాబాద్ లోని టూరిస్టు ప్రాంతాలను చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై అధికారులు అంతే దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోల్కొండకు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. 2016-18 లెక్కల ప్రకారం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఈ సారి గోల్కొండ నుంచే ఎక్కువగా డబ్బులు పర్యాటకుల నుంచి వచ్చింది. గోల్కొండ కోటకు రూ.5కోట్లు రాగా… మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఛార్మినార్‌కు రూ.3.66 కోట్లు వచ్చింది.ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే రెండు పర్యాటక ప్రాంతాలు తప్పనిసరిగా చూడాలనుకుంటారు. అందులో చారిత్రాత్మక కట్టడం చార్మినార్ ముందు వరసలో ఉండగా రెండో వరుసలో గోల్కొండ ఉంటుంది. అయితే గతంలో ఎక్కువ మంది చార్మినార్‌ను చూసేందుకే ఇష్టపడేవారట. కానీ క్రమంగా చార్మినార్‌ను చూసే సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు లెక్కలు తెలుపుతున్నాయి. 
 తెలంగాణకు పెరుగుతున్న పర్యాటకులు

ప్రస్తుతం పర్యాటకుల తాకిడి ఎక్కువగా గోల్కొండ వైపు మళ్లినట్లు తెలుస్తోంది. గోల్కొండకు వెళ్లే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా… అదే చార్మినార్‌కు పర్యాటకుల సంఖ్య స్థిరంగా ఉంది. మొత్తంగా తెలంగాణలో మూడు చారిత్రక కట్టడాల నుంచి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఖజానాకు రెవెన్యూ వస్తోంది. ఏపీలో 5 చారిత్రక కట్టడాలు ఉన్నప్పటికీ అంతగా రెవెన్యూ రావడం లేదని చెబుతోంది భారత పురావస్తు శాఖ.ప్రస్తుతం గోల్కొండకు ప్రవేశ రుసుం భారతీయులకు ఒక్కొక్కరికి రూ.15 వసూలు చేస్తుండగా… విదేశీయులకు అది రూ. 200గా ఉంది. ఇక స్టిల్ కెమెరాలకు రూ. 25 వసూలు చేస్తుండగా… సౌండ్ అండ్ లైట్ షోలకు రూ. 130 వసూలు చేస్తున్నారు. ఇక చార్మినార్ ప్రవేశ రుసుం భారతీయులకు ఒక్కొక్కరికి రూ. 5 ఉండగా… అదే విదేశీయులకు రూ. 100గా ఉంది. ఇక గోల్కొండకు అధిక మొత్తంలో లాభాలు సౌండ్ అండ్ లైట్ షోల నుంచే వస్తోంది.భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్ నుంచి గోల్కొండకు తరలించిన తర్వాత అక్కడ నిర్వహణపై మున్సిపల్ సంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. ఇందులో భాగంగా సదుపాయాలు మెరుగుపర్చడంతో పాటు అక్కడి పరిసరాలను శుభ్రపరచడంలాంటివి చేస్తున్నాయి. ఇక 2017లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో ఆమె గోల్కొండను సందర్శించారు. ఇవాంకా వస్తుండటంతో ఆ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చి దిద్దారు. అంతేకాదు గోల్కొండ పలు సినిమా షూటింగులకు, ప్రభుత్వ సమావేశాలకు వేదికగా నిలుస్తోంది. ఇక ప్రతి నెల గోల్కొండకు పర్యాటకుల నుంచి వస్తున్న రుసుం చార్మినార్‌ కంటే రూ. 50వేలు ఎక్కువగా ఉన్నట్లు భారత పునరావస్తు శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు తెలంగాణలో చూసుకుంటే గోల్కొండకే అత్యధిక రెవిన్యూ వస్తుండగా అత్యల్పంగా వరంగల్ కోట నుంచి వస్తోందని తెలిపారు.జనవరి నుంచి భారత్ దర్శన్ ట్రైన్పర్యాటకుల కోసం త్వరలో ‘భారత్‌ దర్శన్‌’ ప్రత్యేక రైలు పట్టాలెక్కనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వీలుగా ఈ రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖ తొలిసారి దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన పర్యాటక రైలు ఇది. ఈ రైలు పర్యాటక ప్యాకేజీల రూపకల్పన, నిర్వహణను ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్‌ పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా, దేశంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పర్యటనలను ఏర్పాటు చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ డిఫ్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజీవయ్య తెలిపారు. మొదట దక్షిణ భారత యాత్రకు శ్రీకారం చుట్టామని, దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ పర్యాటక రైలు పయనిస్తుందని చెప్పారు.నగరం నుంచి ఏటా 50 వేల మందికి పైగా పర్యాటకులు ఉత్తర, దక్షిణ భారత యాత్రలకు రైళ్లలో తరలి వెళ్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక్కోసారి రెండు, మూడు రైళ్లు మారాల్సి వస్తోంది. దీంతో కుటుంబాలతో కలిసి ఎక్కువ లగేజీతో వెళ్లవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైల్వే సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేట్‌ టూరిస్టు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సంస్థల ప్యాకేజీలు ఖరీదైనవి కావడమే కాక కొన్నిసార్లు మోసాలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నగర పర్యాటకుల డిమాండ్‌ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేక పర్యాటక రైలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు దక్షిణ మధ్య రైల్వేకు సొంతంగా పర్యాటక రైలు రావడంతో ఇక ఇబ్బందులు తొలగినట్లేనని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు.

No comments:

Post a Comment