Breaking News

28/10/2019

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ పెయిడ్ మీటర్లు

హైద్రాబాద్, అక్టోబరు 28, (way2newstv.in)
ధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ విద్యుత్‌ రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. వినియోగదారులకు , విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఉపయోగపడేలా ఉండేవిధంగా విద్యుత్‌ సరఫరాలో స్మార్ట్‌ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. సెల్‌ఫోన్లలో పోస్ట్‌ పెయిడ్‌, ప్రీయిడ్‌ తరహాలోనే విద్యుత్‌ మీటర్లలో కూడా ప్రీపెయిడ్‌ మీటర్లు అందుబాటులోకి వచ్చా యి. ఇప్పుడు ఉన్న విద్యుత్‌ మీటర్లు పోస్ట్‌ పెయిడ్‌గా భావిస్తే ఇక కొత్తగా వచ్చిన మీటర్లను ప్రీపెయిడ్‌ భావించాల్సిఉంటుందని చెబుతున్నారు. 2023నాటికి దేశమంతటా ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్ల వ్యవస్థను అమల్లోకి తేవాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ పెయిడ్ మీటర్లు

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు కూడా ఇప్పటికే ప్రీపెయిడ్‌ మీటర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చాయి. మొదట ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నా రు. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాల్లో 10,500 ప్రీపెయిడ్‌ మీటర్లను అమర్చారు. మార్చి చివరినాటికి రాష్ట్రంలో మొత్తం 25వేల ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. జీడిమెట్ల ఐడిఏలో పైలెట్‌ బేసిస్‌గా 8,800 స్మార్ట్‌ మీటర్లను తయారు చేస్తున్నారు.ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లను స్మార్ట్‌ఫోన్స్‌లో ఉన్న వివిధ రకాల ఫీచర్స్‌ తరహాలోనే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రీపెయిడ్‌ మీటర్లలో ఉన్న స్మార్ట్‌ ఫీచర్స్‌ ఆధారంగా వాటిని రిమోట్‌తో కూడా ఆపరేట్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ మీటర్లుగా తెలిపే ఈ మీటర్లలో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ చార్జింగ్‌ ఒక భాగం మాత్రమే అని అధికారులు వివరిస్తున్నారు. స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లలో ఎక్కడైనా విద్యుత్‌ చౌర్యం జరిగితే వెంటనే తెలిసిపోతుంది. అంతే కాకుడా ఎక్కడైనా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఉన్నా తెలిసిపోతుంది. అభివృద్ది చెందిన దేశాల్లో ఇప్పటికే విద్యుత్‌ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్స్‌ ఎక్యూప్‌మెంట్‌ ద్వారానే విద్యుత్‌ అందచేస్తున్నారు. ఇళ్లలోని వస్తువులకు సంబంధించిన వాటిలో ఏసీలు, ఫ్యాన్లు, ఎలక్ట్రిక్‌ కుక్కర్లు, వాటర్‌ మోటర్లు వంటి వాటిని స్మార్ట్‌ మీటర్‌తో అనుసంధానం చేసి ఎక్కడి నుంచైనా వాటిని ఆన్‌-ఆఫ్‌ చేసుకోవచ్చు. ఎక్కడో సూదూర ప్రాంతంలో ఉండికూడా మెసేజ్‌ ద్వారా స్మార్ట్‌ మీటర్ల నిర్వహణ చేసుకునే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. దీనివల్ల సమయం కూడా కలిసి వస్తుందంటున్నారు.స్మార్ట్‌ మీటర్ల ద్వారా విద్యుత్‌ను వినియోగించుకునే వారికి నాన్‌పీక్‌ టైంలో విద్యుత్‌ టారీఫ్‌లో రాయితీలు కూడా కల్పించే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. విద్యుత్‌ పంపిణీలో పీక్‌టైం ,నాన్‌ పీక్‌టైంలో టారీఫ్‌ ఇప్పటికే హెచ్‌టి వినియోగదారులకు అమల్లో ఉంది. నాన్‌పీక్‌ టైంలో విద్యుత్‌ వినియోగించుకునే వారికి యూనిట్‌ చార్జీల్లో రాయితీ కల్పిస్తున్నారు. అదే విధంగా లోటెన్షన్‌, గృహ వినియోగదారులకు కూడా రాయితీలు కల్పించాలని ఆలోచిస్తున్నారు. మార్కెట్‌లో విద్యుత్‌ను పీక్‌టైంలో అధికరేటుకు కొని సరఫరా చేస్తున్నారు.నాన్‌ పీక్‌టైంలో తక్కువ ధరలకే విద్యుత్‌ లభిస్తోంది. రాయితీలు కల్పిస్తే పీక్‌టైంలో లోడ్‌ తగ్గిపోవటంతోపాటు డిస్కమ్‌లపై ఆర్ధిక భారం కూడా చాలా తగ్గనుంది.స్మార్ట్‌ మీటర్లలో ఉన్న సదుపాయాల ద్వారా ప్రీపెయిడ్‌ విధానం ఎంపిక చేసుకుని నెలకు ఎన్ని యూనిట్ల విద్యుత్‌ అవసరమో అంతే మొత్తానికి ముందుగానే చార్జీలు చెల్లించి ప్రీపెయిడ్‌ మీటర్‌లో చార్జింగ్‌ చేసుకోవాల్సిఉంటుంది. చార్జింగ్‌ పూర్తయితే వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. ఈ విధానంలో విద్యుత్‌ వినియోగంలో దుబారా, వృధా వంటివాటికి చెక్‌ పడుతుందంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ దుబారా, వృధాను అరికట్టి పొదుపును పాటింప చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ మీట్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ చార్జీలు వివిధ శాఖల్లో లక్షల్లోనే పేరుకుపోతున్నాయి. కొన్ని శాఖలు ఐదారు నెలలుగా చార్జీలు చెల్లించటంలేదు. ఒక్క ఎస్పీడీసీఎల్‌ పరిధిలోనే ప్రభుత్వ కార్యాలయాల నుంచి సుమారు 120కోట్ల మేరకు విద్యుత్‌ చార్జీలు రావాల్సివుండగా అందులో 50శాతం మాత్రమే రెగ్యులర్‌గా వసూలవుతున్నాయి. మిగిలిన 50శాతం బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రీపెయిడ్‌ మీటర్ల వల్ల డిస్కమ్‌లకు విద్యుత్‌ బకాయిల సమస్య తొలగిపోనుంది.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని కేటగిరిల విద్యుత్‌ కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ మీటర్లు అమర్చాల్సి వస్తే 1.40కోట్ల మీటర్లు అవసరం అని డిస్కమ్‌లు అంచనావేశాయి. ఎత్తిపోతల పధకాలు వంటి వాటికి మినహాయింపు ఇవ్వనున్నారు. వినియోగదారుడికి ఎటువంటి భారం పడకుండా డిస్కమ్‌లే ప్రీపెయిడ్‌ మీటర్లను అమర్చుతున్నాయి. ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు ఈఆర్సీ అధికారికంగానే తక్కువ రేటుకు విద్యుత్‌ సరఫరా చేయించాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం.

No comments:

Post a Comment