100 మందికి గ్రేటర్ నోటీసులు
హైద్రాబాద్, అక్టోబరు 29, (way2newstv.in)
రోజుకు100కిలోలు,అంతకన్నా ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, బాంక్వెట్‌హాళ్లు తదితర వాటిల్లో వచ్చే 20రోజుల్లోపు కంపోస్ట్ ఎరువు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశించారు. లేనిపక్షంలో ఆయా హోటళ్లకు రెడ్‌నోటీసులు జారీ చేయడమే కాకుండా అవసరమైతే మంచినీటి సరఫరాను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. కంపోస్ట్ ఎరువు యూనిట్ల ఏర్పాటుపై వివిధ హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో కమిషనర్ సమావేశమయ్యారు. దాదాపు 100కుపైగా బల్క్ గార్బేజ్ ఉత్పత్తిచేసే హోటళ్ల యజమానులు సమావేశానికి హాజరయ్యారు.
బల్క్ గా చెత్త పడేసే వాళ్లపై చర్యలు
2016 ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం రోజుకు 50 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రతి సంస్థ తప్పనిసరిగా అంతర్గత కంపోస్ట్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై గతంలో పలుమార్లు చెప్పామని, అవగాహన కూడా కల్పించినట్లు గుర్తుచేశారు. ఆగస్టు 15వ తేదీలోపు ఎరువు యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని గతంలో గడువు విధించామని, తాజా గడువు ప్రకారం వచ్చే 20 రోజుల్లోగా కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకోని సంస్థలకు రెడ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కంపోస్ట్ ఎరువు తయారీ యూనిట్లకు అయ్యే ఖర్చు, అవి దొరికే ప్రాంతాలు, విక్రయించే సంస్థలు తదితర వాటిపై నవంబర్ మొదటివారంలో జోన్లవారీగా ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు చెప్పారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాలను మెరుగుపర్చేందుకు నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు విజయవంతమయ్యేలా తగిన సహకారం అందించాలని కోరారు. ప్రధానంగా త్రీ, ఫోర్, ఫైవ్‌స్టార్ హోటళ్లన్నీ తప్పనిసరిగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని, ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు పాటించే హోటళ్లు, రెస్టారెంట్లకు జీహెచ్‌ఎంసీ ద్వారా ప్రత్యేక బ్రాండింగ్ గుర్తింపు జారీచేస్తామని కమిషనర్ ఈ సందర్భంగా హామీఇచ్చారు.
No comments:
Post a Comment