Breaking News

04/10/2019

సిటీలో స్వీడెన్ తరహా ఫ్లాగింగ్...

హైద్రాబాద్, అక్టోబరు 4, (way2newstv.in)
ప్రపంచస్థాయి నగరాల తరహాలోనే గ్రేటర్‌లో నూతనంగా ప్లాస్టిక్ నియంత్రణలో ‘ప్లాగింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టింది జిహెచ్‌ఎంసి. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ ప్లాగింగ్ పద్దతిని కార్యరూపంలోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు, యువత, విద్యార్థులు భాగస్వాములయ్యారు. పాశ్చాత్య దేశాల్లోని పలు నగరాల్లో ప్లాగింగ్ అనే పేరుతో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని ఇక నుంచి నగరంలోనూ అమలు కొనసాగుతుందని గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్ స్పష్టంచేశారు.నిత్యం 22 వేల మంది పారిశుధ్య కార్మికులు నగరాన్ని పరిశుభ్రతగా చేసేందుకు విధులు నిర్వహిస్తున్నప్పటికీ కొంత మంది బాధ్యతా రాహిత్యం వల్ల రోడ్లపై వ్యర్థాలు వేస్తున్నారని కమిషనర్ అభిప్రాయపడ్డారు. 
సిటీలో స్వీడెన్ తరహా  ఫ్లాగింగ్...

సంధ్యవేళల్లో పరుగులుతీస్తూనే తమకు కనిపించే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ళు, ఇతర వ్యర్థాలను తొలగించడం ద్వారా స్వచ్చ హైదరాబాద్ స్పూర్తిలో నేరుగా ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని జిహెచ్‌ఎంసి నిర్వహిస్తున్నదని కమిషనర్ పేర్కొన్నారు.ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో కనిపించే నిరుపయోగమైన ప్లాస్టిక్ వస్తువుల ఏరివేత క్రమపద్దతిన జరుగనున్నది. ప్రపంచస్థాయి పర్యాటక నగరంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో పర్యాటక ప్రదేశాల్లోనూ ప్లాస్టిక్‌తో పొంచి ఉన్న ముప్పును పూర్తిగా తొలగించే క్రమంలో జిహెచ్‌ఎంసి అధికార యంత్రాంగం చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రజలు కూడా బుధవారం స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ వంతు సహాకారాన్ని ప్లాగింగ్ కార్యక్రమానికి అందించారు.ప్లాగింగ్ అంటే…స్వీడన్ దేశానికి చెందిన పదం ప్లాగింగ్ అంటే ‘ప్లొక్క అప్’ ఆంగ్లంలో పికింగ్ అప్ తెలుగులో మాత్రం ‘ ఏరివేయడం లేదా తీసివేయడం’గా చెప్పుకోవచ్చు. ఇది స్వీడన్ దేశంలోని పౌరులు దేహదారుఢ్యంపై ఉన్న మోజుతో సంధ్యవేళల్లో పరుగులు తీస్తూ, నడకను సాగిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో, వారు వెళ్ళే మార్గాల్లో కనిపించే వాడిన, పడేసిన, నిరుపయోగమైన ప్లాస్టిక్ వస్తువులను ఏరివేయడం చేస్తుంటారు. దీనిని ప్లాగింగ్ అని సంబోధిస్తున్నారు. ఈ పద్దతి నగరాన్ని పరిశుభ్రతగా కనిపించేలా చేయడమే కాకుండా కాలుష్యం పెరుగకుండా చూస్తుంది. జాగింగ్ చేస్తూ ఈ ప్రక్రియను అరగంటపాటు చేయడం వల్ల మనుషుల్లో కనీసంగా 288 కాలరీలు ఖర్చవుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ప్లాగింగ్ అమెరికాలోని సముద్ర తీర ప్రాంతాల్లో అమలు జరుగుతుంది. ఫలితంగా బీచ్‌లు అందంగా దర్శనమిస్తున్నాయని, దీంతో ఆ దేశం మొత్తం విస్తరింపజేస్తున్నట్టు సమాచారం.సంధ్యవేళల్లో అన్ని వయస్సులవారు పరుగులు, నడకను సాగించే వారు, ఉద్యానవనాల్లో సేదతీరే పౌరులు తమతమకు కనిపించే నిరుపయోగమైన ప్లాస్టిక్ వస్తువులను ఏరివేయడం, ఒక సంచిలో వేయడం చేసి వాటిని జిహెచ్‌ఎంసి పేర్కొన్న, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన, లేదా చెత్తకుండీలందు వదలడం చేస్తారు. ఈ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని జిహెచ్‌ఎంసి భావిస్తున్నది. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజలను ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాలని ఈ విధానాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చినట్టు కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు.గ్రేటర్‌లోని ప్రతి సర్కిల్‌లోని సంబంధిత డిప్టూ కమిషనర్‌ల స్థాయి నుంచి వైద్య అధికారులు, ఎస్‌ఎఫ్‌ఏలుల వరకు తమ పరిధిలో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్‌లు, కాలనీ విల్ఫేర్ అసోసియేషన్లు, పార్కుల నిర్వహణా కమిటిలతో తాము వాకింగ్ చేసే మార్గాల్లో వ్యర్థాలను తొలగించనున్నారు. నగర వ్యాప్తంగా ప్లాసిటక్ నిషేధంపై చైతన్య ర్యాలీలు, ప్రతిజ్ఞలు, వీధి నాటకాలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా చైతన్యం తీసుకువచ్చేందుకు గ్రేటర్ అధికార యంత్రాంగం కృషిచేస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం, అందుకు విశేషస్పందన వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాలు పాల్గొన్నాయి.

No comments:

Post a Comment