రాజమండ్రి, అక్టోబరు 1, (way2newstv.in)
సార్వత్రిక ఎన్నికలు ముగిసాకా అధికార వైసిపి ప్రతిపక్ష టిడిపి లకు రాష్ట్రం లో ఏ ఎన్నిక జరిగినా నువ్వా? నేనా? అనే రీతిలో వ్యవహారం నడుస్తుంది. అవి ఏ రకమైన ఎన్నిక అయినా ఇరు పార్టీలు ప్రతిష్టకు పోయి తమ ప్యానెల్ గెలవాలనే పట్టుదలతో పోరాడుతూ ఉండటం రాజకీయాలను మరింత వేడెక్కిస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు. ఈ ఎన్నికలు వాస్తవానికి రాజకీయాలకు అతీతంగా వర్తక ప్రముఖుల నడుమ సాగేవి. కానీ ఇప్పుడు పూర్తి రాజకీయ రంగు పులుముకోవడంతో రెండు ప్రధాన పక్షాల నడుమ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి కోస్తాలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వుంది.
చాంబర్ ఎన్నికల్లో పార్టీలు...
ఇక్కడ నుంచి గెలిచిన ఛాంబర్ టీం లు వర్తక లోకం కోసం ప్రభుత్వంపై అలుపెరగని పోరాటాలు చేసిన చరిత్ర వుంది. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం పైనా, ఆ తరువాత చంద్రబాబు సర్కార్ వున్నప్పుడు కూడా రాజమండ్రి ఛాంబర్ నాయకత్వంలోనే రాష్ట్రస్థాయి ఉద్యమాలు రూపుదాల్చాయి. వ్యాట్ టాక్స్ నుంచి టర్నోవర్ ట్యాక్స్ వరకు పలు కీలక చట్టాలపై పోరాటాలు సాగడం తో ఛాంబర్ కార్యవర్గాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తూ వచ్చింది.తాజాగా ఈ చరిత్రే రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడంలో ఒక కారణం. మరోవిధంగా రాజమండ్రి ఛాంబర్ నేపధ్యం వున్న వారు రాజకీయాల్లో కూడా సముచిత స్థానాలకు చేరుకోవడం కూడా క్రేజ్ ను పెంచింది. గతంలో మాజీ ఎమ్యెల్యే ఎసివై రెడ్డి, రౌతు సూర్య ప్రకాశ రావు వంటివారు చట్టసభలకు వెళ్లడం లో వర్తకులతో వున్న మంచి సంబంధాలతో బాటు వారి సమయంలో చేసిన ఉద్యమాలు వారి రాజకీయ ఎదుగుదలకు దోహద పడ్డాయి. ఈ నేపథ్యంలోనే వైసిపి, టిడిపి ఇప్పుడు తమ టీం లను బరిలోకి దింపి ప్రచారం హోరెత్తిస్తున్నాయి.ఇటీవల ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ రూరల్ నియోజకవర్గాల్లో వైసిపి గాలిని ఎదిరించి మరీ టిడిపి అభ్యర్థులు ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపు గుర్రాలు ఎక్కేశారు. దాంతో వైసిపి తన ఇంచార్జ్ ను సైతం మార్చివేసి ఇటీవలే మాజీ ఏపిఐఐసి ఛైర్మెన్ శివరామ సుబ్రమణ్యానికి బాధ్యతలు అప్పగించింది. పార్టీ ని అన్నివిధాలా బలోపేతం చేయాలన్న జగన్ నిర్దేశించిన నేపథ్యంలో శివరామ సుబ్రహ్మణ్యం అనధికారికంగా వైసిపి టీం ను రంగంలోకి దించారు. అయితే రాజమండ్రి ఛాంబర్ కు అధ్యక్షుడిగా బిజెపి మద్దతుదారుడు లక్ష్మీనారాయణ జవ్వార్ ను వైసీపీ నిలపడం విశేషం.వైసిపి టీం కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందులోనూ అవకాశం వదలకూడదని వచ్చే కార్పొరేషన్ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందని భావించిన టిడిపి మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మరో టీం ను తెరపైకి తేవడంతో రెండు వర్గాల నడుమ పోటీ ఆసక్తికరంగా మారింది. సోమవారం పోలింగ్ ముగిసి అర్ధరాత్రి ఫలితాలు రానుండటంతో ఇప్పుడు గోదావరి జిల్లాల వర్తక లోకం ఈ ఎన్నికలను ఎంతో ఉత్కంఠతతో గమనిస్తుంది. ఇరు వర్గాల్లో ఎవరు ఓటమి చవిచూసిన వారికి సొంత పార్టీలో అసమ్మతి రాగాలు వినిపించే ప్రమాదం ఉండటంతో శివరామ సుబ్రహ్మణ్యం, ఆదిరెడ్డి వర్గాలు చేస్తున్న ప్రచారం అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో హడావిడి గా సాగుతూ అందరిని ఆకట్టుకుంది.
No comments:
Post a Comment