Breaking News

01/10/2019

వైసీపీలో బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి కీలక పదవి

కర్నూలు, అక్టోబరు 1, (way2newstv.in)
ప్రస్తుత రాజ‌కీయాల్లో త‌మ‌ను తాము స‌మ‌ర్ధించుకోవ‌డ‌మే కాదు.. ప్ర‌త్య‌ర్థి ప‌క్షానికి చుక్క‌లు చూపించే నాయ‌కులు ఎంతైనా అవ‌స‌రం. అలాంటి నాయ‌కులకు రాజ‌కీయాల్లో ఏ మూల ఉన్నా.. ప్ర‌స్తుత మీడియా రాజ్య‌మేలుతున్న ప‌రిస్థితిలో వారికి త‌గిన విధంగా వెంట‌నే గుర్తింపు ల‌భిస్తోంది. ఇలాంటి వారిలో ఇప్పుడు అధికార వైసీపీలో ముందు వ‌రుస‌లో ఉన్నారు.. క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఇంచార్జ్‌.. సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.. బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. త‌మ్ముడు కొడుకు.. బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి. త్వ‌ర‌లోనే ఈయ‌న‌కు జిల్లా పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని అంటున్నారు.ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డున్న రాజ‌కీయాలు ఒక‌సారి ప‌రిశీలిస్తే.. వైసీపీ నందికొట్కూరు ఇంచార్జ్‌గా సిద్దార్థ రెడ్డి ఉన్నారు. 
వైసీపీలో బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి కీలక పదవి

అయితే,ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఆర్ద‌ర్ వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. వైఎస్ హ‌యాంలోనే ఆర్ధ‌ర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నాలు సాగాయి. అసెంబ్లీ మార్ష‌ల్స్ హెడ్‌గా ఉన్న ఆర్ద‌ర్‌.. రాజ‌కీయ నేత‌ల‌కు త‌ల‌లో నాలుక‌గా ఉంటార‌నే పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే వైఎస్ 2009లో టికెట్ ఆఫ‌ర్ చేశారు. అయితే, అప్ప‌ట్లో త‌న ఉద్యోగానికి ఇంకా సీనియార్టీ ఉంద‌ని చెప్పుకొచ్చిన ఆర్ద‌ర్ .. సున్నితంగా తిర‌స్క‌రించారు.ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఆర్ద‌ర్‌ను ఏరికోరి మ‌రీ ఇక్క‌డి టికెట్ ఇచ్చారు. ఈయ‌న గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని, గెలిపించుకుంటామ‌ని టికెట్ ఇచ్చిన సంద‌ర్భంలోనే జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఇక‌, ఈయ‌న గెలుపున‌కు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న సిద్దార్థ రెడ్డి కూడా ఎంతో కృషి చేశారు. ఇప్ప‌టికీ పార్టీ త‌ర‌ఫున మీడియాలోను, బ‌హిరంగ వేదిక‌ల‌పైనా గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లారు.ఇక‌, ఎమ్మెల్యే ఆర్ద‌ర్‌, ఇంచార్జ్ సిద్దార్థ రెడ్డి మ‌ధ్య ఎన్నిక‌ల వ‌ర‌కు బాగానే ఉన్న సంబంధం త‌ర్వాత ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశాయి. దీంతో జ‌గ‌న్ నేరుగా త‌న వ‌ద్ద‌కే పిలిపించుకుని పంచాయితీ చ‌క్క‌దిద్దారు. ఈ నేప‌థ్యంలో సిద్దార్థరెడ్డికి జ‌గ‌న్ ఎమ్మెల్యే చూసుకునే వ్య‌వ‌హారాల్లో వేలు పెట్ట‌వ‌ద్ద‌ని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. అయితే పార్టీ కోసం సిద్దార్థ రెడ్డి ప‌డిన క‌ష్టం గుర్తించిన జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు జిల్లా స్థాయిలో పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని చూస్తున్న‌ట్టు తెలిసింది. అలాగే డీసీసీబీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌ని కూడా అంటున్నారు. ఏదేమైనా క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో సిద్దార్థరెడ్డి శ‌కం ఆరంభ‌మైన‌ట్టేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment