Breaking News

01/10/2019

నెల కింద శ్మశానం.. ఇప్పుడు రియల్ ఎస్టేట్

కడప, అక్టోబరు 1,(way2newstv.in)
రాయచోటిలో రియల్‌ వ్యాపారం జోరందుకుంది. ప్రభుత్వ స్థలాలు, వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేసి ఎలాంటి అనుమతులు లేని విక్రయాలు కొనసాగిస్తున్నారు.. శ్మశానాలను రాత్రికి రాత్రే చదును చేస్తున్నారు. భవంతులు నిర్మించేశారు. సమాధులు కనిపించకుండా కొన్నిచోట్ల గోడలు కట్టేశారు. రాయచోటి-మదనపల్లి మార్గం నుంచి కె.రామాపురం రోడ్డుకు వెళ్లే మార్గంలో ప్రభుత్వ చెరువు ఉంది. అందులో కొంత భాగాన్ని ఆక్రమించి ప్లాట్లు వేశారు.  మాసాపేట, కడప మార్గంలోని అటవీశాఖ కార్యాలయ పరిసరాలలోని ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. అక్కడి చెరువు ఆక్రమితదారులు, అక్రమ పట్టాలతో కుంచించు కుపోయింది. 
నెల కింద శ్మశానం.. ఇప్పుడు రియల్ ఎస్టేట్

ఇప్పటికే పట్టణ పరిధిలో చాలా ప్రభుత్వ స్థలాలకు రికార్డులు తారుమారు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి రికార్డులను కడప జేసీ, ఆర్డీవో కార్యాలయాల రికార్డులతో సరి చూస్తే చాలా వరకు బోగస్‌ రికార్డులు, పట్టాలు వెలుగు చూసే అవకాశం ఉంది.పట్టణ పరిధిలో రియల్‌ వ్యాపారానికి దళారులే మూల స్తంభాలుగా కొనసాగుతున్నారు. సామాన్యుడు సెంటు స్థలం కొనుగోలు చేయాలన్నా పట్టణానికి నాలుగు కిలో మీటర్లు దూరం వెళ్లినా కొనలేని పరిస్థితి. జిల్లాలో 2005 వరకు మేజర్‌ పంచాయతీలుగా ఉన్న రాయచోటి, రాజంపేట, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల, ఎర్రగుంట్ల ఒకే సారి పురపాలికలుగా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. రాయచోటి అప్పట్లో ఆర్టీసీ బస్టాండు, ఠాణా, బంగ్లా కూడలి, గాంధీబజార్‌, కంసలవీధి, గాలివీడు రోడ్డు, హరినాథవీధి, కొత్తపేటలోని జగదంబ సెంటర్‌, ఎస్‌.ఎన్‌.కాలనీ వరకే పరిమితమై భవనాలు వెలిశాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాయచోటి పురపాలికగా మారింది. పురపాలిక పరిధిలోనే 2005-09 మధ్య రింగ్‌రోడ్డు నిర్మాణం చేశారు. అప్పటి వరకు రింగ్‌రోడ్డు ప్రాంతం గుట్టలు, వంకలు, వాగులు ఎక్కువగా కలిగి ఉండేది. రియల్‌ వ్యాపారం జోరందుకోవడంతో పట్టణ పరిసరాలలో స్థలాల ధరలు ఆమాంతరం పెరిగాయి. 13 ఏళ్ల కాలంలోనే పట్టణం నలువైపులా పెరిగిపోయింది. మదనపల్లి రోడ్డు, సుండుపల్లి రోడ్డు, గాలివీడు రోడ్డు, చిత్తూరు రోడ్డు, కడప రోడ్డు వైపు విస్తారంగా ప్లాట్ల వేసుకొంటూ వచ్చారు. మదనపల్లి, చిత్తూరు మార్గాలలో పట్టణం ఇంచుమించు రింగ్‌రోడ్డును తాకింది. గల్ఫ్‌ దేశాలలో స్థిరపడిన వారు, ఐటీ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులుే బహుళ అంతస్థుల భవనాలు నిర్మించారు. పురపాలిక అప్‌గ్రేడ్‌ సమయంలో 15 వేలకు మించిన గృహాలు ఉండగా ప్రస్తుతం 28 వేలకు మించాయి. పట్టణ జనాభా 1.10 లక్షలకు చేరింది. ఇక్కడ ఆవాసాలకు గిరాకీ పెరగడంతో పురపాలిక అనుమతులు లేకుండానే స్థలాలను అమ్మకాలు సాగించేస్తున్నారు. ఫలితంగా పురపాలికకు రావాల్సిన ఆదాయానికి భారీ గండిపడుతోంది.ఈ అక్రమ లేవుట్ల జోలికి ఎవరూ వెళ్లడం లేదు. రూ.కోట్లు చేతులు మారుతున్నాయి.పట్టణ పరిధిలో ఎటువైపు వెళ్లినా సెంటు స్థలం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలు పైబడి ధర పలుకుతోంది. ఇదే అవకాశంగా భావించిన కొందరు రియల్‌ వ్యాపారులు ప్రభుత్వ స్థలాలు, పాత డీకేటీలు, కాలువలు, వంకలు, వాగుల స్థలాలపై కన్ను వేశారు. పట్టణ పరిధిలో ఎక్కడ సెంటు స్థలం ఉన్నా తెల్లవారే సరికే అక్కడికి వాలిపోతున్నారు. ప్రకృతి ప్రసాదించిన గుట్టలైనా క్షణాల్లోనే చీల్చి ప్లాట్లుగా మార్చేస్తున్నారు. పట్టా భూముల పక్కన ప్రభుత్వ స్థలం ఉన్నా, గుట్టలు, కాలువలు, వంకలు, వాగులు సర్దుకునేసి ప్లాట్లలో కలిపేస్తున్నారు. కొందరు అధికారులు తెలిసినా స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలలో రియల్టర్ల ఆగడాలతో ప్రభుత్వ భూములు ఇక సెంటు కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు.

No comments:

Post a Comment