Breaking News

29/10/2019

శ్రీముఖలింగం ఆలయంలో కార్తీక సందడి

శ్రీకాకుళం అక్టోబరు 29 (way2newstv.in)
ప్రముఖ పుణ్యక్షేత్రం, శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని ప్రధాన దేవాలయం మధుకేశ్వరుని ఆలయం, జీవేశ్వర, సోమేశ్వరాలయాలు కార్తీక మాసంలో నిర్వహించే పూజలకు సిద్ధమయ్యాయి. కార్తీక మాసం మొదటి రోజు మంగళవారంతో ప్రారంభం అవ్వడం ఈ ఏడాది నాలుగు సోమవారాలు ఉన్నాయని కార్యనిర్వాహణాధికారి ఎవీ రమణయ్య తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీ క్యూలైన్ ఏర్పాట్లు, భక్తులకు నీడనిచ్చేందుకు పలు షామియానాలు ఏర్పాటు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీముఖలింగానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, ఒడిశా నుండి భక్తులు ఎక్కువగా వస్తారు.
శ్రీముఖలింగం ఆలయంలో కార్తీక సందడి

ఈ క్షేత్ర మహాత్యం విన్నా, చదివినా ఎంతో మోక్షం లభిస్తుందని పూర్వీకుల హితోక్తి. ఈ క్షేత్రంలో సాక్షాత్తూ శివుడే ఉద్భవించారని చరిత్ర చెబుతోంది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన మధుకేశ్వరునితో పాటు సాక్షి గణపతులు గంగా, యమున, సరస్వతి ముఖద్వారం వద్ద చిత్రలేఖనంతో ఉంది. ఉత్తర భాగంలో వారాహి అమ్మవారు కొలువై ఉంటారు. గ్రామంలో ఎక్కడ చూసినా శివలింగాలే దర్శనమిస్తుంటాయి. ఆలయానికి ఉత్తర భాగంలో ఎతైన కొండలు, వెనుక భాగం దక్షిణ దిశలో గలగలా పారే వంశధార నది, చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు, తోటలతో పుణ్యక్షేత్రం పర్యాటకులకు ఆకట్టుకుంటుంది. సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో పచ్చని మొక్కలతో బృందావనం మాదిరిగా కన్పిస్తుంది. ఇక్కడ ప్రతీ సోమవారం కార్తీకమాసంలో పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆలయాన్ని దర్శించి పికినిక్లు కూడా జరుపుకుంటారు. ఆది, సోమ వారాల్లో ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాల పలు జిల్లాల నుండి వందల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శిస్తుంటారు. ఇంతటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మంగళవారం నుండి కార్తీక పూజలు ఘనంగా నిర్వహించడానికి ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

No comments:

Post a Comment