ఎంపీ రేవంత్
హైదరాబాద్ అక్టోబర్ 21 (way2newstv.in)
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుపు రంగు టీషర్ట్ తో బైక్ పై వచ్చిన ఆయన నేరుగా ప్రగతిభవన్ వైపుగా దూసుకెళ్లారు. గేటు వద్దకు చేరుకోగానే.. పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. ఇదేమి రాజ్యం .. దొంగలరాజ్యం దోపిడీ రాజ్యం.. అంటూ నినాదాలు చేశారు. చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రగతి భవన్ ను బద్దలు కొడతాం
పరిస్థితి ఇలాగే కొనసాగితే నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజలు ప్రగతి భవన్ ను బద్దలు కొట్టడం ఖాయమని హెచ్చరించారు. ‘‘ఇవాళ ప్రగతి భవన్ గేట్లను తాకుతాం అన్నాం.. తాకినం.. రేపు బద్దలు కొడతాం’’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కార్ నియంతృత్వ, నిర్బంధ పోకడలను సహించేది లేదన్నారు. మరోవైపు ఆటోలో వచ్చిన జగ్గారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలను ఉదయమే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ గృహాల్లో నిర్బంధించారు. అయినా అడ్డంకులను దాటుకుని రేవంత్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి తదితర సీనియర్ నేతలు, యువజన, విద్యార్థి సంఘ నేతలు ప్రగతి భవన్ కు చేరుకున్నారు.
No comments:
Post a Comment