Breaking News

21/10/2019

యడ్డీకి ఉపఎన్నికలు టెన్షన్

బెంగళూర్, అక్టోబరు 21, (way2newstv.in)
యడ్యూరప్ప సంధికాలంలో ఉన్నట్లుంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంతోషంగా మాత్రం లేరు. ఇటు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర పార్టీలో అసమ్మతితో పాటు ఉప ఎన్నికలు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా జరిపిన సర్వేలో ఉప ఎన్నికలు జరిగే పదిహేను స్థానాల్లో కేవలం మూడు నుంచి ఐదు స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉందని తేలడంతో యడ్యూరప్ప మరింత డీలా పడిపోయినట్లు సమాచారం.కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెల 2వ తేదీకి వందరోజులు అవుతుంది. డిసెంబరు 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. 
యడ్డీకి ఉపఎన్నికలు టెన్షన్

పదిహేను స్థానాలనూ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తామని యడ్యూరప్ప ఇప్పటికే ప్రకటించారు. అతి కష్టం మీద ఈ ప్రతిపాదనకు కేంద్ర నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ సంపాదించగలిగారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత వరదలు చుట్టుముట్టాయి. అయితే కేంద్రం నుంచి సాయం అందకపోవడంతో యడ్యూరప్ప ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది.మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్ తో యడ్యూరప్పకు పొసగడం లేదు. నళిన్ కుమార్ కటిల్ ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వానికి నివేదికలు పంపుతూ యడ్యూరప్పను పాలనా పరంగా ఇబ్బందులు పెడుతున్నారు. చివరకు బదిలీలు కూడా కేంద్ర నాయకత్వం చేస్తుండటంతో యడ్యూరప్ప చేష్టలుడిగి చూస్తున్నట్లయింది. బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్ప తన రాజకీయా జీవితంలో ఎప్పుడూ ఇంత ఇబ్బందులు పడలేదని చెబుతారు. అధికారంలో లేనప్పుడు కూడా ఆయన మాటే చెల్లుబాటు అయింది. అయితే ఇప్పుడు కేవలం ముఖ్యమంత్రి ఉత్సవ విగ్రహంగా మారారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.పదిహేను స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కేవలం మూడు నుంచి ఐదు స్థానాలు మాత్రమే వస్తాయని తేలండంతో యడ్యూరప్ప సర్కార్ మూణ్ణాళ్ల ముచ్చటగానే మారనుందని తెలుస్తోంది. దీంతో తన ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తవుతున్న సందర్భంగా నవంబరు 2న ప్రధాని నరేంద్రమోడీని, అమిత్ షాలను ఆహ్వానించి తన పట్టును పెంచుకోవాలని యడ్యూరప్ప భావించారు. అయితే దీనికి కూడా యడ్యూరప్ప వ్యతిరేకులు గండికొట్టినట్లు తెలుస్తోంది. ఇలా యడ్యూరప్ప ఇప్పటి వరకూ సొంత ఇమేజ్ తోనే పార్టీని నడిపించినా ఇప్పుడు పార్టీ పట్టించుకోక పోవడంతో ఆయన పూర్తిగా ఒంటరి అయ్యారన్న వ్యాఖ్యలు పార్టీలో నుంచే విన్పిస్తుండటం విశేషం.

No comments:

Post a Comment