Breaking News

30/10/2019

కార్పొరేట్ ట్రైనింగ్ తో గిరిజన పాఠశాలలు

అదిలాబాద్, అక్టోబరు 30, (way2newstv.in)
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. పైలట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా వంద పాఠశాలలు ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్‌కు జిల్లాలో 59 పాఠశాలలను మొదటి విడత ఎంపిక చేసి మోడల్‌ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది.ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షితులను చేయడంతోపాటు అక్షరాస్యతను పెంపొందించడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 59 పాఠశాలల్లో 2,236 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. 
కార్పొరేట్ ట్రైనింగ్ తో గిరిజన పాఠశాలలు

వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీరికి కార్పొరేట్‌ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 28 ప్రాథమిక పాఠశాలల్లో 1,301 మంది, ఆసిఫాబాద్‌ జిల్లాలో 23 ప్రాథమిక పాఠశాలల్లో 730 మంది, మంచిర్యాల జిల్లాలో 5 ప్రాథమిక పాఠశాలల్లో 144 మంది, నిర్మల్‌ జిల్లాలో 3 ప్రాథమిక పాఠశాలల్లోని 61 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. ప్రతీ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమంలో ప్రత్యేక శిక్షణ పొందిన ముగ్గురు ఉపాధ్యాయులను నియమించి బోధన చేయిస్తారు.ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు మెరుగైన వసతుల కల్పన, ఆటపాటలతో కూడిన విద్య అందించనున్నారు. కిచెన్‌షెడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, డైనింగ్‌హాల్, క్రీడామైదానం, వివిధ రకాల ఆట వస్తువుల సమూహం, పాఠశాలల్లో టీవీ, ప్రొజెక్టర్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ఇందుకోసం రూ.4లక్షల వరకు ఖర్చు చేస్తారు. పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి రంగులతో వివిధ రకాల కళాకృతులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఆటపాటలతో కూడిన ఒత్తిడి, బరువు లేని విద్యావిధానం అమలు చేయనున్నారు. పాఠ్యపుస్తకాలను విద్యార్థులు పాఠశాలల్లోనే వదిలి ఇళ్లకు వెళ్లనున్నారు.విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతోపాటు పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దనుంది. ఇందుకోసం ఒక్కో బడికి గిరిజన సంక్షేమ శాఖ రూ.4లక్షల వరకు వెచ్చించనుంది. విద్యాబోధన కోసం ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను నియమించనుంది.ఆదిలబాద్‌ జిల్లాలో కొత్త లోద్దిగూడ, గాదిగూడ, మామిడిగూడ, చోర్‌గాం–ఎమ్‌టీ, పిప్రి–జీ, గోంకొండ, ఇంద్రవెల్లి–కె, అందుగూడ, వాన్‌వాట్, చోర్‌గాం–జీ, జాలంతాండ, ఎస్‌ఎన్‌ తండా, నానాదిగూడ, గోపాల్‌పూర్, వంకతుమ్మ, భవానిగూడ–సీ, చింతగూడ, గోపాల్‌సింగ్‌తాండ, పర్సువాడ–బీ, దుబార్‌పెటఏ, పల్సి–బీ తాండ, మనుగ్రోడ్, లంకర్‌గూడ, జాతర్ల, అందర్‌బంద్, లక్ష్మిపూర్, బెల్సరాంపూర్, కాండ్వా–జీ.ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో గిరిజన సంక్షేమ శాఖ అక్కడక్కడ గ్రామస్తులను కూడా భాగస్వాములను చేస్తోంది. ఆంగ్ల విద్య ప్రాముఖ్యత, పాఠశాలల విధానం వివరిస్తుండడంతో గ్రామస్తులు ముందుకొస్తున్నారు. చోర్‌గాం–ఎమ్‌టీ ప్రాథమిక పాఠశాలకు గ్రామస్తులు మూడెకరాల భూమి విరాళంగా ఇవ్వడంతోపాటు ఎనిమిది గదుల భవన నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. గాదిగూడ ప్రాథమిక పాఠశాలకు కిచన్‌ షెడ్‌ నిర్మాణాన్ని గ్రామస్తులు చేపట్టగా, పుసిగూడ గ్రామస్తులు పాఠశాలకు కిచెన్‌ షెడ్‌ నిర్మాణం, క్రీడా మైదానం కోసం అర ఎకరం భూమి విరాళంగా సమకుర్చారు. నాగోల్‌కొండ గ్రామస్తులు కిచెన్‌షెడ్, మరుగుదొడ్లు, రెండు గదుల నిర్మాణం చేపట్టనున్నారు. జాలంతండా వాసులు పాఠశాలకు డైనింగ్‌ హాల్‌ నిర్మాణం చేయనున్నారు.

No comments:

Post a Comment