Breaking News

30/10/2019

ప్రైవేట్ పర్మిట్లు దిశగా అడుగులు

హైద్రాబాద్, అక్టోబర్ 30, (way2newstv.in)
ఆర్‌టిసి కార్మిక సంఘాలు తరచూ సమ్మెలకు దిగడం వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని శాశ్వతంగా అధిగమించడానికి పలు రహదారుల్లో ప్రైవేటు వాహనాలను పర్మిట్లే ఇచ్చేందుకు ఆర్‌టిసి యజమాన్యం రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగా మూడు నుంచి నాలుగు వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీ చేసే అంశాన్ని ఆర్‌టిసి యజమాన్యం పరిశీలిస్తోంది. ఈ మేరకు తగు ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది. ఇదే అంశంపై రెండు, మూడు రోజుల్లో జరగనున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లుగా సమాచారం. భవిష్యత్తులో ఆర్‌టిసిలో ఎలాంటి సమ్మెలు జరగకుండా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. 
ప్రైవేట్ పర్మిట్లు దిశగా అడుగులు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చేసిన మోటార్ వెహికల్ 2019 ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఈ చట్టం 2019 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రసాదించిన అధికారాలు, అవకాశాలను వినియోగించుకుని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు 3-4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం తుది నిర్ణయాన్ని త్వరలో తీసుకోనుంది. ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వడం వల్ల వారు ఆదాయం కోసం తమకు కేటాయించిన రూట్లలో ఎక్కువ ట్రిప్పులు నడుపుతారు. షిఫ్టుల గొడవ లేకుండా ఎక్కువ సమయం వాహనాలను ప్రజల రవాణాకు అందుబాటులో ఉంచుతారు. ప్రజలకు ఇప్పటి కంటే ఎక్కువ రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల రోడ్డు రవాణాలో ఆరోగ్యకరమైన పోటీని ఏర్పాటు చేయాలనే పార్లమెంటు చట్టం ఉద్దేశ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినట్లు అవుతుందని తెలుస్తోంది. రూట్లకు పర్మిట్లు ఇస్తే నడపడానికి ప్రైవేటు వాహన యజమానులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం వెయ్యి రూట్లలో పర్మిట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే, 21,453 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రైవేటు వాహన యజమానులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉందని రవాణా అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. విద్యార్థులకు పరీక్షలు ఉన్నప్పుడు, పండుగల సీజన్ ఉన్నప్పుడు.. ఇలా అదను చూసుకుని కార్మిక సంఘాలు సమ్మెలకు పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయి. ఇలా సమ్మె జరిగినప్పుడల్లా ప్రజలకు విపరీతమైన అసౌకర్యం కలుగుతున్నది. దాదాపు 40 ఏళ్ల నుంచి ఇదే తంతు నడుస్తున్నది. దీన్నుంచి శాశ్వతంగా విముక్తి కావడానికి వివిధ రూట్లలో బస్సులు నడిపేందుకు ప్రైవేటు వారికి అవకాశం కల్పించడమే ఉత్తమమని ఆర్‌టిసి అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని అధికారికంగా వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్‌టిసి వ్యవహారం కోర్టులో నానుతుంది. ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియదు. ప్రస్తుతం హైకోర్టులో ఉన్న కేసు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని తెలుస్తోంది. మరోవైపు ఆర్‌టిసి నష్టాల్లో కొనసాగుతోంది. సమ్మె వల్ల వచ్చే ఆదాయం కూడా రావడం లేదు. దీంతో ఆర్‌టిసి తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. ఫలితంగా బస్సులకు డీజిల్ పోసే బంకుల్లో సైతం బకాయిలు పేరుకుపోయాయి. ఏ క్షణమైనా బంకులు డీజిల్ పోయడం ఆపేయవచ్చు. దీనివల్ల ప్రస్తుతం తిరుగుతున్న బస్సులు కూడా ఏ క్షణమైనా ఆగిపోయే అవకాశం ఉంది. మరోవైపు తీసుకున్న అప్పులకు కిస్తీలు చెల్లించలేని స్థితిలో ఆర్‌టిసి కూరుకుపోతున్నది. ఏ క్షణమైనా ఆర్‌టిసిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ (ఎన్‌పిఎ)గా గుర్తించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో తాము ప్రేక్షక పాత్ర వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు, మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రూట్లకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.

No comments:

Post a Comment