Breaking News

05/09/2019

జీవిత చరమాంకంలో చిద్దూకు కష్టాలు...

చెన్నై, సెప్టెంబర్ 5, (way2newstv.in)
ఢిల్లీ రాజకీయాల్లో పీసీగా సుపరిచితుడైన పళనియప్పన్ చిదంబరం జీవిత చరమాంకంలో కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఒక్కప్పుడు కేంద్ర హోంమంత్రిగా సీబీఐ అధికారులను, కేంద్ర ఆర్థిక మంత్రిగా ఈడీ అధికారులను కనుసైగలతో శాసించిన ఈ తమిళ తంబి ఇప్పుడు వారి పేరంటేనే ఉలిక్కి పడుతున్నారు. చిదంబరం ఆషామాషీ నేత కాదు. యూపీఏ హయాంలో వరసగా పదేళ్ల పాటు కేంద్ర ఆర్థిక, హోంమంత్రిగా చక్రం తిప్పిన కీలక నేత. రాజీవ్ గాంధీ శిష్య బృందంలో ప్రముఖుడైన ఈ హార్వార్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థి గాంధీ కుటుంబానికి నమ్మినబంటు. ఈ పేరుతోనే సోనియా, రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం పెంచుకుని పార్టీపై పట్టు సాధించారు. యూపీఏ పదేళ్ల పాలలో (2004 – 2014) ఒకదశలో ప్రధాని పదవికి ఆయన పేరుకూడా ప్రముఖంగా విన్పించింది.ఆ మాటకొస్తే అతి చిన్న వయసులోనే తమిళనాడులోని శివగంగ ప్రాంతానికి చెందిన ఆయన 1996లోనే కేంద్ర ఆర్థిక మంత్రి అయ్యారు.
జీవిత చరమాంకంలో చిద్దూకు కష్టాలు...

అప్పటి ప్రధాని దేవెగౌడ మంత్రివర్గంలో టీఎంసీ  నాయకుడి హోదాలో ఆర్థికమంత్రిగా చక్రం తిప్పారు. అంటే దాదాపు పాతికేళ్ల క్రితమే ఆర్థిక వ్యవస్థను ఔపోసన పట్టిన దిట్ట. తమిళనాడులోని సంపన్న చెట్టియాడ్ సామాజిక వర్గానికి చెందిన చిదంబరం ప్రజల్లో పట్టున్న నేత కాదు. అంతా ఢిల్లీలో లాబీయింగ్ ద్వారానే ఎదిగిన నేత. ఒకసారి అన్నాడీఎంకే, మరోసారి డీఎంకేతో పొత్తు ఫలితంగా సొంత నియోజకవర్గమైన శివగంగ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2014 లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఈ దఫా పోటీ చేయలేదు. కుమారుడు కార్తీ చిదంబరం శివగంగ నుంచి పోటీ చేసి గెలుపొందారు. డీఎంకేతో పొత్తు ఫలితంగా శివగంగలో ఆయనకు విజయం సిద్ధించింది. అంతేతప్ప ఆయన గొప్ప నాయకుడు ఏమీ కాదు. వాస్తవానికి ఈ విజయం డీఎంకేది అని చెప్పడంలో సందేహం లేదు.చిదంబరానిది ఉన్నత విద్యావంతుల కుటుంబం. స్వయంగా ఆయన ఆర్థికవేత్త కావడంతో పాటు సుప్రసిద్ధ న్యాయవాది. సుప్రీంకోర్టులో అనేక కేసులు వాదించారు. భార్య నళిని చిదంబరం కూడా ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది. కుమారుడు కార్తీ చిదంబరం కూడా న్యాయవాది. ప్రముఖ న్యాయవాదిగా తన వాగ్దాటితో అనేక మంది కక్షిదారులను కాపాడిన చిదంబరం చివరకు తన కేసుకు వచ్చేసరికి నిస్సహాయంగా చేతులు జోడించి కోర్టు బోనులో నిలబడ్డారు. భార్య నళిని చిదంబరం, కుమారుడు కార్తీ చిదంబరం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. విధి వైపరీత్యం అంటే ఇదేనేమో.చిదంబరం ఉన్నత విద్యావంతుడైనప్పటికీ అహంకారి అన్న పేరుంది. ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించారన్న ఫిర్యాదులున్నాయి. స్వార్థపూరితంగా వ్యవహరించారన్న అపవాదు ఉంది. యూపీఏ హయాంలో సాక్షాత్తూ తన సహచరుడు, సీనియర్ నాయకుడైన అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయంలో కొన్ని ఏజెన్సీల ద్వారా అక్కడి సంభాషణలను రికార్డు చేసేందుకు బగ్గింగ్ చేయించారు. చివరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ఈ విషయాన్ని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లింది. చివరకు ఇందుకు చిదంబరం కారణమని తేలింది. దీంతో మన్మోహన్, సోనియా గాంధీ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఇక చిదంబరంపై వచ్చిన ఆర్థిక ఆరోపణలకు లేక్కేలేదు. ఎయిర్ సెల్ మ్యాక్సిస్ , ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారాల్లోనూ కోట్లాది రూపాయల విదేశీ పెట్టుబడులను అక్రమంగా అనుమతించి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు వచ్చని ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ కేసుల్లో చిక్కుకుని ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. చిదంబరం భార్య నళిని చిదంబరం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచిన బెంగాల్ కు చెందిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం నుంచి భారీ మొత్తాన్ని స్వీకరించారన్న ఆరోపణ ఎదుర్కొంటున్నారు. చిదంబరం కుటుంబానికి దేశ విదేశాల్లో వేల కోట్ల రూపాయాల ఆస్తులు ఉన్నాయని చెబుతారు. చిదంబరానికి 12 దేశాల్లో 17 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. యూపీఏ హయాంలో సోనియా అండ చూసుకుని స్వైర విహారం చేసిన చిదంబరం ప్రత్యర్థులను బూటకపు కేసుల్లోనూ విచారించారు. విశృంఖలంగా వ్యవహరించారు. చివరకు ముఖ్యమంత్రి ఎంపికల్లోనూ లాబీయింగ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రోశయ్య అనంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికలోనూ కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి. తమ మనవరాలైన ఆదితి కోసం అక్రమాలకు పాల్పడ్డారన్న బలమైన ఆరోపణలున్నాయి.కుమారుడు కార్తి చిదంబరం, కోడలు సునిధి చిదంబరం గారాల పట్టి ఆదితి. ఆమెకు వందల కోట్లు సమకూర్చి పెట్టే పనిలో చిదంబరం చిక్కుల పాలయ్యారు. 2015 డిసెంబరులో భాస్కర్ రాయన్ అనే చార్టెడ్ అకౌంటెంట్ ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఆయన లాకర్ ను తెరిచి చూడగా నాలుగు వీలునామాలు కన్పించాయి. ఆదితి అనే అమ్మాయి కోసం తమ వాటాలను ధారాదత్తం చేస్తున్నట్లు రెండు వీలునామాల్లో పేర్కొన్నారు. ఆ అమ్మాయి ఆదితి చిదంబరం మనవరాలు. ఆ కంపెనీల షేర్లు అడ్వాంటేజీ స్ట్రాటజీస్ కన్సల్టెంట్ ప్రయివేటు సీఎండీ. తమ గురువుగారైన డాక్టర్ రంగరాజన్ పై అభిమానం, గౌరవంతో ఆయన మనవరాలికి వాటాఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. రంగరాజన్ కూతురు నళిని చిదంబరం. ఆమె చిదంబరం భార్య. రెండు కంపెనీల్లోని 60 శాతం వాటాలను ఆదితి పేరుతో రాశారు. అడ్వాంటేజీ కంపెనీకి ప్రముఖ కళ్ల జోళ్ల సంస్థ వాసన్ ఐ కేర్ లో 60 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ యాభై లక్షల తో ఆ వాటా కొంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు 2015 డిసెంబరులో భాస్కర్ రాయన్ అరెస్ట్ తో ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. చిదంబరం అరెస్ట్ తోఅసలు విషయాలు బయట పడుతున్నాయి. మొత్తానికి మనవరాలికి కోట్లు కూడబెట్టే పనిలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు

No comments:

Post a Comment