Breaking News

23/09/2019

ఎమ్మెల్సీ ఆశ పెట్టుకున్న దగ్గుబాటి..

ఒంగోలు, సెప్టెంబర్ 23, (way2newstv.in)
దగ్గుబాటి వెంకటేశ్వరరావు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరచితమైన నాయకుడే. ఒకప్పుడు ఒంటి చేత్తో ప్రకాశం జిల్లాను శాసించిన నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అయితే ఆయన జగన్ కు దూరంగా ఉంటున్నారు. అమరావతి వైపు అస్సలు చూడటం లేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తన కుమారుడు హితేశ్ చెంచురామ్ ను వైసీపీ అభ్యర్థిగా తొలుత బరిలోకి దింపాలనకున్నా, అమెరికా పౌరసత్వం అడ్డంకిగా మారడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేయాల్సి వచ్చింది.గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యింది కేవలం 23 మంది మాత్రమే. వారిలో అత్యధిక మంది అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. తమ నియోజకవర్గ సమస్యలపై చర్చించి వెళ్లిపోతున్నారు.
ఎమ్మెల్సీ ఆశ పెట్టుకున్న దగ్గుబాటి..

కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం ఇంతవరకూ జగన్ వద్దకు రాలేదు. జగన్ కూడా దగ్గబాటి వెంకటేశ్వరరావును గురించి పట్టించుకోలేదు. దీంతో దగ్గుబాటివెంకటేశ్వరరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకుమారుడు హితేశ్ చెంచురామ్ మాత్రం పార్టీకార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు.నిజానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆశించారట. సీనియర్ నేత అవ్వడం, చంద్రబాబు తోడల్లుడు కూడా కావడంతో శాసనమండలిలో విపక్షాన్ని నిలువరించేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఎమ్మెల్సీ చేస్తారని ఆయన సన్నిహితులు కూడా భావించారు. కానీ ఇటీవల మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసినా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేరు కన్పించలేదు. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మనస్తాపానికి గురయ్యారంటున్నారు. ఎన్నికల ముందు తనతో పాటు జైరమేష్ లాంటి నేతలను కూడా పార్టీలో చేరేలా తాను ప్రయత్నించానని, అది పార్టీకి ప్లస్ అయిందన్న విషయాన్ని జగన్ విస్మరించినట్లున్నారని తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని సమాచారం.
జగన్ తనను పిలిచేంత వరకూ వెళ్లనని కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెబుతున్నారు. అయితే నియోజకవర్గంలో మాత్రం ఆయన యాక్టివ్ గానే ఉంటున్నారు. ఇటీవల అధికారుల బదిలీలు ఆయన చెప్పినట్లే జరిగాయంటున్నారు. పర్చూరు నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా ఒక్క పని కూడా జరగడానికి వీలు లేదంటున్నారు. ఇటీవల తనకు తెలియకుండా ఒక ఎస్సైని పోస్ట్ చేయడంతో ఆగ్రహించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు జిల్లా మంత్రితో మాట్లాడి ఆయన్ను వెనక్కు పంపించేశారు. ఇలా నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ జగన్ వద్దకు వెళ్లడానికి మాత్రం ఇష్టపడటం లేదట. మరి దూరంగా ఉంటే ఎవరికి నష్టం? అన్న చర్చ కూడా దగ్గుబాటి సన్నిహితుల్లో జరుగుతోంది.

No comments:

Post a Comment