Breaking News

23/09/2019

భూమా బ్రహ్మానందరెడ్డి పక్కచూపులు

కర్నూలు, సెప్టెంబర్  23, (way2newstv.in)
భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి. అనూహ్యంగా రాజ‌కీయ తెర‌మీద మెరిసిన యువ నాయ‌కుడు. 2017లో హ‌ఠాత్తుగా గుండెపోటుతో మ‌ర‌ణించిన క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్లేస్‌లో అప్ప‌టి ఉప ఎన్నిక‌ల్లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి తెర‌మీదికి వ‌చ్చారు. భూమా నాగిరెడ్డి 2014లో వైసీపీ త‌ర‌పున పోటీ చేశారు. ఘ‌న విజ‌యం సాధించారు. జ‌గ‌న్‌కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న స‌తీమ‌ణి శోభ కూడా ఆళ్ల‌గ‌డ్డ నుంచి పోటీ చేసినా ప్ర‌చారం స‌మ‌యంలో జ‌ర‌గిన రోడ్డు ప్ర‌మాదంలో ఆమె మృతి చెందారు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో నాగిరెడ్డి జీవించిన స‌మ‌యంలోనే ఆయ‌న కుమార్తె అఖిలా ప్రియ పోటీ చేసి వైసీపీ త‌ర‌పున ఏక‌గ్రీవంగా విజ‌యం సాధించారు.
భూమా బ్రహ్మానందరెడ్డి పక్కచూపులు

ఆ త‌ర్వాత అనూహ్య రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో భూమా కుటుంబం చంద్ర‌బాబు చెంత‌కు చేరిపోయారు. మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇవ్వ‌డంతో భూమా నాగిరెడ్డి పార్టీ మారార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఇంత‌లోనే ఆయ‌న గుండెపోటుతో మృతి చెందారు. ఈ క్ర‌మంలో నంద్యాల‌కు 2017లో ఉప ఎన్నిక జ‌రిగింది. ఆ సమ‌యంలో 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డికి ఈ ఉప ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వాల‌ని అనుకున్నారు. అయితే, భూమా అఖిల ప్రియ మాత్రం ప‌ట్టుబ‌ట్టి త‌నకు వ‌ర‌సకు సోద‌ర‌డయ్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని తీసుకువ‌చ్చి టికెట్ ఇప్పించుకున్నారు.ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు కూడా ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. భారీగా డ‌బ్బులు కుమ్మ‌రించి నంద్యాలను అభివృద్ది చేశారు. నంద్యాల ఉపఎన్నిక దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోయింది. దేశంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనే అత్యంత ఖ‌రీదైన ఉప ఎన్నిక‌క‌గా రికార్డుల‌కు ఎక్కింది. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కోట్లాది రూపాయ‌లు కుమ్మ‌రించారు. అటు జ‌గ‌న్ ఏకంగా 10 రోజుల పాటు నంద్యాల‌లో ప్ర‌చారం చేశారు. దీంతో ఆ ఎన్నిక‌ల్లో ట‌ఫ్ ఫైట్ జ‌రుగుతుంద‌ని అంద‌రూ భావించినా భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఘ‌న‌విజ‌యం సాధించారు.ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఏకంగా 27 వేల ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి నాడు టీడీపీతో పాటు ల‌క్ష‌లాది మంది టీడీపీ అభిమానుల గుండెల్లో హీరో అయిపోయాడు. అయితే, ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి ఏంటి? అనే ప్ర‌శ్న త‌లెత్తిన‌ప్పుడు అనేక మంది సీనియ‌ర్ నాయ‌కుల‌కు భూమా కుటుంబం దూర‌మైంది. త‌మ‌దే ఆధిప‌త్యం అనే రేంజ్‌లో చెల‌రేగిపో యింది. ఏవీ సుబ్బారెడ్డితోనూ వివాదం, శ్రీశైలం ఎమ్మెల్యేతోనూ ర‌గ‌డ‌ల‌తో కాలం గ‌డిపేశారు. సొంత పార్టీలోనే వేరు కుంప‌ట్లు పెట్టుకున్నారు. ఫ‌లితంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఘోరంగా ఓడిపోయారు.త‌మకంటూ ప్ర‌త్యేక కోట‌రీని ఏర్పాటు చేసుకున్న భూమా వ‌ర్గానికి ఈ ద‌ఫాటికెట్ల విష‌యంలోనూ చంద్ర‌బాబు వెనుక‌డుగు వేశారు. నంద్యాల‌ను వేరేవారికి ఇవ్వాల‌ని భావించారు. అయితే, భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి అవ‌స‌ర‌మైతే.. తాను రెబ‌ల్‌గా అయినా మారి పోటీ చేస్తాన‌ని చెప్ప‌డం, మ‌రోప‌క్క అఖిల ప్రియ కూడా ప‌ట్టుబ‌ట్ట‌డంతో చంద్ర‌బాబు టికెల్ ఇచ్చారు. కానీ, జ‌గ‌న్ సునామీ ముందు వీరంతా ఓట‌మి పాల‌య్యారు. ఇప్పుడు అటు సీనియ‌ర్ల‌ను దూరం చేసుకుని, త‌మ పిల్ల వ్యూహాల‌తో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం చేసుకోలేక వీరు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.ఫ్యామిలీ నుంచి భూమా త‌న‌యులు రంగంలో ఉంటార‌ని అఖిల చెప్ప‌క‌నే చెప్పింది. మ‌రికొంద‌రు భూమా అనుచ‌రులు బీజేపీలోకి వెళుతున్నారు. కొంద‌రు వైసీపీలోకి వెళ్లిపోయారు. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి మామ కాట‌సాని రామిరెడ్డి బ‌న‌గాన‌ప‌ల్లె వైసీపీ ఎమ్మెల్యేగా ఉండ‌డంతో బ్ర‌హ్మానంద‌రెడ్డి సైతం ఆ దిశ‌గానే వెళ‌తార‌ని అంటున్నారు. మ‌రి వైసీపీలోకి వెళ్లినా ఆయ‌న‌కు అక్క‌డ ఎంత వ‌ర‌కు ప్ర‌యార్టీ ఉంటుంది ? బ్రహ్మానంద‌రెడ్డి ఏం చేస్తార‌న్న‌ది చూడాలి. ఏదేమైనా ఆయ‌న భ‌విష్య‌త్తే ప్ర‌శ్నార్థ‌కంగా మారిందనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment