Breaking News

27/09/2019

అప్పుల ఊబిలో తెలంగాణ....

ఐదేళ్లలో మరో 2 లక్షల కోట్లా..?
హైద్రాబాద్, సెప్టెంబర్ 27 (way2newstv.in)
రాష్ట్ర విభజన జరిగినప్పుడు... ఏపీ కష్టాల్లో ఉంటే... హైదరాబాద్ కారణంగా తెలంగాణ ప్రభుత్వం మిగులు ఆదాయంతో ఉంది. అలాంటిది ఆరేళ్లు గడిచేటప్పటికి... తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటికే రూ.3 లక్షల కోట్ల అప్పు ఉండగా... మున్ముందు అప్పులు మరింత పెరిగేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. 2024 నాటికి ఏకంగా రూ.5లక్షల కోట్లకు అప్పులు పెరిగేలా చేస్తారని ఫైరవుతోంది. ఐతే... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్పులు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ అప్పులు చేస్తున్నాయనీ, తాము అప్పు చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రశ్నిస్తోంది. 
అప్పుల ఊబిలో తెలంగాణ....

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసమే తాము అప్పులు చేస్తున్నామని సమర్థించుకుంటోంది.ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్నీ తప్పుడు లెక్కలే ఉన్నాయంటోంది కాంగ్రెస్. ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లెక్కలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో చేసిన అప్పులు రూ.60 వేల కోట్లైతే... ఆ రేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.2లక్షల 3వేల కోట్లుగా ఉన్నాయన్నారు. కార్పొరేషన్లు తీసుకున్న అప్పులకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు రూ.77,314 కోట్లతో కలిపి.. మొత్తం అప్పులు రూ.3లక్షల 3 వేల కోట్లకు చేరాయన్నది భట్టి విక్రమార్క చెబుతున్న లెక్క.ప్రతిపక్షాలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నది ప్రభుత్వ వాదన. 2014 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.75,577 కోట్ల అప్పులు చేసిందన్న టీఆర్ఎస్ మంత్రి హరీశ్‌రావు.... తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం రూ. 1,57,357 కోట్ల అప్పులు చేసిందన్నారు. వాటిలో రూ.29,198 కోట్లు చెల్లించామన్న ఆయన... ప్రస్తుతం 1,28,153 కోట్లు రుణం ఉందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం రూల్స్ ప్రకారం రాష్ట్ర జీడీపీలో 25 శాతానికి మించి అప్పులు ఉండరాదన్న ఆయన... దాని ప్రకారం తెలంగాణ రాష్ట్ర అప్పులు 20.04 శాతమేనని తెలిపారు.

No comments:

Post a Comment