Breaking News

27/09/2019

డోలాయమానంలో డీఎస్

నిజామాబాద్, సెప్టెంబర్ 27 (way2newstv.in)
తెల్లని చొక్కా, ప్యాంటు ….. భుజాన కండువా….. భారీ శరీరం…. ఎంత మంది ఆయన చుట్టూ ఉన్నా ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ అడుగులు వేస్తారు. పార్టీకి పెద్దదిక్కుగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అగ్రపధాన నిలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజన కోసం తరచూ ఢిల్లీవెళ్లి కేంద్రనాయకులను, పార్టీ అధినేత సోనియాను కలిసేవారు. అంతటి  నాయకుడు ఇవ్వాళ కనుమరుగయ్యాడా……? ఇంతకీ ఆయన ఎవరు….? ఏ పార్టీలో ఉన్నారు అనేది అంతుచిక్కని ప్రశ్న. ఆయనే డి.శ్రీనివాస్.ధర్మపురి శ్రీనివాస్ శ్రీనివాస్ ఈ పేరు తెలియని వారు ఉండరేమో. డి.శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ ఛీఫ్ గా పనిచేసిన ధర్మపురి రాష్ట్ర విభజన తర్వాత స్థబ్దుగా అయిపోయారు. ఆయన 27 సెప్టెంబర్ 1948 లో జన్మించారు. 
డోలాయమానంలో డీఎస్

71 సంవత్సరాలున్న శ్రీనివాస్ నివాసం వేల్పూరు, నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున రాజ్యసభ ఎం.పిగా కొనసాగుతున్నారు. 1989లో కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ పట్టణ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటిచేసి గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందారు. 1998లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా నియమితు లయ్యారు. 1999లో బీజేపీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ ను ఓడించి రెండవసారి శాసనసభ కు గెలుపొందారు. అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా డి.శ్రీనివాస్ పనిచేశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండోసారి నియమితులయ్యారు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్ పవార్ ను ఓడించి మూడోసారి శాసనసభకు ఎన్నికై దివంగత వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2009 ఎన్నికలలో నిజామాబాదు నుంచే పోటీచేసి బీజేపీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పొందారు. తెలంగాణా నేపథ్యంలో బీజేపీ పార్టీ తరఫున విజయం సాధించిన లక్ష్మీనారాయణ రాజీనామా చేయగా 2010లో జరిగిన ఉప ఎన్నికలలో డి.శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయాడు. 2014లో నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం నుంచి పోటిచేసి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయాడు. 2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో జరిగిన ఘటనలన్నింటిని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు చరవేసేవారు డి.శ్రీనివాస్. తెలంగాణ ఇవ్వకపోతే ఇక్కడ కాంగ్రెస్ ఉండదనే సంకేతాలూ ఇచ్చారు. తెలంగాణ ప్రకటిస్తే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెంఢా ఎగురుతుందని నచ్చచెప్పారు. అన్ని నివేదకల తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు సై అన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ చితికిలపడింది.కాంగ్రెస్ లో అత్యత్తుమ స్థానంలో ఉన్న డి.శ్రీనివాస్ పరిస్థితి తెలంగాణ ఉద్యమం తర్వాత నీరుగారిపోయింది. అంతా కారు హవా సాగుతుండడంతో చేసేదేమి లేక, చేయి గుర్తుకు చేయిచ్చి గులాబి గూటికి చేరారు. 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. టి.ఆర్.ఎస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ కూతురు కవితకు మద్దతు ఇవ్వకుండా కొడుకు అర్వింద్ కు సహాకారం ఇచ్చి బీజేపీ నుంచి గెలిపించుకున్నారనే అపవాదును డి.శ్రీనివాస్ మూటగట్టుకున్నారు. దీంతో ఇటు కేసీఆర్ గాని, పార్టీ శ్రేణులు గాని ధర్మపురిని దూరం పెట్టారు. ఆయన కూడా ఏ సమావేశాలకు హాజరుకావడం లేదు.డి.శ్రీనివాస్ ను టి.ఆర్.ఎస్ పార్టీ దూరం పెట్టడంతో కొంత నిరాశగా ఉన్నారు. దీంతో బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కొడుకు ఎలాగూ నిజమాబాద్ ఎంపీ కాబట్టి ఆయన కూడా అదే పార్టీలో ఉంటే అనుచరులకు, కార్యకర్తలకు కూడా బాగుంటుందనే అభిప్రాయం వెల్లడవుతోంది. బీజేపీలో చేరాలని ఆహ్వానాలు కూడా వస్తున్నాయని ఆయన చెబుతుండడం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. గతంలో అమిత్ షా ను కలవడం కూడా చర్చనీయాంశమైంది. మరో వైపు బీజేపీలోకెళ్తే ఏంటి అనే సందిగ్ధంలోనూ ఉన్నారు. 71 ఏళ్ల వయస్సులో బీజేపీలో ఏ పదవీ ఉండదు. దీంతో ఆ పార్టీలోకి వెళ్లి ఏం చేస్తారనే విషయాలు చర్చకు వస్తున్నాయి. దీంతో మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళ్లాలనే నిర్ణయాన్ని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎంతో గుర్తింపునిచ్చిన కాంగ్రెస్‌ పార్టీని వదిలి పెట్టడమే ఆశ్చర్యకరమైన చర్య అని, ప్రత్యేక పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింద’ని డి.శ్రీనివాస్ వెల్లడించం బట్టి చూస్తే ఆయన డోలాయమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఏ పార్టీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటారేమే వేచి చూద్దాం.

No comments:

Post a Comment