ముంబై, సెప్టెంబర్ 28 (way2newstv.in)
శరద్ పవార్ వ్యవహారం బూమరాంగ్ అవుతుందని పాలకపక్షం పసిగట్టిందా? అందుకే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా వెనక్కు తగ్గిందా? అంటే అవుననే అనిపిస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. శరద్ పవార్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. మహారాష్ట్ర కో -ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన కుంభకోణంలో శరద్ పవార్ కు ఈ నోటీసులు అందించింది. ఆయన మనీల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు చేసింది. దీంతో మహారాష్ట్రలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.శరద్ పవార్ మహరాష్ట్రలో బలమైన నేత. ఆయనకు పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో గట్టి పట్టుంది.
శరద్ పవార్ విషయంలో బ్యాక్ స్టెప్
కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఆ పట్టును కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఆయనపై పాత కేసును తిరగదోడటం ఆయనకే ప్లస్ గా మారనుంది. మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకులో 25 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. 2007 నుంచి 2017 మధ్య ఈ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. అప్పట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్ పవర్ ఉన్నారని, ఆ సమయంలోనే ఈ కుంభకోణం జరిగిందని, ఆయన మేనల్లుడు అజిత్ పవార్ పైన కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. మరో 74 మంది సహకార శాఖ అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి.అయితే శరద్ పవార్ వయసు రీత్యా, ఆయనకున్న క్రెడిబులిటీ వల్ల ఆయనను ఈడీ విచారణకు పిలిపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావించింది. అందుకే ఉదయం నుంచే పోలీసు భద్రతను శరద్ పవార్ ఇంటి వద్ద ఏర్పాటు చేసింది. పశ్చిమ మహారాష్ట్ర మొత్తం 144వ సెక్షన్ విధించింది. చివరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులే శరద్ పవార్ తమ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే శరద్ పవార్ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. తనకు ఈ విషయం ముందుగానే తెలుసునని, తనపై కుట్ర జరుగుతుందని, తాను జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 21వ తేదీన జరగనున్నాయి. ఈ సమయంలో శరద్ పవార్ విచారణకు హాజరయితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భావించారు. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో పవార్ పై సానుభూతి పెరిగి తమకు నష్టం జరుగుతుందని భావించింది. మరోవైపు బీజేపీ మిత్రపక్షమైన శివసేన సయితం శరద్ పవార్ ను వెనకేసుకు రావడం విశేషం. ఆ కుంభకోణంలో శరద్ పవార్ పాత్ర లేదంటూ శివసేన క్లీన్ చిట్ ఇచ్చింది. పవార్ లాంటి నేతల పేర్లను ఈ కేసుల్లోకి తీసుకురావడం దురదృష్టకరమని ఆ పార్టీనేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఆ కుంభకోణం జరిగినప్పుడు పవార్ అధికారంలో కూడా లేరని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. మొత్తం మీద శరద్ పవార్ వ్యవహారం అధికార పార్టీ బీజేపీకి తలకు చుట్టుకునేలా మారడంతో ప్రస్తుతానికి వెనక్కు తగ్గినట్లే కన్పిస్తుంది.
No comments:
Post a Comment