Breaking News

05/09/2019

ఏపీలో మారుతున్న పోలిటికల్ అట్మాస్పియర్

విజయవాడ, సెప్టెంబర్ 5, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల హద్దులు చెరిగిపోతున్నాయి. ప్రస్తుతం శరణార్ధి శిబిరాల స్థాయికి దిగజారాయి. ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అని తక్షణం తేల్చడం కష్టమే. కానీ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఎంతగా కలుషితమైపోయిందనేందుకు ఇదొక ఉదాహరణ. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం ఇంకా ఎన్నికల వాతావరణం నుంచి బయటికి రాలేదు. ఉద్రిక్తతలను చల్లారనివ్వడం లేదు. రావణకాష్ఠం నుంచే వేడి కాచుకోవాలనే ధోరణిని వీడటం లేదు. రాష్ట్రానికి ప్రస్తుతం పెను సమస్య ఇదే. అధికార వైసీపీ ,విపక్షాల రగడ నానాటికీ శ్రుతిమించి రోడ్డున పడుతోంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇంతకు మించి పార్టీల మధ్య విద్వేషాలు నెలకొని ఉంటాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ వంటి పరిస్థితి అక్కడ ఎప్పుడూ తలెత్తలేదనే చెప్పాలి. పరిపాలనకు, పార్టీలకు, శాంతి భద్రతలకు, మధ్య సున్నితమైన రేఖ ఉంటుంది. అది దాటకుండా వ్యవహరిస్తే యంత్రాంగం స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించగలుగుతుంది. 
ఏపీలో మారుతున్న పోలిటికల్ అట్మాస్పియర్


ఆ స్వేచ్ఛ దీర్ఘకాలంలో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ విషయంలో ప్రతిపక్షాలకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. పరిపాలనలో తాము భాగస్వాములం కాదు కాబట్టి ప్రతి విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోణంలో చూసేందుకు ప్రయత్నిస్తాయి. అందుకే అధికారంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉంటూ తమ పార్టీ నేతలకు, శ్రేణులకు ముకుతాడు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతిమంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్ట, ప్రగతి, ప్రయోజనాలు అధికారపార్టీపైనే ఆధారపడి ఉంటాయి. తెలుగుదేశం, వైసీపీల్లోని నియోజకవర్గ స్థాయి నాయకులు స్థానికంగా తీవ్ర విద్వేష భావాలు కనబరుస్తున్నారు. నిజానికి ఆరకమైన భావన నెలకొనడానికి కారణాలేమిటనే విషయం లోతుల్లోకి వెళితే ఆసక్తిదాయకమైన అంశాలే వెలికి వస్తాయి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ నాయకశ్రేణులు గుమికూడటం సహజం. ప్రస్తుతం నాయకులుగా చెలామణి అవుతున్న చాలామంది ఈరెండు పార్టీల్లో అటు ఇటు జంప్ చేసినవారే. అందువల్ల వ్యక్తిగతంగా ఆయా పార్టీల పట్ల ప్రత్యేకంగా ద్వేషం ఉండేందుకు అవకాశం లేదు. కానీ నాయకత్వంలో పైస్థాయిలో ఉండే వైరానికి దర్పణం పట్టేలా దిగువస్థాయిలో నాయకత్వం ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్న సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. తాము ప్రత్యర్థి పార్టీ అధినేతను ఎంతగా తిడితే అంత తొందరగానూ తమ అధిష్ఠానం వద్ద గుర్తింపు వస్తుందనే అంచనాతో దిగువస్థాయి నేతలు రెచ్చిపోతూ ఉంటారు. దానిని కంట్రోల్ చేయాల్సిన అధిష్టానం చూస్తూ ఉండటమే ప్రమాదకరం. రెండు పార్టీలు రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి, దాడులకు పాల్పడే వాతావరణం నెలకొంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపే పోలీసుల మొగ్గు ఉంటుంది. ప్రతిపక్షం బాధితగా ఉంటుంది. ఈ ఉదాసీన ధోరణితో మరిన్ని సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.నిజానికి ఎన్నికలు ముగియడంతోనే ప్రచారంలోని ఆవేశకావేశాలకు తెరపడాలి. అందుకు సంబంధించి అగ్రనాయకత్వం స్పష్టమైన సంకేతాలు, సూచనలు ఇవ్వాలి. ఎన్నికల ఘట్టంలో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు తాడోపేడో తేల్చుకోవాలనుకుంటుంటారు. ఎన్నికల కమిషన్ నియంత్రణలో వ్యవస్థ ఉండటం వల్ల కొంత కంట్రోల్ లో ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్యాడర్ కు కొంత స్వేచ్ఛ లభిస్తుంది. ప్రత్యర్థిపై కక్షసాధింపు దాడులకు పాల్పడే అవకాశం ఏర్పడుతుంది. సున్నితమైన, అతిసున్నితమైన పోలింగు బూత్ లు ఉన్న నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాలపై పోలీసులు ప్రత్యేక ద్రుష్టి సారించి కొంతకాలం పాటు నిఘా కొనసాగించాలి. కానీ ఇప్పుడు అటువంటి నిఘా లోపించినట్లు కనిపిస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ రాజకీయ శరణార్ధి శిబిరాన్ని ఏర్పాటు చేసింది. తమ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బాధితులకు పునరావాసం కల్పిస్తామంటూ క్యాంప్ తెరిచింది. రాష్ట్రంలో ఇదో వినూత్న పోకడ. దీని వెనక కూడా రాజకీయమే ప్రధాన ఎత్తుగడగా చెప్పాలి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, కొన్ని సందర్బాల్లో అధికారపార్టీకి సహకరిస్తున్నారని టీడీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది.అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకూ తమ కార్యకర్తలపై దాడులు సాగుతున్నాయని టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో కొంతమేరకు అతిశయోక్తులు ఉన్నప్పటికీ పూర్తిగా సత్యదూరం కాదని పరిశీలకులు చెబుతున్నారు. ఈవిషయాన్ని తెలుగుదేశం రాజకీయ ప్రచారాంశంగా మార్చి ప్రజల దృష్టిలో పెట్టాలని భావిస్తోంది. దానికి ప్రతిరూపమే పొలిటికల్ రెఫ్యూజీ క్యాంప్స్. సొంత ఊరిలోనే టీడీపీ కార్యకర్తలకు భద్రత లేదనే విషయాన్ని హైలైట్ చేయడం ద్వారా శాంతిభద్రతల పరిస్థితిని ఫోకస్ చేయాలనుకుంటోంది ప్రతిపక్షం. ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే అంశమే. చెదురుమదురు సంఘటలన్నిటినీ కలిపి పొలిటికల్ పోలరైజేషన్ పాయింట్ గా మలచడంలోనే తెలుగుదేశం వ్యూహం అర్థమవుతోంది. ఈ బాధిత శిబిరాన్ని నిరంతరం వార్తల్లో ఉంచడం ద్వారా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను ఎక్స్ పోజ్ చేయాలనేది ఎత్తుగడ. ఇది అధికారపార్టీ వైసీపీకి కొంత ఇబ్బందికరం. గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు విధి నిర్వహణలోని అధికారులపై దాడులు చేసిన సందర్బాల్లో టీడీపీ అధినేత మెతకవైఖరితో వారిని వెనకేసుకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. పోలీసు శాఖ తమ కర్తవ్యాన్ని నిష్పాక్షికంగా నిర్వహించకుండా నియంత్రించిన ఘట్టాలు ఉన్నాయి. ఫలితంగానే ఇప్పుడు అధికారం మారడంతోనే పోలీసులు బాస్ ఈజ్ రైట్ అన్నట్టుగా మారిపోయారనే విమర్శలూ ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీని అనుసరించి విధివిధానాలు, విధేయతలు మారిపోతే వ్యవస్థలు విశ్వసనీయత కోల్పోతాయి. పాలన గాడి తప్పుతుంది. ఈ సూత్రం తెలుగుదేశానికైనా, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకైనా సమానంగానే వర్తిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి స్థాయిలో వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే రోడ్డున పడ్డ రాజకీయం మరింత ముదురుపాకాన పడుతుంది.

No comments:

Post a Comment