Breaking News

05/09/2019

విశాఖలో తమ్ముళ్ల తన్నులాట...

విశాఖపట్టణం, సెప్టెంబర్ 5, (way2newstv.in)
మూడున్నర దశాబ్దాల చరిత్ర, క్రమశిక్షణ కలిగిన పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తూ వచ్చిన కుటుంబాలు రాజకీయంగా నిట్టనిలువునా చీలుతున్నాయి. ఇటీవల జరిగిన జమిలి ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత టీడీపీ కంచుకోటకు బీటలు పడుతున్నాయి. టీడీపీ జెండా తప్ప మరో పార్టీ ఎరుగని చరిత్ర ఉన్న కుటుంబాలు కూడా నేడు కండువాలు మార్చేందుకు వెనుకాడట్లేదు. విశాఖ జిల్లా టీడీపీలో డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబాల్లో తాజాగా చోటు చేసుకున్న చీలికలే ఇందుకు ఉదాహరణ. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ (డెయిరీ చైర్మన్ తులసీరావు కుమారుడు) తన సోదరి, యలమంచిలి మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్ పిళ్లా రమాకుమారి సహా పలువురు టీడీపీ నేతలు పార్టీని వీడి, అధికార వైసీపీలో చేరిపోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి తులసీరావు టీడీపీలోనే కొనసాగుతున్నారు.
విశాఖలో తమ్ముళ్ల తన్నులాట...

తాజా ఎన్నికల్లో కుమారుని విజయం కోసం తులసీరావు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగించారు. అయినప్పటికీ భారీ తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎన్నికలు పూర్తయి మూడు నెలలు గడుస్తుండగా ఆనంద్ టీడీపీని వీడాలని నిర్ణయించుకోడవం, వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరడం జరిగిపోయింది. తన కుమారుడు వైసీపీలో చేరినప్పటికీ తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని తులసీరావు బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చింది.ఇక పార్టీ ఆవిర్భావం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా, నాలుగు సార్లు మంత్రిగా పనిచేసిన చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబం టీడీపీకి చిరునామాగా నిలిచింది. పార్టీ అధికారం కోల్పోయిన సందర్భాల్లో కూడా అయ్యన్న కుటుంబం టీడీపీకి అండగా ఉంటూ వచ్చింది. అయ్యన్న కుటుంబం నుంచి రాజకీయంగా ఆయన పెద్ద సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు (జమీలు) చేదోడువాదోడుగా ఉండేవారు. గత ఎన్నికలకు ముందు నుంచి అన్నదమ్ములిద్దరి మధ్య విభేదాలు పొడసూపినప్పటికీ, అయ్యన్న ఓటమితో వీరి మధ్య ఎడం మరింత పెరిగింది. తాజాగా అయ్యన్న జన్మదినోత్సవం సందర్భంగా నర్సీపట్నంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. లోకేష్ నర్సీపట్నంలో అడుగుపెట్టే సమయంలోనే అయ్యన్న సోదరుడు జమీలు, తన భార్యతో పాటు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. జమీలు ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో చేరుతున్నదీ ప్రకటించనప్పటికీ వైసీపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. దీంతో వైసీపీ కారణంగా గ్రామీణ జిల్లాలో రెండు బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాల్లో చీలిక అనివార్యం కావడం విశేషం.ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో ఏజెన్సీ, గ్రామీణ జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ విశాఖ నగరంలో మాత్రం పరువు నిలుపుకుంది. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించడం ద్వారా పట్టణాల్లో తమ పట్టు తగ్గలేదన్న ధీమాతో ఉంది. అయితే టీడీపీ ధీమా ఎంతో కాలం నిలిచేట్టు కన్పించట్లేదు. ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరు టీడీపీ అధిష్ఠానాన్ని అయోమయానికి గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొనట్లేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన అనుచరులు మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.ఇక గత ఎన్నికల్లో టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్ష పగ్గాలను సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహ్మాన్‌కు అప్పగించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం కొనసాగుతోంది. రెహ్మాన్ అధ్యక్షునిగా ఉన్నంత కాలం తాను పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టనంటూ వాసుపల్లి శపథం చేసినట్టు ప్రచారం కూడా జరిగింది. దీనికి అనుగుణంగానే ఇప్పటికీ వాసుపల్లి పార్టీ కార్యాలయానికి రాలేదు.విశాఖ వచ్చిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు, నగర పార్టీ అధ్యక్షుడు రెహ్మాన్ ఎమ్మెల్యే వాసుపల్లి తీరుపై ఫిర్యాదు చేయడంతో పాటు నేరుగా వాసుపల్లికే లేఖ రాశారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న ఈ విభేదాలు భవిష్యత్‌లో ఎన్ని చీలికలకు దారితీస్తాయన్నది వేచి చూడాలి

No comments:

Post a Comment