Breaking News

20/09/2019

దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

ముంబాయి  సెప్టెంబర్ 20, (way2newstv.in)
స్టాక్‌మార్కెట్లు ఇవాళ ట్రేడింగ్‌లో దుమ్మురేపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌ట‌న చేయ‌గానే.. స్టాక్ మార్కెట్లు ద‌డ‌ద‌డ‌లాడించాయి. కార్పొరేట్ సంస్థ‌ల‌కు విధించే ప‌న్ను శాతాన్ని త‌గ్గిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించిన వెంట‌నే బుల్ ర‌న్ కొన‌సాగింది. సెన్సెక్స్ ఇవాళ ఒక్క రోజే సుమారు 2000 పాయింట్ల పెరుగుద‌ల చూపించింది. దీంతో సెన్సెక్స్ సుమారు 38 వేల 378 పాయింట్ల‌ను ట‌చ్ చేసింది. దాదాపు ద‌శాబ్ధ కాలం తర్వాత స్టాక్ మార్కెట్లు ఒకేసారి భారీ జంప్ చేసిన‌ట్లు నిపుణులు చెబుతున్నారు. 
దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

మ‌రో వైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా య‌మ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. నిఫ్టీ కూడా ఇవాళ ఒక్క రోజే దాదాపు 677.1 పాయింట్లు జంప్ చేసింది. దీంతో నిఫ్టీ సుమారు 11 వేల 381 పాయింట్ల వ‌ర‌కు ట్రేడ్ అయ్యింది. కార్పొరేట్ సంస్థ‌ల‌పై ప‌న్ను త‌గ్గించ‌డాన్ని మార్కెట్లు పాజిటివ్‌గా భావిస్తున్నాయి.50 కంపెనీల ఇండెక్స్‌లో హీరో మోటోకాప్‌, మారుతీ సుజికీ, ఐచ‌ర్ మోట‌ర్స్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, భార‌త్ పెట్రోలియం, ఎస్‌బీఐ లాంటి కంపెనీలు ట్రేడింగ్‌లో దూకుడుగా సాగాయి. కంపెనీల‌కు కొత్త ప‌న్ను విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమ‌ల‌వుతుంది. ఇక కొత్త కంపెనీల‌కు అక్టోబ‌ర్ ఒక‌టి నుంచి మొద‌ల‌వుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోట‌క్ బ్యాంక్‌లు సెన్సెక్స్ దూకుడులో కీల‌క పాత్ర పోషించాయి.

1 comment: