న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20, (way2newstv.in)
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఢిల్లీలో ఇంటి కష్టాలొచ్చాయి. అమిత్ షాకి జూనియర్ మంత్రి అయిన కిషన్ రెడ్డి అధికార నివాసం లేకపోవడంతో ఆంధ్రా భవన్ నుంచే నాలుగు నెలలుగా తన పనులు చక్కబెడుతున్నారు. కిషన్ రెడ్డికి కేంద్రం రెండు బంగ్లాలు కేటాయించింది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలవుతున్నా మాజీ ఎంపీలు వాటిని ఖాళీ చేయకపోవడంతో.. ఆయనకు ఆంధ్రా భవనే దిక్కయ్యింది.16వ లోక్ సభ మే 25న రద్దయ్యింది. దీంతో నిబంధనల ప్రకారం మాజీ ఎంపీలు జూన్ 25 నాటికి తమ బంగ్లాలను ఖాళీ చేయాలి. కానీ వారు ఖాళీ చేయకపోవడంతో కొత్త ఎన్నికైన ఎంపీలు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
కిషన్ రెడ్డికి హోమ్ లెస్సేనా
హోం శాఖ సహాయ మంత్రి అయిన కిషన్ రెడ్డికి తుగ్లక్ రోడ్డులోని ఓ బంగ్లాను కేటాయించారు. అందులో కేంద్ర మాజీ మంత్రి జయంత్ సిన్హా ఉంటున్నారు. దీంతో మరో బంగ్లా కేటాయించాలని పట్టణాభివృద్ధి శాఖను మంత్రి కోరారు. కిషన్ రెడ్డి అభ్యర్థన మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఎదురుగా అశోక్ రోడ్డులోని బంగ్లాను కేటాయించారు. ఆ ఇంట్లో రాధా మోహన్ సింగ్ ఉంటున్నారు. బంగ్లా ఖాళీ చేయడానికి కాస్త టైం కావాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది.దీంతో చేసేదేం లేక కిషన్ రెడ్డి ఆంధ్రా భవన్‌లో ఉంటున్నారు. మీరుంటున్న బంగ్లాలను వెంటనే ఖాళీ చేసి వెళ్లండని ప్రభుత్వం గత నెలలో మాజీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా ఖాళీ చేయాలని సూచించింది. మూడు రోజులు గడిచాక.. మాజీలు ఉంటున్న బంగ్లాలకు నీరు, కరెంట్ సరఫరా ఆపేయాలని అధికారులను ఆదేశించింది. మోదీ కూడా ఈ సమస్యపై ట్విట్లు చేశారు. ఎంపీలను కలవడానికి చాలా మంది వస్తారు. కాబట్టి దయ చేసి సమస్యను అర్థం చేసుకొని ఖాళీ చేయాలని ఆయన కోరారు. కానీ ఫలితం లేకపోయింది.
No comments:
Post a Comment