Breaking News

28/09/2019

ఏపీలో పతాక స్థాయికి కుల సమరం

విజయవాడ, సెప్టెంబర్ 28 (way2newstv.in)
ఏపీలో రెండు పార్టీలు, ఇద్దరి నాయకుల మధ్యనే సంకుల సమరం సాగుతోంది. రెండు ప్రాంతాలు, రెండు సామాజికవర్గాలు, రెండు కుటుంబాలు ఇలా దశాబ్దాలకు పైగా సాగుతున్న ఈ రాజకీయ పోరాటం అంతిమ విజేతలు ఇంకా తేలలేదు. నాలుగు దశాబ్దాల క్రితం మొదలైన పోరు ఇపుడు క్లైమాక్స్ కి చేరిందనుకోవాలి. వైఎస్సార్, చంద్రబాబుల మధ్య మొదలైన రాజకీయ యుధ్ధం వారసుల వరకూ పాకింది. వైఎస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోతే అయన కుమారుడు జగన్ ప్రాంతీయ పార్టీ పెట్టి బాబుని ఢీ కొట్టారు. తన జీవిత కోరిక అయిన ముఖ్యమంత్రి పీఠం ఎక్కి మరీ బాబుని దించేశారు. 
ఏపీలో పతాక స్థాయికి కుల సమరం

ఇక చంద్రబాబు తండ్రీ కొడుకుల చేతుల్లో మూడు మార్లు ఓటమిపాలు అయి ఇపుడు మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇక చంద్రబాబు రాజకీయం తాజా ఎన్నికలతో పరిసమాప్తమని జగన్ భావిస్తున్నారు. యువకుడిగా తాను ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినందున చంద్రబాబు అవుట్ డేటేడ్ పాలిటిక్స్ కి కాలం చెల్లిందని జగన్ అంచనా వేసుకుంటున్నారు. టీడీపీలో చంద్రబాబునే కొట్టేసాక ఇక కొత్త నాయకత్వం పుట్టదని, చంద్రబాబు వయసు దృష్ట్యా ఆయన మళ్లీ తిరిగి గట్టిగా పోరాటం చేయలేరని జగన్ ఆలోచనలు ఉన్నాయి. అంతే కాదు, కనుచూపు మేరలో తనకు సరైన రాజకీయ ప్రత్యామ్యాయం కూడా లేకపోవడం కలసి వస్తుందని అనుకుంటున్నారు. అదే తనకు శ్రీరామరక్షగా నిలిచి ముప్పయ్యేళ్ళ సీఎం గా తాను చరిత్ర సృష్టిస్తానని జగన్ గట్టి నమ్మకంతో ఉన్నారు.ఇక చంద్రబాబు ధైర్యం ఏంటంటే జగన్ కి అనుభవ రాహిత్యం, అతి విశ్వాసం, అహంకారం ఉన్నాయని, ఆయన దూకుడుగా ముందుకు సాగి బంగారు లాంటి అవకాశాలను చేజార్చుకుంటారని కూడా లెక్కలు కడుతున్నారు. చివరకు ఆ పరిణామాలు తనకు అనుకూలిస్తాయని, జగన్ తనంతట తానే అధికారం తిరిగి తనకు అప్పగించే రోజు వస్తుందని చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు. ఏపీ వంటి కొత్త రాష్ట్రం పాలించడం తనలాంటివారికే అంత సులువు కాదని, ఆర్ధికంగా కుదేలయిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం జగన్ వల్ల కూడా కాదని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్ర సాయం ఏ మాత్రం లేకపోగా అడ్డంకులు కూడా జగన్ కి ఇబ్బంది కలిగిస్తాయని చంద్రబాబు ఊహిస్తున్నారు. ఇలా రాజకీయంగానూ తనకు కలసివస్తుందని ఆయన నమ్ముతున్నారు. అందుకే క్యాడర్ని నమ్ముకుంటే చాలు పార్టీ బతుకుతుందని చంద్రబాబు తనదైన వ్యూహ రచన చేస్తున్నారు. మరి ఈ ఇద్దరి ధైర్యం, ధీమాలలో ఏది గెలుస్తుంది, నాలుగు దశాబ్దాల రాజకీయ పోరులో అసలైన విజేతగా ఎవరు నిలుస్తారన్నది కాలమే చెప్పాలి.

No comments:

Post a Comment