Breaking News

19/09/2019

అప్పుల కుప్పగా మారిన సివిల్ సప్లయిస్ సంస్థ

నెల్లూరు, సెప్టెంబర్ 19, (way2newstv.in)
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేక్కెందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఎక్కువ వడ్డీకి తెచ్చిన రుణాలను తీర్చేందుకు, ఖరీఫ్ సీజన్‌ల్లో ధాన్యం తదితర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు వీలుగా 15 వేల కోట్ల రూపాయల మేర రుణాలను వివిధ బ్యాంక్‌ల నుంచి సమకూర్చుకోనుంది. ఈ మేరకు బ్యాంక్‌ల నుంచి తీసుకునే రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు నిర్ణయించింది. రాష్ట్ర పౌరసరఫరా సంస్థకు దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యం, కందిపప్పు, పంచదార తదితరాలను పౌరసరఫరా శాఖ కొనుగోలు చేసి, రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తుంది. 
అప్పుల కుప్పగా మారిన  సివిల్ సప్లయిస్ సంస్థ

ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి రేషన్ దుకాణాలకు సరఫరా చేసేందుకు దాదాపు 33 రూపాయల వరకూ కిలోకు ఖర్చు అవుతోంది. అయినప్పటికీ కిలో బియ్యాన్ని రూపాయికి సరఫరా చేస్తోంది. ఇందులో డీలరు కమీషన్ పోగా కిలో బియ్యానికి 30 పైసలు తిరిగి ఈ సంస్థకు వస్తుంది. కేంద్రం రాయితీ ఎత్తివేసినా, పంచదార సరఫరా చేస్తోంది. గత ఆరు నెలలుగా కందిపప్పు కూడా సరఫరా చేస్తోంది. దీంతో భారీగా ముందుగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి నెలా 5 వేల కోట్ల రూపాయల వరకూ రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే సామగ్రి కొనుగోళ్లకు అప్పు చేయాల్సి ఉంటుంది. రాయితీల రూపంలో సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల రూపాయల వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజనులో ధాన్యం కొనుగోళ్లను ఈ సంస్థ చేపట్టాల్సి ఉంది. సబ్సిడీగా దాదాపు 3420 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి దాదాపు రోజూ 300 కోట్ల రూపాయల వరకూ చెల్లింపులు రైతులకు చేయాల్సి ఉంటుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇది కాక రాష్ట్ర విభజన సమయంలో సబ్సిడీ వ్యవహారం ఏపీ, తెలంగాణ మధ్య వివాదాస్పదంగా మారడంతో దాదాపు 1000 కోట్ల రూపాయలు దాదాపు నాలుగు సంవత్సరాలుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఖరీఫ్ కొనుగోళ్లు, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని 15 వేల కోట్ల రూపాయలు వివిధ బ్యాంక్‌ల ద్వారా సమకూర్చుకునేందుకు పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. ఎక్కువ వడ్డీకి తెచ్చిన రుణాలను కూడా క్లియర్ చేయనున్నారు. తాజాగా 7.9 శాతం లేదా అంతకు తక్కువ వడ్డీకి ఈ రుణాన్ని తీసుకోనుంది. గ్యారంటీర్‌గా ఉండేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.

No comments:

Post a Comment