Breaking News

25/09/2019

ఔననే లేక... కాదనలేక...అప్ప

బెంగళూర్, సెప్టెంబర్ 25, (way2newstv.in)
అధికార పార్టీలో అలజడి మొదలయింది. ఊహించినట్లుగానే ఉప ఎన్నికలు వచ్చినప్పటికీ అభ్యర్థుల ఎంపిక పార్టీకి తలనొప్పిగా తయారయింది. అధిష్టానం ఆదేశాల కోసం ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎదురు చూపులు చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. కర్ణాటకలో వచ్చే నెలలో జరగనున్న 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు యడ్యూరప్పను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు న్యాయం చేయాలన్నది యడ్యూరప్ప ఆలోచన.అయితే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఎలా న్యాయం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసమే రాజీనామాలు చేశారు. 
ఔననే లేక... కాదనలేక...అప్ప

వారివల్లనే యడ్యూరప్ప ముఖ్యమంత్రి కాగలిగారు. ఇంత త్యాగం చేసిన వారు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. వారిపై అనర్హత వేటు పడటంతో వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయలేని పరిస్థితి యడ్యూరప్పది.వారి వారసులను ఎంపిక చేద్దామన్నా గెలుపు అంత సులువు కాదు. ఇప్పటికే ఆ యా నియోజకవర్గాల్లో అధికారం కోసమే వీరు పార్టీ మారారన్న ముద్ర పడింది. దీంతో ప్రజలు వారివైపు మొగ్గు చూపే అవకాశం ఉండకపోవచ్చు. వారి వారసులను బరిలోకి దింపినా ఫలితం ఉండదన్నది బీజేపీ అధిష్టానం యోచన. బీజేపీ పాత అభ్యర్థులను బరిలోకి దింపినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత విపక్ష పార్టీకే లబ్ది చేకూర్చే అవకాశం ఉంది. అందుకే యడ్యూరప్పకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.యడ్యూరప్ప అధిష్టానం పైనే అభ్యర్థుల ఎంపికపై ఆధారపడాల్సి ఉంటుంది. తేడా కొడితే యడ్యూరప్ప ప్రభుత్వం కుప్ప కూలే అవకాశముంది. అందుకే యడ్యూరప్ప అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే అధిష్టానం ముందు తన ప్రతిపాదనను ఉంచాలని నిర్ణయించుకున్నారు. అధిష్టానం అభిప్రాయమే ఫైనల్ అయినప్పటికీ యడ్యూరప్ప మాత్రం అభ్యర్థుల ఎంపిక విష‍యంలో కొంత టెన్షన్ పడుతూనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

No comments:

Post a Comment