Breaking News

18/09/2019

మెదక్ లో 27 శాతం లోటు వర్షపాతమే

మెదక్, సెప్టెంబర్ 18, (way2newstv.in)
మరో పదిహేను రోజుల్లో  వర్షకాలం పూర్తి కానుంది. పచ్చగా కళకళలాడాల్సిన పంట పొలాలు... లోటు వర్షంతో ఎండుముఖం పడుతున్నాయి. నిండుగా నీటితో ఉండాల్సిన చెరువులు, కుంటలు బోసిపోయాయి. కలుపు తీత పనులు, ఎరువులు చల్లుతూ క్షణం తీరిక లేకుండా ఉండాల్సిన రైతులు ఆకాశం వైపు దిక్కులు చూస్తున్నారు. వర్షాభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు, భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. లోటు వర్షపాతం వల్ల సాగు చేసిన పంటలు కూడా చేతికి అందే పరిస్థితి లేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. మొదట్లో మురిపించిన వర్షాలు చివరకు పత్తాలేకుండా పోయాయని జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. 
మెదక్ లో 27 శాతం లోటు వర్షపాతమే

జిల్లాలోని 20 మండలాల్లో రామాయంపేట మినహా మిగిలిన 19 మండలాలలో లోటు వర్షపాతం నమోదైంది.ఖరీఫ్ సీజన్‌లో సాగు విస్తీర్ణం భారిగా తగ్గడంతో పాటు పంటల దిగుబడులపై ఈ ప్రభావం పడనుంది. అత్యధికంగా కొల్చారం మండలంలో 52 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా రామాయంపేట మండలంలో 5శాతం అధిక వర్షపాతం నమోదు అయింది. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలలో చుక్కనీరులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. జిల్లాలో ఈ వానాకాలంలో సాధారణ 664.9 మి.మీ.లు కాగా ఇప్పటి వరకు 488.3 మి.మీల వర్షపాతం నమోదైంది. సుమారు 27 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని కొల్చారం, చిలిపిచెడ్, కౌడిపల్లి మండలాలలో అత్యధికంగా 52,50,44శాతం లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రామాయంపేటలో 5శాతం అధికంగా, నిజాంపేటలో 2శాతంలోటు, రేగోడ్, మెదక్ మండలాల్లో 3శాతం లోటు వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 25 నుంచి 52 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైందిజిల్లాలో ఈ ఏడాది భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అడపా దడపా కురిసిన వర్షం మెట్ట పంటలకు మేలు చేకూర్చినా జిల్లాలోని చెరువులు, కుంటలు నిండలేదు. దీంతో జిల్లాలోని చాలా చెరువులు, కుంటల కింద రైతులు పంటలను సాగు చేయలేదు. వానాకాలం సీజన్ పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఇంకా జిల్లాలోని అత్యధిక మండలాలలో లోటు వర్షపాతమే నమోదు కావడంతో జిల్లాలోని చాలా ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలోని నాలుగు మండలాలు సాధారణ వర్షపాతానికి చేరువలో ఉన్నాయి. జిల్లాలో జులై నెలలో వర్షాలు పెద్ద గా నమోదు కాలేదు. ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున వరిపంట సాగు చేశారు. కాని గత పదిరోజులుగా వరణుడు మొఖం చాటేయడంతో పాటు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పాటు భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు చేసిన వరిపంటకు నీరు అందని పరిస్థితి ఏర్పడి రైతులు ఆందోళన చెందుతున్నారు.జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో పంటలు భూగర్భజలాల ఆధారంగానే సాగు చేస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో ఈ ఏడు ఇంకా జిల్లాలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయిలోనే ఉన్నాయి. జిల్లాలోని పలు మండలాలలో 25 నుంచి 29 మీటర్లలోతులో భూగర్భ జలాలు ఉన్నట్లు ఆగస్టు నెలలో భూగర్భ జలవనరుల శాఖ అధికారులు సేకరించిన వివరాల ఆధారంగా తెలుస్తున్నది. అల్లాదుర్గం మండలంలో 25.58 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. టేక్మాల్ మండలంలో 27.82 మీటర్లు, శివ్వంపేట మండలం గూడూరులో 28.10 మీటర్లు , వెల్దుర్తి మండలం ఏదులపల్లిలో 26.78 మీటర్ల లోతుకు పడిపోయాయి. కొల్చారం మండలం రంగంపేటలో అత్యధికంగా 29.10 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వెళ్లాయి. ఇక వర్షాకాలం సీజన్ ముగుస్తున్నప్పటికీ వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, కుంటలు నిండకపోవడం వల్లే భూగర్భ జలాలు ఈ వానాకాలంలో ఇంకా పైకిరాకపోవడంతో బోరుబావులలో నీరురాక వట్టిపోతున్నాయి. దీంతో రైతులు సాగుచేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి.

No comments:

Post a Comment