Breaking News

18/09/2019

గాడి తప్పుతున్న జనరిక్ ఔషధాలు పంపిణీ

వరంగల్, సెప్టెంబర్ 18, (way2newstv.in)
జనరిక్‌ ఔషధాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నిఘా వైఫల్యం కారణంగా గాడి తప్పుతోంది. వైద్యాన్ని సామాన్యునికి అందుబాటులోకి తీసుకురావాలని జరిగిన ఉద్యమాల ఫలితంగా జనరిక్‌ మందులను చవకగా అందించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఔషధాలు తయారీదారుల నుంచి కొనుగోలుదారుల వరకు చేరే లోపు దళారీల చేతికి వెళుతుండటంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఫలితంగా మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించడం ద్వారా తయారీదారు నుంచి నేరుగా కొనుగోలుదారుకు అందించాలనే లక్ష్యం నెరవేరకుండా పోతుంది. 2010లో జెనెరిక్‌ ఔషదాల కోసం ప్రత్యేకంగా జీవన్‌ ధారా పేరుతో మెడికల్‌ షాపులకు ప్రభుత్వం అనుమతించింది. 
 గాడి తప్పుతున్న జనరిక్ ఔషధాలు పంపిణీ

పేద రోగులకు చవకగా ఔషధాలు అందించే కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ తదితర స్వచ్ఛంద సంస్థలతో పాటు సీనియర్‌ సిటీజన్ల అసోసియేషన్లు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో తొలిసారిగా ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో జీవన్‌ ధార మెడికల్‌ షాపులను తెరిచారు. ఆ తరువాత గాంధీ ఆస్పత్రితో పాటు ఇతర ఆసుపత్రుల్లోనూ వీటిని అందుబాటులోకి తెచ్చారు. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా జనరిక్‌ మందుల షాపులను వివిధ ప్రాంతాల్లో నెలకొల్పాయి. ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో ఎక్కువగా జిల్లా కేంద్రాల్లో కొన్ని జీవన్‌ ధార మెడికల్‌ షాపులకు అనుమతించారు. అయితే దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించకపోవడంతో కొనుగోలు శక్తి అతి తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి రాకుండా పోతున్నాయి. దాదాపు 700కు పైగా జనరిక్‌ మందులను గుర్తించి, వాటిని 10 శాతం నుంచి 90 శాతం వరకు తక్కువ ధరకే అందిస్తున్నారు.పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ షాపుల నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి వాటిని గ్రామీణ ప్రాంతాల్లో అధిక ధరలకు అమ్ముకుంటూ కొంత మంది సొమ్ము చేసుకుంటున్నారు. మందుల నాణ్యతతో పాటు నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువగా అమ్మడానికి వీలు లేకుండా నిరోధించాల్సిన అధికారులు నిఘా పెట్టకపోవడంతో దళారీలకు కలిసి వస్తోంది.వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా అడిగిన మొత్తంలో మందులను ఇస్తుండడం, తక్కువ ధరకు ఇస్తున్న ఈ మందులపై ఎం.ఆర్‌.పి ధర అధికంగా ఉండడం కూడా మధ్య దళారీల దందాకు అడ్డులేకుండా పోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న వారు ఈ దందాను యధేచ్ఛగా చేస్తున్నట్టు తెలుస్తోంది. కొంత మంది వైద్యులు కూడా వీరితో చేతులు కలిపి నకిలీ ప్రిస్క్రిప్షన్‌ రాసి ఇస్తున్నట్టు సమాచారం.ఇదిలావుంటే ఔషధాలను ఇస్తున్న ధరనే ఔషధాల స్ట్రిప్‌లపై ముద్రిస్తే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడుతుందని ఆరోగ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి అక్రమ మార్గాల్లో పెద్ద మొత్తం ఔషధాలను తీసుకెళ్లే వారిపై ఔషద నియంత్రణ, తనిఖీ అధికారులు నిఘా పెంచాల్సిన అవసరముందనే అధిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అన్నింటకన్నా ముఖ్యంగా మండల, గ్రామాల స్థాయిలో జనరిక్‌ మందుల షాపులను నెలకొల్పడం ద్వారా మధ్యదళారీల దందాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసే అవకాశముందని పలువురు సూచిస్తున్నారు. జనరిక్‌ ఔషధాలను తక్కువ ధరకే పేద రోగులకు అందివ్వాలని ప్రభుత్వం తయారీదారులకు, కొనుగోలుదారుల మధ్య మధ్యవర్తుల పాత్ర తగ్గించింది. అయితే పట్టణాల్లో దొరికే చవక మందులను గ్రామాల్లో అధిక ధరలకు అమ్ముకుంటున్న మధ్యదళారీలు పుట్టుకొచ్చారు. మధ్యవర్తుల (హౌల్‌ సేలర్స్‌, రిటైలర్స్‌) పాత్ర తగ్గించినా బ్రోకర్ల దందాను నిలువరించలేకపోవడంతో అనుకున్న ఫలితాలు సాధించలేకపోతున్నాయి

No comments:

Post a Comment