Breaking News

01/08/2019

బలపడే దిశగా జనసేనాని అడుగులు

విజయవాడ, ఆగస్టు 1, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసిపికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే రేసులో రెండు పార్టీలు ఆరాట పడుతున్నాయి. ఇందులో ముందు వరుసలో వుంది బిజెపి. ఇక పవన్ జనసేన తరువాత ప్లేస్ లో వుంది. టిడిపి ని నామరూపాలు లేకుండా చేయగలిగితేనే ఇది సాధ్యం అవుతుంది. మరోపక్క అధికారపార్టీపై కూడా దుమ్మెత్తి పోస్తూ ఉండాలి. ఇలా ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతూ బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంటూ ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ దూసుకుపోవాలి. ఇప్పుడు ఆ పనిలో వేగంగా వెళుతున్నది ఒక్క బిజెపినే. ఇక టిడిపి తన అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు తమదైన శైలిలో వెళుతున్నా అతి తక్కువ సంఖ్యలో ఎమ్యెల్యేల సంఖ్య ఉండటంతో బాటు ముఖ్యమైన నేతలు కమలంలోకి వెళుతుండటంతో డీలా పడుతుంది తెలుగుదేశం.
బలపడే దిశగా జనసేనాని అడుగులు

కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది. టిడిపి విపక్ష పాత్రలో వుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిని ఢీకొట్టడం అంత ఈజీకాదు జనసేనకు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా ప్రజల్లోకి నేరుగా ఇంకా పవన్ పార్టీ మిళితం కాలేకపోతుంది. ప్రజాక్షేత్రంలో నిత్యం వుండాలిసిన జనసేన జోరు పెంచలేదు. మరోపక్క పార్టీ ఘోరఓటమి తరువాత ఒక్కొరొక్కరుగా ముఖ్య నేతలు జనసేనకు గుడ్ బై కొట్టేస్తున్నారు. దాంతో జనసేనాని సీరియస్ గా దృష్టి సారించారు.పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు తో బాటు పలు కమిటీలను తన కోటరీ లోని వారికి పదవులు కట్టబెట్టారు. అయితే ఇవేమి జనసేన కు రాజకీయంగా సరిపోవు. బిజెపి అయితే ఏ మాత్రం అటు అధికారపార్టీని ఇటు టిడిపి ని ఎండగడుతూ వ్యూహాత్మకంగా నడుస్తుంది. ఈ స్థాయిలో జనసేన గట్టిగా రెండు పార్టీలపై విమర్శల దాడి చేయలేకపోతోంది. మరోపక్క ఎవరు వచ్చినా పార్టీలోకి వారిని చేర్చుకుని బలం పెంచుకునేందుకు కదులుతుంది కాషాయ పార్టీ. కానీ జనసేన ఉన్న నేతలను కాపాడుకోలేక పోతుంది. బలమైన క్యాడర్ వున్నవారిని ఆకర్షించే వ్యూహం లేక చతికిల పడుతుంది. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీతో భేటీ అయిన పవన్ దిశా దశా నిర్ధేశించారు. అయితే పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ఇంకా జనసేన పూర్తిగా సఫలం కాలేకపోతుంది
బీజేపీతో దోస్తీ కడతారా
పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పని చెయ్యటానికి సిద్ధమవుతున్నట్టు ఆయన మాటలు చూస్తూ అర్ధమవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హటావో అనే పిలుపు ఇచ్చారు. బీజేపీ పై ఎప్పుడూ సానుకూలంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు విమర్శలు చేసినా, మోడీ, అమిత్ షా పేరు కూడా ఎత్తకుండా, పవన్ రాజకీయం నడిపారు. చాలా సందర్భాల్లో తనకు మోడీ ఎంతో ఇష్టమైన నాయకుడు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతే కాదు పవన్ పనిగట్టుకుని, నేను ఎవరితో కలసినా, లౌకికవాదం వీడను అంటే, దాని అర్ధం ఆయన బీజేపీతో కలిసి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నారని అర్ధమవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మొనోహర్, చిరంజీవిని కలిశారు.చిరంజీవి, బీజేపీలో చేరతారని, ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో, పవన్ కళ్యాణ్, చిరంజీవిని కలవటం, ఆ తరువాత, నేను జాతీయ పార్టీతో కలిసి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పటం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ప్రయాణం చెయ్యటం, ఖాయంగా కనిపిస్తుంది. అయితే, పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ప్రధాన ఎజెండాగా, ప్రత్యెక హోదా పెట్టుకున్నారు. తన వల్లే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని చెప్పుకునే వారు. మరి ఇప్పుడు బీజేపీ, అసలు హోదా లేదు అని తేల్చి చెప్పింది. అలాంటిది, పవన్ ఆ పార్టీలోకి ఎలా వెళ్తారు అనే వాదన కూడా వినిపిస్తుంది. మరో పక్క, కొన్ని రోజుల క్రిందట పవన్ మాట్లాడుతూ, ప్రత్యెక హోదా పై జనాల్లో అసలు ఏమి లేదని, తాను ఒక్కడినే పోరాటం చేస్తే ఏమి లాభం అని చెప్పిన విషయాలు ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అంటే పవన్ , బీజేపీతో కలిసి వెళ్ళే ఆలోచన ఉంది కాబట్టే, మొన్నటి దాక, తానె ప్రత్యేక హోదా ప్రతినిధిని అని చెప్పుకున్న పవన్, ఇప్పుడు మాత్రం, హోదా సెంటిమెంట్ ప్రజల్లో లేదు అని చెప్పేసారు. ఏది ఏమైనా, మన రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు చూడబోతున్నాం.

No comments:

Post a Comment