Breaking News

06/08/2019

చెరకు చేదే..(పశ్చిమగోదావరి)

ఏలూరు, ఆగస్టు 06 (way2newstv.in): 
కష్టాలకు బెదరక, నష్టాలకు అదరక, విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్న చెరకు రైతుకు మద్దతు ధర మాత్రం అందని ద్రాక్షగానే మారింది. కేంద్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరాలకు ప్రకటించిన చెరకు కనీస మద్దతు ధర రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ప్రస్తుతం ఇస్తున్న ధరనే 2019-20 సీజన్‌లోనూ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి వ్యయానికి కనీస మద్దతు ధరకు పొంతన లేదు. గతేడాదితో పోలిస్తే ఎకరాకు సాగు ఖర్చు రూ.4 వేల వరకు పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ధర పెంచలేదు. జిల్లాలో మొత్తం నాలుగు చక్కెర కర్మాగారాలున్నాయి. 
చెరకు చేదే..(పశ్చిమగోదావరి)

వీటిలో భీమడోలు, తాడువాయి కర్మాగారాలు మాత్రమే పని చేస్తున్నాయి. ఇటీవల మంత్రివర్గం టన్నుకు రూ.2,750 మద్దతు ధరగా ప్రకటించింది. పోనీ డబ్బయినా రైతులకు అందుతుందా అంటే అదీ లేదు. ఎందుకంటే మద్దతు ధరను పంచదార రికవరీతో ముడిపెట్టింది. ప్రభుత్వం ప్రకటించిన ధర రావాలంటే రికవరీ శాతం పది ఉండాలి. రికవరీ శాతం తగ్గితే ఆ మేరకు ధర కూడా తగ్గుతుంది. ప్రతి 0.1 పాయింట్‌కు రూ.27.50 తగ్గుతుంది. ఇలా రికవరీ 9.50 వరకు లెక్కిస్తారు. అంతకన్నా తక్కువ రికవరీ ఉన్నా 9.5 రికవరీకి ఎంత డబ్బు చెల్లిస్తారో అంతే ఇస్తారు. తాడువాయి కర్మాగారం మాత్రం పది శాతం రికవరీ సాధిస్తోంది. ఇది రాష్ట్రంలో అత్యధిక రికవరీ సాధించే కర్మాగారంగా అధికారులు చెబుతున్నారు. ముగిసిన సీజన్‌లో భీమడోలు కర్మాగారం 9 నుంచి 9.5 వరకు రికవరీ సాధించింది. భీమడోలు కర్మాగారం టన్నుకు రూ.2,681 మాత్రమే చెల్లిస్తోంది.గతేడాదికి ఈ ఏడాదికి సాగు ఖర్చుల్లో విషయంలో పొంతన లేదు. గతేడాది గంట దుక్కు దున్నితే రూ.500 వసూలు చేసేవారు. ఇప్పుడు రూ.600 తీసుకుంటున్నారు. ఎకరా భూమి దున్నాలంటే మూడు నుంచి అయిదు గంటల సమయం పడుతుంది. దీని ప్రకారం దుక్కుకే 300 నుంచి 500 అదనంగా ఖర్చవుతుంది. దీనికి తోడు సాగు ఖర్చు పెరిగింది. చెరకు సాగుకు కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. నాట్లు నుంచి కలుపుతీత, జడ చుట్టు, నీరు పెట్టడం, కోత కోయటం వరకు ప్రతి పనికీ కూలీలపై ఆధారపడాల్సిందే. మహిళా కూలీలకు గతేడాది రూ.150 ఇస్తే ఈ ఏడాది రూ.200 అయింది. మగ కూలీలకు రూ.100 పెరిగింది. ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెరిగాయని రైతులు వాపోతున్నారు. జిల్లాలో చెరకు పండించే విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2017లో 12వేల హెక్టార్ల విస్తీర్ణంలో చెరకు పండిస్తే ఈ ఏడాది 8,100 హెక్టార్లకు పరిమితమైంది. దీన్ని బట్టి రైతులు చెరకు సాగు చేయడానికి ఎంత నిరాశక్తి చూపుతున్నారో అర్థమవుతోంది.

No comments:

Post a Comment