Breaking News

28/08/2019

కర్ణాటకలో సిద్ధప్పపై వేటు తప్పదా...

బెంగళూర్, ఆగస్టు 28, (way2newstv.in)
సిద్ధరామయ్యకు చెక్ పెట్టనుంది కాంగ్రెస్ హైకమాండ్. త్వరలోనే ఉన్న పదవి నుంచి కూడా తప్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని కర్ణాటకకు కాంగ్రెస్ హైకమాండ్ పంపించనుంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా కొనసాగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ పక్ష నేతతో పాటు సంకీర్ణ ప్రభుత్వంలో సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవి కూడా హైకమాండ్ కట్టబెట్టింది.కానీ సంకీర్ణ సర్కార్ కూలిపోవడంతో సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవి దానంతట అదే పోయింది. ఇక శాసనసభ పక్ష నేతగా సిద్ధరామయ్య వ్యవహరిస్తున్నారు. 
కర్ణాటకలో సిద్ధప్పపై వేటు తప్పదా...

అయితే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు సిద్ధరామయ్య పదవికి ఎసరు తెచ్చి పెట్టాయని అంటున్నారు. ప్రధానంగా మిత్రపక్షంగా ఉన్న జనతాదళ్ ఎస్ సిద్ధరామయ్య మీద నిప్పులు చెరుగుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ మిత్రపక్షాన్ని సంతృప్తి పర్చాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలు సిద్ధరామయ్య ను టార్గెట్ గా చేసుకున్న సంగతి తెలిసిందే. సిద్ధరామయ్య కారణంగానే ప్రభుత్వం కుప్ప కూలిపోయిందని ఇద్దరూ ఆరోపించారు. మరోవైపు సిద్ధరామయ్య కూడా వారిపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కర్ణాటకలో మనుగడ సాగించాలంటే దేవెగౌడ పార్టీతో మిత్రత్వం అవరసమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. దీనిపై హైకమాండ్ మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ వంటి నేతల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.సిద్ధరామయ్య స్థానంలో సీఎల్పీ నేతగా మరొకరిని నియమించాలన్న నిర్ణయానికి దాదాపు హైకమాండ్ వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరించేందుకు ఒక ప్రత్యేక బృందం కర్ణాటకకు రానుంది. ఎమ్మెల్యేలు, నేతల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ లో సీఎల్పీ పదవి కోసం లాబీయింగ్ ప్రారంభమయింది. అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. డీకే శివకుమార్, పరమేశ్వర్ వంటి నేతలు రేసులో ముందున్నారు. మొత్తం మీద సిద్ధరామయ్య పదవి ఊడిపోవడం ఖాయమన్న వ్యాఖ్యలు సర్వత్రా విన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment