Breaking News

06/08/2019

ఇతర స్టడీ సెంటర్ల పై ఉక్కుపాదం

వరంగల్, ఆగస్టు 6, (way2newstv.in)
రాష్ట్రేతర విశ్వవిద్యాలయలలో దూర విద్య ద్వారా చదివే డిగ్రీలు ఇకపై చెల్లవని చెబుతున్నారు ఉన్నత విద్యామండలి అధికారులు.. రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో చేసినా ఇదే వర్తిస్తుందంటున్నారు.నాగార్జున, వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, గీతం.. తదితర విశ్వవిద్యాలయాల పేర్లు వినగానే మనదగ్గర అందుబాటులో ఉన్న దూరవిద్య అధ్యయనకేంద్రాలు గుర్తుకొస్తాయి. తక్కువ సమయంలో డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తిచేయొచ్చని భావించి చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు దూరవిద్యను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ విశ్వవిద్యాలయాల నుంచి పొందిన పట్టాలు ఏమాత్రం చెల్లవనే విషయాన్ని మాత్రం ఎవరూ గుర్తించడం లేదు. దూర విద్య నిబంధనలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి మొద్దునిద్ర నటిస్తోంది. ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు చెల్లని పట్టాలతో బయటకు వస్తున్నా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.
ఇతర స్టడీ సెంటర్ల పై ఉక్కుపాదం

విశ్వవిద్యాలయాల అధ్యయనకేంద్రాలను ఏర్పాటుచేసేందుకు నిర్వాహకులతో పాటు సంబంధిత విశ్వవిద్యాలయ అధికారులు సైతం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కారణం.. సులభంగా డబ్బు సంపాదించడమే. అదెలాగంటే.. ఇతర రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యయనకేంద్రాలను ఇక్కడి ఏదైనా కళాశాలలో నెలకొల్పితే  ఎంఓయూ  పేరిట విద్యార్థులు తమ విశ్వవిద్యాలయానికి చెల్లించిన రుసుముల్లో 35 శాతం సదరు కళాశాల యాజమాన్యానికి చెల్లిస్తుంటాయి. దీనికితోడు ప్రవేశ రుసుములు, పరీక్ష సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి వసూలుచేసే రూ. వేల రుసుములు అదనం. తరగతులు చెప్పాల్సిన అవసరం లేదు. అధ్యాపకుల నియామకం అక్కర్లేదన్నమాట. కానీ, తరగతులు జరిగినట్లు చూపి విశ్వవిద్యాలయం నుంచి బిల్లులు పొందవచ్చు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు కళాశాల యాజమాన్యాలు స్థానిక ప్రసార మాధ్యమాల్లో కరపత్రాలు, వీడియోలు, ప్రకటనల రూపంలో ఆర్భాటంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందరినీ సులభంగా ఆకట్టుకుంటూ, యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కుతూ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే ఇష్టారీతిన ఈ అధ్యయనకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.స్టడీసెంటర్‌ అనగానే.. పరీక్షల్లో చూచిరాతలుంటాయని, సులభంగా పాసవ్వచ్చని విద్యార్థులందరిలోనూ గట్టి నమ్మకం ఏర్పడింది. గతంలో బయటపడిన పలు సంఘటనలు సైతం దీనికి అద్దంపడ్తున్నాయి. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అధ్యయనకేంద్రాల్లో ఎలాంటి తరగతులు జరిగిన దాఖలాలుండవు. ప్రయోగ తరగతుల ప్రశ్నేలేదు. విద్యార్థులు హాజరవటం దాదాపు శూన్యం. పోనీ, చదువుకునేందుకు పుస్తకాలైనా వస్తాయా అంటే.. అనుమానమే. పరీక్షల సమయానికి కాస్త ముందుగానే పుస్తకాలు ఇచ్చిన సందర్భాలూ లేకపోలేదు. అయినా పరీక్షలకు నేరుగా హాజరవుతారు. ఇట్టే పాసవుతారు. కోర్సు కాలవ్యవధి పూర్తవగానే ధ్రువపత్రాలు పొందుతారు. కారణం.. పుస్తకాల్లో ఉన్న అంశాలను చూసి రాయడమే అన్నది నిర్వివాదాంశం. విశ్వవిద్యాలయం నుంచి వచ్చే పరిశీలకులు సైతం వీటిపట్ల చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. పరీక్షలను ఆ విద్యార్థులే కాదు.. ఎవరైనా రాసే అవకాశం కల్పిస్తున్నారని, అవసరమైతే పరీక్షను విద్యార్థి తన ఇంటివద్దనే కూర్చొని రాసేందుకూ అనుమతిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తూ అధ్యయనకేంద్రం నిర్వాహకులు రూ. లక్షల్లో కూడబెట్టుకుంటున్నారు. ఎంతోకొంత విశ్వవిద్యాలయ అధికారులకు ముట్టజెప్తున్నారని తెలుస్తోంది.ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని నిర్మల్‌, మంచిర్యాల, కుమురంభీం, ఆదిలాబాదు జిల్లాల్లో ఇతర రాష్ట్రాల దూర విద్య డిగ్రీ, పీజీ అధ్యయన కేంద్రాలు 30కి పైగా ఉన్నాయి. ఇందులో సుమారు 150 రకాల కోర్సులున్నాయి. ఏటా సగటున 5వేలకు పైగా విద్యార్థులు దూర విద్య కోర్సులను అభ్యసిస్తున్నారు. కోర్సులను బట్టి సగటున ఒక్కో విద్యార్థి విశ్వవిద్యాలయ రుసుముల కింద రూ. 8 వేల వరకు చెల్లిస్తున్నారు. వీటితో పాటు పరీక్షల సమయంలో నిర్వాహకులకు అందజేసే డబ్బులు అదనం. ఈలెక్కన ఒక్క ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా నుంచే ఏటా రూ. 4 కోట్లకు పైగా ఆదాయం ఇతర రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు చేరుతున్నాయి.యూజీసీ టెరిటోరియల్‌ జ్యురీడిక్షన్‌- 2013 నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు ఏర్పాటుచేయడం, విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వాటిని నిర్వహించడానికి వీలులేదు. అంటే, దేశంలోని రాష్ట్ర, ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఏదైనా సరే.. తమ ప్రాంత, రాష్ట్ర భూభాగ పరిధిలో ఉన్న ప్రాంతాల్లోనే దూరవిద్య విధానంలో కోర్సులు అందజేయాలి. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కొన్ని విశ్వవిద్యాలయాలు తమ పరిధి దాటి పనిచేస్తున్నాయి. దూరవిద్య విధానంలో కోర్సులు అందజేయడమే కాకుండా ప్రత్యేకంగా అధ్యయన కేంద్రాలను (స్టడీసెంటర్లు) సైతం ఏర్పాటు చేస్తున్నాయి. విద్యార్థులను సులభంగా ఆకర్షించేలా వివిధరకాల డిగ్రీ, పీజీ, వృత్తివిద్య కోర్సులు, వివిధరకాల కాంబినేషన్ల పేరిట సుమారు 150 వరకు కోర్సులను పరిచయం చేస్తుండటంతో విద్యార్థులు సైతం వాటిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.2013 తర్వాత పదోన్నతుల కోసం చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు దూర విద్యా విధానంలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. నిర్దేశిత సమయంలో పట్టాలను సైతం అందుకుంటున్నారు. ఇలా పొందిన దూర విద్య డిగ్రీ, పీజీ పట్టాలను పదోన్నతులకై సర్వీసు పుస్తకాల్లో నమోదు చేసుకుంటున్నారు. కొంతమంది ఇప్పటికే పదోన్నతులు సైతం పొందారు. అయితే, ఉన్నత విద్యామండలి ఏపీ సహా ఇతర రాష్ట్ర విశ్వవిద్యాలయాల పరిధిలో జారీ అయిన ధ్రువపత్రాలు చెల్లవని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉద్యోగులు సమర్పించిన పట్టాల వివరాలను ఎలా పరిశీలిస్తారు, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వచ్చిన పదోన్నతి ఉంటుందా, లేక తొలగిస్తారా అనే అనుమానం ఉద్యోగులను వెంటాడుతోంది.ఉమ్మడి విద్యాప్రణాళిక ప్రకారం కోర్సుల పూర్తికి పదేళ్ల వరకు గడువున్నప్పటికీ అది కేవలం ‘రెగ్యులర్‌’ కోర్సులు పూర్తిచేసేందుకు, విశ్వవిద్యాలయాలను ‘మార్చుకునేందుకు’ మాత్రమే వర్తిస్తుంది. దూరవిద్య విధానంలో ఈ నిబంధన అమలుకాదని యూజీసీ స్పష్టం చేస్తోంది. ఉన్నతాధికారులు చెబుతున్న ప్రకారం ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలంటే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలే కాదు. పొరుగునే ఉన్న ఆంధప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల పట్టాలు సైతం ఇక్కడ చెల్లవు. 2013లో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయింది. ఫలితంగా ఆ సంవత్సరం నుంచి ఆంధప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల దూరవిద్య కోర్సులు ఇక్కడ, ఇక్కడి విశ్వవిద్యాలయాల కోర్సులు ఆంధప్రదేశ్‌లో చెల్లుబాటు కావు. అంటే, ఆంధప్రదేశ్‌కు చెందిన నాగార్జున, గీతం, వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ తదితర విశ్వవిద్యాలయాలు ఇక్కడ నిర్వహిస్తున్న దూరవిద్య అధ్యయనకేంద్రాలు, అవి ఇచ్చే పట్టాలు నిరర్థకమని స్పష్టమవుతోంది. అయినప్పటికీ ఈ నిబంధనను తుంగలోతొక్కి తమ పనిని కానిచ్చేస్తున్నాయి.

No comments:

Post a Comment