Breaking News

12/08/2019

ఆరొందలే... మూడు సేవలు

ముంబై, ఆగస్టు 12 (way2newstv.in - Swamy Naidu):
టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఆ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా అందిస్తామని వెల్లడించిన విషయం విదితమే. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత కొంత సేపటి క్రితమే జరిగిన రిలయన్స్ 42వ ఏజీఎంలో ఆ వివరాలను వెల్లడించారు. కాగా జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్‌లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు క్షుణ్ణంగా వివరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా జియో 4కె సెట్ టాప్ బాక్స్‌ను తీర్చిదిద్దినట్లు ఆకాష్, ఈషా అంబానీ తెలిపారు. ఒక్క బాక్స్‌లోనే అనేక సదుపాయాలను వినియోగదారులకు అందివ్వడం జరుగుతుందన్నారు. 
ఆరొందలే... మూడు సేవలు
ఈ బాక్స్ ద్వారా 4కె అల్ట్రా హెచ్‌డీ నాణ్యత కలిగిన టీవీ ప్రసారాలను వీక్షించవచ్చని అన్నారు. అలాగే వర్చువల్ రియాలిటీ, అగ్‌మెంటెడ్ రియాలిటీలను కలిపి నూతనంగా ఎంఆర్ పేరిట మరో సదుపాయాన్ని ఈ బాక్స్‌లోని పలు యాప్స్‌లలో అందిస్తున్నట్లు తెలిపారు. వాటి ద్వారా వినియోగదారులు షాపింగ్‌కు వెళ్లకున్నా.. ఇంట్లోనే ఉండి దుస్తులను ట్రై చేయవచ్చని, తమకు నచ్చే దుస్తులను వర్చువల్ రియాలిటీలో చూసుకుని అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చని తెలిపారు. కాగా జియో 4కె సెట్ టాప్ బాక్సు ద్వారా వినియోగదారులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎవరికైనా ఉచితంగా వీడియో కాల్స్ చేసుకోవచ్చని ఆకాష్, ఈషాలు తెలిపారు. ఇందుకు గాను జియో కాల్ పేరిట ఓ యాప్‌ను అందిస్తున్నామని తెలిపారు. ఇక ఈ బాక్సులో హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్‌హోం ఫీచర్లను కూడా అందిస్తామని తెలిపారు. జియో 4కె సెట్‌టాప్ బాక్సు ఫీచర్లను వెల్లడించడానికి ముందు ఆకాష్, ఈషా అంబానీలు జియో బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను టెస్ట్ చేయగా.. అది ఆశ్చర్యంగా 1జీబీపీఎస్ వరకు నమోదు కావడం విశేషం. కాగా జియో గిగాఫైబర్‌తో అందివ్వనన్న బ్రాడ్‌బ్యాండ్‌తో కనీసం 100 ఎంబీపీఎస్ మొదలుకొని గరిష్టంగా 1 జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తామని ముఖేష్ అంబానీ వెల్లడించారు. దీంతో వినియోగదారులు 4కె అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వీడియోలను కూడా ఎలాంటి బఫరింగ్ లేకుండా వీక్షించేందుకు వీలు కలుగుతుంది.

No comments:

Post a Comment