విశాఖపట్టణం, ఆగస్టు 12 (way2newstv.in - Swamy Naidu):
విశాఖ సముద్ర తీరంలోని ఓడరేవులో ఓ నౌకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఔటర్ హార్బర్‌లో ఉన్న నౌక ‘జాగ్వార్ టగ్’లో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న 28 మంది సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. కానీ, వీరిలో చాలా మంది మంటల్లో కాలి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 29 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ప్రమాదంలో ఐదుగురి సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
వైజాగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం
వీరిని సమీపంలోని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా హార్బర్ పరిసర ప్రాంతాల్లో పొగ కమ్ముకుంది. జాగ్వార్ టగ్‌లో మంటలను అదుపు చేసేందుకు తీరం నుంచి మరో రెండు నౌకలను, బోట్లను పంపించారు. సహాయక చర్యల్లో నౌకలు రాణి రోష్మణి, చార్లి సీ-432 పాల్గొన్నాయని కోస్టు గార్డు అధికారులు తెలిపారు. ఐసీజీఎస్ సముద్ర పహెర్దార్, ఐసీజీ హెలికాప్టర్‌ను కూడా సహాయ చర్యల్లో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెప్పారు. ఔటర్ హార్బర్‌లో సివిల్ పనుల కోసం సిబ్బందిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. జాగ్వార్ నౌకను పోర్ట్ పనుల కోసం విశాఖ హార్బర్ అద్దెకు తీసుకుంది.
No comments:
Post a Comment