Breaking News

01/08/2019

నిజామాబాద్ బీజేపీలో గ్రూపుల లొల్లి

నిజామాబాద్, ఆగస్టు 1, (way2newstv.in)
నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది బీజేపీ. ఇదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అయితే పార్టీలోని అంతర్గత విభేదాలు... ఆ పార్టీ కార్యకర్తలను గందరగోళంలో పడేస్తున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలోని ఇద్దరు ముఖ్యనేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ కారణంగా... పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో నిజామాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన యెండెల లక్ష్మీనారాయణ, ప్రస్తుతం నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య కొనసాగుతున్న గ్యాప్ కారణంగా బీజేపీ శ్రేణుల్లో కన్ప్యూజన్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ధర్మపురి అరవింద్ వర్గం సహకరించలేదని యెండెల లక్ష్మీనారాయణ వర్గం ఆగ్రహంగా ఉంది. 
నిజామాబాద్ బీజేపీలో గ్రూపుల లొల్లి

మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో యెండెల వర్గం తమ కోసం పని చేయలేదని అరవింద్ వర్గం గుర్రుగా ఉంది. చాలాకాలంగా ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న ఈ గ్రూపు విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇద్దరు నేతలు ఎవరికి వారే వేర్వేరుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లాలో తనకంటూ ప్రత్యేకంగా వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ధర్మపురి అరవింద్ వర్గం ప్రయత్నాలు చేస్తుందని... సీనియర్లను పట్టించుకోవడం లేదని యెండెల వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తాము ఎవరికి అనుకూలంగా వ్యవహరించాలో అర్థంకాక పార్టీ నేతలు తికమకపడుతున్నారని తెలుస్తోంది. ఒకరికి అనుకూలంగా ఉంటే మరొకరికి కోపం వస్తుందని ద్వితీయ శ్రేణులు భావిస్తున్నారని సమాచారం. ఎవరిని నమ్మితే తమకు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ వస్తుంది... ఎవరు తమను గెలిపిస్తారనే విషయం వారికి అర్థంకావడం లేదని టాక్. ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించడానికి రాష్ట్రస్థాయి నేతలు కూడా దృష్టి పెట్టడం లేదని... ఇది జిల్లాలో పార్టీకి నష్టం కలిగిస్తుందని బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మరి... టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో బలపడేందుకు బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి.

No comments:

Post a Comment